ఈ పుట అచ్చుదిద్దబడ్డది

342

హరివంశము

     బగుకాలంబు కేళిసలిపి భూభారావతరణం బొనర్చి సమంచితోద్యానప్రాకార
     గోపురశోభిని యగునిజరాజధాని నంబుధికి సమర్పించి మానుషత్వంబు త్యజించి
     యాత్మప్రకృతియందు సందీప్తుం డయ్యెడు నిట్టి మాహాత్మ్యంబునం బరఁగు
     నియ్యాదిదేవుండు.264
చ. అనుపముఁ డప్రతర్క్యుఁ డజరామరుఁ డాఢ్యుఁ డనంతుఁ డచ్యుతుం
     డనఘుఁ డపేతదోషుఁ డనపాస్తగుణుం డతివాఙ్మనఃప్రవ
     ర్తనుఁడు నితాంతభక్తికలితస్థితిఁ దన్ భజియించు పుణ్యుల
     న్మనుచు సమస్తసంపదసమానులఁగాఁ బరికించు సత్కృపన్.265
క. మీరును నివ్విభుమహిమల, నారసి కనుఁగొని కృతార్థతావాప్తికి నై
     యారూఢి మనోవాక్క, ర్మారబ్ధసపర్యు లగుఁ డనారతభక్తిన్.266
క. అని చెప్పిననారదముని, ననఘులు యాదవులు బహువిధార్చనములఁ బ్రీ
     తునిఁ జేసిరి హరి వీడ్కొని, చనియె నతం డాత్మయోగసన్నద్ధగతిన్.267

శ్రీకృష్ణుఁడు పారిజాతకుసుమసమర్పణంబున సత్యభామాదులకుఁ బ్రియంబు సేయుట

వ. గోవిందుండు నందఱం బ్రియపూర్వకంబుగా వీడ్కొలిపి యుగ్రసేనవసుదేవులఁ
     దన్మందిరంబుల కనిపి నిజదివ్యగేహంబు ప్రవేశించి ప్రతిదివసోచితంబు లగు నభి
     మతవిహారంబులం బ్రవరిల్లుచు.268
సీ. ఎలరారుక్రొవ్విరు లెత్తులు గట్టి యొయ్యారంపుఁగ్రొమ్ముడి నలవరించి
     పరువంపుఁబుప్పొడి బాగుగాఁ దీర్చినయలకలపైఁ బొలుపార నలికి
     జిగిదేఱు నెసకంపుఁజగురు [1]చెక్కున నీడ గానరా నవతంసకం బొనర్చి
     నవకంబు మీఱుక్రొన్ననదండ సవరించి వలిచన్నుఁగవకుఁ జె న్నొలయఁజేసి
తే. సర్వకాలసమృద్ధి నాశ్చర్యమైన, పారిజాతంబు సిరియెల్లఁ బ్రణయ మలర
     సత్యభామకు నిచ్చి నిచ్చలుఁ బ్రమోద, జలధి నోలాడె సరసతాకలన వెలయ.269
వ. మఱియు నతండు.270
క. ఆకల్పతరువు గురియు న, వాకల్పోత్కరము లమ్మృగాక్షి నిజసప
     త్నీకోటి కొసఁగి పెంపుం, గైకొనఁ గని యలరు నంతఁ గామోత్సవుఁడై.271
మ. తనప్రత్యర్థులఁ గూల్చి యాత్మవిభవస్థైర్యంబు గావించి నాఁ
     డని యవ్విష్ణుదెసం దిరం బగుప్రియం బందంగ గర్తవ్యమై
     నను దేవేంద్రుఁడు పారిజాతతరుశూన్యం బైనయుద్యానమున్
     గనుపౌలోమిమొగంబు దైన్యమునకుం గాఁ గందుఁ దా నద్దివిన్.272
తే. అదితిదేవికి మణికుండలార్పణంబు, శచికిఁ బారిజాతావతంసకవిరతియుఁ
     జేసి హరిభక్తి వాసవుచిత్తమునకు, మోదఖేదపాత్రత తుల్యముగ నొనర్చె.273

  1. నెక్కొన నీడ కానరా