ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉత్తరభాగము . ఆ. 2.

273

క. మును గోవిందునియింటికిఁ, జనుదెంచినఁ గాంచి యధికసంప్రీతి నెదు
     ర్కొని తత్పదములకుఁ బ్రణతి, [1]యొనర్చి కావించె నాతఁ డుచితార్చనముల్.99
వ. అయ్యగ్రజుం డయ్యనుజసహితంబుగాఁ జని నిజజనకుం గని ప్రణతుం డైనం
     దీవించి కౌఁగిలించి యవ్వసుదేవుండు గోకులంబు కుశలం బడుగ నాబలభద్రుండు
     భద్రంబుగా నఖిలంబు నుపన్యసించె మఱియుం బుత్రు లిరువురు నుచితచిత్ర
     కథావిన్యాసం బొనర్చి తండ్రిం బ్రముదితుం జేసి రట్టిప్రవర్తనంబునం గొంతకాలం
     బరుగుటయు.100
క. ఒకనాఁడు సకలయాదవ, నికరసభాంతరమునందు నీరజనాభుం
     డకుటిలమనస్కుఁ డిట్లని, ప్రకటార్థం బైనపలుకు పలికెం బ్రీతిన్.101
సీ. వినుఁడు యాదవకులవీరు లందఱు నవధానంబుతోడ మద్వాక్యసరణి
     మనకు నీవాస మిమధుర యిప్పురిఁ బోలఁ బురి లేదు మనభూమిఁ బోల భూమి
     యెందును బుట్ట దే మిప్పురంబునఁ బుట్టి పెంపార వ్రేపల్లెఁ బెరిగి వచ్చి
     యిచ్చట నైశ్వర్య మిట్లు ప్రాపించితి మింతలోఁ బగ బలవంత మయ్యె
తే. సర్వపార్థివులును జరాసంధుఁ గూడి, యెంత లెంతలు చేసిరి యెఱుఁగ రెట్లు
     మనము నొకభంగి నెడరెల్ల మఱచి యంత, నున్న వారము తుదిముట్టనునికి వ్రేఁగు.102
మ. చెలులుం జుట్టలు హేమరత్నములు హస్తిస్యందనాశ్వంబులున్
     బలవద్యోధసముత్కరంబులును సంపన్నంబుగాఁ గల్గియున్
     సెల వేమీ యిటు లంతకంత కహితశ్రేణీసమాఘాతసం
     కలనం దూలి నశింప నిట్టి యభిషంగం బోర్వఁగా వచ్చునే.103
వ. కావున నింక నిక్కడ నివాసంబు నాకుం జూడఁ గర్తవ్యంబు గాదు వేఱొకచోటు
     సంపాదించెద నయ్యెడకు నిందఱము నరిగి సుఖంబున నుండుద మిది మీ మనం
     బులకు రుచియింపవలయు ననిన వారునుం దమలో విచారించి.104
ఉ. వైరి యవధ్యుఁ డాతనికి వారక యెన్నఁగ బెద్దసైన్యముల్
     సారభుజోద్ధతిం దొడఁగి చంపుదు మేని ననేకవర్షవి
     స్తారములందునుం దెగవు సంక్షయ [2]మొందును వారియస్మదీ
     యోరుచమూసమూహ మిటు లూరక యేటికి నింద చావఁగన్.105
వ. ఇది సాపాయస్థలంబు పరిత్యజింప వలయు నమ్మహాపురుషుం డెట్లు పనిచె నట్ల
     చేయుద మని తత్ప్రకారం బాకంసవైరితోడం దెలియఁ బలికిన నతండు ప్రీతుం
     డయి యొక్కదుర్గమప్రదేశంబు దన మనంబునంద నిశ్చయించి సకలజనంబులకు
     నిర్గమసన్నాహం బాజ్ఞాపించె నాలోనన.106
ఆ. కాలయవనుఁ డనఁగఁ గాలకల్పుఁడు శత్రుఁ, డేచి మధురమీఁద నెత్తుదేరఁ
     గదిలె ననికి నపుడ యొదవి జరాసంధుఁ, డును గడంగె ననియు వినియె నొకట.107

  1. యొనరిచి
  2. మొందు నపారయస్మదీ