ఈ పుట అచ్చుదిద్దబడ్డది

376

హరివంశము

శివుఁడు సపరివారుండై శ్రీకృష్ణునిఁ గాన వచ్చుట

మ. కనియెం దార్క్ష్యసుదర్శనాదినిజభక్తప్రత్యహాపాదితా
     ర్చనహోమోచితవస్తుసంచయపురోజాజ్వల్యమానానలున్
     ఘనకృష్ణాజినవాసు భాసురజటాకల్పున్ సుసంకల్పు భా
     వనిరుద్ధేంద్రియు సత్సమాధిపరతావర్ధిష్ణునిం గృష్ణునిన్.34
క. కని నెమ్మనము కృపారస, మునఁ [1]దోఁగఁగ సుప్రసన్నముఖుఁ డగుచు శివుం
     డనురాగంబునఁ దనవా, హన మగు వృషభమ్ము డిగ్గె నతివయుఁ దానున్.35
క. వెన్నుఁడు నవ్విభు దవ్వులఁ, గన్నంతన నిజసమాధికలితాసనమున్
     గ్రన్నన విడిచి యెదురుసని, సత్నతమౌళి యయి భక్తిసంభరితమతిన్.36
వ. కేలు మొగిచి ఫాలంబునం గదియించి ఫాలనయనుమూర్తిఁ దప్పక చూచుచుండె
     నట్టియెడ.37
సీ. ఔఁదలఁ జదలేటిలేఁదరఁగలు బాలుఁ డగుచందమామ నుయ్యాల లూపఁ
     నొడవుల తలలఁ జెన్నడరుమానికములచాయ దిక్కుల నెఱసంజ వఱుపఁ
     దోరంపుటేనికతోలి[2]యేడ్తెఱ కప్పుకుత్తుకకఱతోడఁ బొత్తు సేయ
     దట్టంపుభూతిపూఁతలు బూదిపఱచినపునుకలపే రురంబునఁ దలిర్ప
తే. మూఁడులోకంబులును గావ మొనసినట్లు, చేత ముమ్మొనకయిరువు చెన్ను మీఱ
     వేల్పుఁబదువుచూడ్కికిఁ గడువింతవేడ్క, సేసె ముక్కంటియున్నయాచెలువుపేర్మి.38
క. హరిఁ జూతురు హరుఁ జూతురు, హరిఁ జూతురు గ్రమ్మఱంగ హరుఁ జూతురు ని
     ర్జరులును మునులును నిమ్మెయి, హరిహరతత్త్వయుగవిస్మితాలోకనులై.39
వ. అందఱు నయ్యిరువురకుం బ్రణామంబులు సేసి యంజలిపుటంబులు ఘటియించి.40
సీ. యజ్ఞరక్షకుఁడును యజ్ఞవిధ్వంసియు నై లోకనుతులఁ బెంపారువారు
     కందర్పజనకుండు గందర్పదర్పైకదమనుండు నై లీలఁ దనరువారు
     భువనసంభర్తయు భువనసంహర్తయు నన నాత్మగుణకృత్యులైనవారు
     భూధరోద్ధారియు భూధరావాసియు నగుట నిత్యప్రీతి నెగడువారు
తే. విషధిజాతంబు లగురత్నవిషము లురముఁ, గప్పుకంఠంబుఁ గైసేయ నొప్పువారు
     భుజగశయనుండు భుజగవిభూషణుండు, నెపుడు గరుణతో వరదు లయ్యెదరు మాకు.41
క. ఈరెండుమూర్తులును నిం, పారఁగ నిటు గదిసియుండ నంతఃకరణం
     బారాధింపం గనియెడు, ప్రారంభము లెల్లఁ బ్రాప్తఫలముల మాకున్.42

శ్రీకృష్ణుఁడు శివుమాహాత్మ్యం బభివర్ణించి స్తుతియించుట

వ. అనుచుండం బుండరీకాక్షుం డట్లు ప్రత్యక్షమూర్తి యైనయష్టమూర్తికి సాష్టాంగ
     ప్రణతుండై యి ట్లని వినుతించె.43

  1. రోగన్
  2. యుత్తెర