ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉత్తరభాగము - ఆ. 5.

345

చ. వెలువడిపోయి సర్వపృథివీపతులుం దనుఁ జేరరాఁగ వా
     రలఁ దగుభంగులం గని పురస్క్రియ లోలిన యెల్లవారి క
     గ్గలపుఁ బ్రియంబుతో నడపి గౌరవ మొప్పఁగ వారు సుట్టునుం
     బలసి భజింపఁ జంద్రుఁ డుడుపఙ్క్తులలోఁ జెలువొందుచాడ్పునన్.7
తే. అధికముగ నొప్పి కొలువుండి యధిక భాష, ణములఁ దన్మానసముల కానంద మొసఁగి
     వరుస వివిధమహానర్ఘ్యవస్త్రకోటి, గణన మిగులంగ వారికిఁ గట్ట నిచ్చి.8
క. నావారు నేను ధనమును, మీవారము మీధనంబు, మీమదికిఁ బ్రియం
     బోవీరులార! యడుగుం, డేవైనను దెచ్చియిత్తు నెచ్చటివైనన్.9
క. అని పలికి వారినెయ్యము, దనరఁ బలుకుసదృశహృద్యతమవాక్యములం
     దనమన మలరఁగ గోష్ఠికి, బనుపడి యేపారి యచటఁ బ్రభుఁ డున్నతఱిన్.10
చ. కదలనిక్రొమ్మెఱుంగుపొడ గల్గిన శారదనీరదం బొకో
     యిది యని సంశయించుచు మహీపతు లెల్లను మీఁదు చూడఁగా
     నొదవుపిశంగజూటమును నుజ్జ్వలదేహ మెలర్పఁ దోఁచె నా
     రదుఁడు ముకుందుసద్గుణపరంపర వీణ గదల్చి పాడుచున్.11
వ. తదనంతరంబ సంపూర్ణసుధాకరుండు వసుధాతలంబునకు నవతరించువిధంబున
     దివిజపథంబుననుండి యారాజసమూహంబునడిమికి నవతీర్ణుండై యందఱచేత
     ససంభ్రమసముజ్ఞానంబుల నంజలివిరచనంబులఁ బూజ్యమానుం డగుచు మాధవుం
     గనుంగొని సకలజనశ్రోత్రసుందరం బగుచందంబు గలయెలుంగున గలయం
     గనుంగొని.12
క. అమరులు లోనగుజనములు, [1]నమితాద్భుతకీర్తితో మహాధన్యుడవో
     కమలాక్షు నీవు నీతో, సము లెవ్వరు నిక్కమునకుఁ జర్చింపంగన్.13
తే. అనిన నవ్వుచు నవ్విభుఁ డతనితోడ, ననఘ యద్భుతాత్మకుఁడ నత్యంతధన్య
     తముఁడ నగుదు నే నొకఁడన విమలదక్షి, ణాభ్యుపేతసద్భావన యమరునేని.14
ఉ. నావిని నారదుండు యదునాయక నాచనుదెంచునట్టి కా
     ర్యావధి సిద్ధ మయ్యెఁ బ్రియ మందితిఁ జెచ్చెరఁ బోయి వచ్చెద
     న్నీవును నీమహీవిభులు నిర్భరహర్షము నొందుచుండుఁ డి
     చ్ఛావిహితానులాపసరసస్థితి సౌహృదగోష్ఠి నిచ్చటన్.15
సీ. అని గమనోద్యుక్తుఁ డగుమునీశ్వరుఁ జూచి జననాథు లాజనార్దనునితోడ
     నిమ్మహాతుఁడు వచ్చి యిప్పుడు నిన్ను నుద్దేశించి పలికినతెఱఁగు నితని
     కిపుడు ప్రత్యుత్తర మిచ్చిన విధమును గూఢార్థమైనది గోరి యితఁడు
     నింతన సంతోష మెంతయుఁ గని పోవఁ గడఁగెడుఁ దెలియంగఁ గడిఁది మాకు
తే. నిట్టి యీదివ్యసంకేత మేర్పరించి, తెలుపు తెలుపంగఁ దగునేని జలజనాభ
     యనినఁ గృష్ణుండు మీకు నియ్యతివరుండ, దీని నెఱిఁగించు ననుటయు దేవమునియు.16

  1. నమితోద్భవమూర్తి యగు