ఈ పుట అచ్చుదిద్దబడ్డది

216

హరివంశము

     యనేక నరనారకోపాయనసహస్రంబు లజస్రంబు లై క్రందుకొను కరి
     తురగస్యందనసుందరవస్తువిస్తారంబుల నత్యుదారం బగు కంసమందిరద్వారంబు
     ప్రవేశించి.41
ఉ. చేరి నరేంద్రు లర్చనలు సేయఁగఁ గింకరలక్షరక్షితం
     బై రమణీయకాంచనమహామణినిర్మిత మైన యాయుధా
     గారము గాంచి భోజవిభుకార్ముక మెయ్యది చూచువేడ్కచే
     దూరము వచ్చినార మని దోహల మేర్పడఁ బల్కి రచ్చటన్.42
వ. రక్షకులు సూపఁ దక్షకాహిదేహదండంబు చాడ్పునఁ బ్రచండం బగు కార్ము
     కంబు చూచి రంతఁ గృష్ణుండు.43
తే. దీని నెక్కిడ దివిజులు దానవులునుఁ, జాల రని చెప్ప విందు మాశ్చర్యభూత
     మెవ్విధమొ చూత మని లీల నేకకరము, నంద కైకొని యపుడు సజ్యముగఁ జేసి.44

శ్రీకృష్ణుడు కంసునాయుధాగారంబు చేరి కంసశరాసనధ్వంసంబు చేయుట

మ.జను లెల్ల న్వెఱగంది చూడఁగఁ బటుజ్యానాదపూర్వంబుగా
     నొనరించెం బరిపూర్ణముష్టిఁ బిడిపట్టొక్కింత నిశ్చింతుఁ డై
     యనయంబున్ సడలించి విల్లు విఱిచెన్ [1]హర్యశ్వహస్తాయుధా
     [2]హననధ్వస్తమహీధ్రమస్తకకరోరాఘోష ఘోరంబుగన్.45
వ. ఇట్లు ధూర్జటి ధనుర్ధండదళనోద్దాముం డైన రాముండునుం బోలె రామావర
     జుండు భోజశరాసనంబు శకలంబులు గావించి తాను గానివాఁడునుంబోలె సందడి
     లోన సురిగి యన్నమున్నుగా నల్లన సముల్లసితగమనంబున శస్త్రాగారంబు వెలు
     వడియె నంతఁ దదీయరక్షుకు లొండొరులం గడవ నంతపురంబునకుం జని జనపతిం
     గని యంగంబులు వడంక నెలుంగులుం గుత్తుకలం దగుల ని ట్లనిరి.46
సీ. అవధరింపుము దేవ యాశ్చర్య మొక్కటి మనవిల్లు పూజించు మందిరంబు
     లోనికి నిద్దఱు లోకాధికం బగు తేజంబుగలవారు దేవనిభులు
     నవయావనులు మనోజ్ఞవిచిత్రగంధమాల్యాలంకృతాంగులు నీలపీత
     వసనులు దివినుండి వసుధపై కుట్టిపడ్డట్టు లెవ్వరు వీర లని యెఱుంగ
తే. నేరకుండ నేతెంచిరి వారిలోనఁ, దెల్లడామరఱేకుల ట్లుల్లసిల్లు
     కన్నుదోయి నొప్పారేడు కఱ్ఱియాతఁ, డొకఁడు వెసఁబుచ్చుకొనియె వి ల్లొక్కకేల.47
చ. కొన నితఁ డెవ్వఁ డిచ్చటికిఁ గొంకక యేటికి వచ్చె నేల యి
     య్యనుపమకార్ముకం బిట రయంబునఁ గేల ధరించె నంచు నే
     మనయము విస్మయంబు పడునంతటిలోఁ దిగిచె న్నరేంద్ర భ
     ల్లన విఱుఁగంగఁ జెప్పఁ దడ వయ్యెడు చెప్పెడుమాత్రయింతయున్.48

  1. హర్యశ్వునస్థ్యాయుధా, హననధ్వస్త.
  2. ననవిధ్వస్తమహేంద్రమస్తకవితానప్రౌఢ ఘోరంబుగన్.