ఈ పుట అచ్చుదిద్దబడ్డది

176

హరివంశము


తే.

నీవ గతియును మతియును నీవ పతియు, నీవ ధాతవు నేతవు నిజము మాకు
నీకతంబున వ్రేపల్లె నిర్భయత్వ, మమర నున్నది త్రిదివంబు ననుకరించి.

141


మ.

జననం బాదిగ నీవొనర్చుపను లాశ్చర్యంబు లుర్వీతలం
బున నెవ్వారికిఁ జూడఁ జేయను దలంపుల్ సొన్పఁగా రామి నే
మనిశంబు భయవిస్మయాకులత నూహాపోహముగ్ధస్థితిన్
గనుచు న్నిన్ను నెఱుంగలేము దురహంకారగ్రహాలీఢతన్.

142


మ.

బలవిక్రాంతి[1]యశంబులన్ బలరిపుం బ్రస్ఫారలక్ష్మీవిభా
కలనం బూర్ణశశాంకు శక్తిగరిమన్ గాంగేయు నేభంగి వే
ల్పులలోన న్గణుతింతు రాతరముగాఁ బోల్పం దగుం గాక ని
న్నిలలో మర్త్యునిమాత్రగాఁ దగునె యూహింపంగ మోహాంధతన్.

143


వ.

కావున నీ వుపదేశించిన మార్గంబునం బర్వతయజ్ఞంబు ప్రవర్తించువారము శక్ర
యజనంబు మానితిమి. భవదీయవాక్యంబు వారాశికి వేలయుంబోలె లోకంబులకు
ననతిక్రమణీయంబు దీని నిరాకరింప నెవ్వాడు శక్తుండు మమ్ము నింత యన నేల
యని పలికి నంత గోపప్రముఖులు భూదేవతల రావించి పుణ్యాహవాచనపురస్స
రంబుగా గిరియజ్ఞమహోత్సవంబునకు నుపక్రమించి రంత.

144


సీ.

కైసేసి గోపాలకామిను లొండొండ యాబాలవృద్ధులై యరుగుదేరఁ
దగదళత్కుసుమావతంసులై గోపకుమారు లంతటికిని దార కడఁగఁ
బాయసంబులు నపూపంబులు మోదకంబులును లోనగునన్నములును బెక్కు
మాంసంబులును హృద్యమధువులు బహువిధవ్యంజనంబులును దధ్యాజ్యదుగ్ధ


తే.

ములును గావళ్ల బండ్లను వలయుభంగి, నిడి యధోచితజనము లింపెలయనడువ
వివిధవాదిత్రములు మ్రోయ వృద్ధగోపు, లోలి నడపింప జాతర యొప్పుమిగిలె.

145


వ.

ఇవ్విధంబునం జని గోవర్ధనంబునకు నత్యంతసమీపంబున గోమయవిలిప్తంబును
రంగవల్లివిచిత్రంబును నగుమనోహరస్థలంబున నందఱుం గృష్ణుం బరివేష్టించి
నిలువ నతండు తాన యధ్యక్షుండై యయ్యజనోపకరణంబు లన్నియుం గైకొని
మహనీయస్థండిలంబున నమ్మహాశైలంబు నుద్దేశించి మహితార్చనంబు చేసి [2]బహ్వ
పూపసూపపశూపహారసహితం బగునైవేద్యంబు సమర్పించి యఖిలగోపాలుర
నక్కొండకుఁ బుష్పాంజలు లొసంగను నమస్కారంబులు గావింపనుం బనిచి.

146


ఉ.

స్థావరమూర్తి యైనతనుఁదా నచలాకృతితోడ నిట్లు సం
భావితుఁ జేసి యమ్మెయిన పర్వతశృంగమునందుఁ దోఁచి గో
పావళు లెల్ల నద్భుతమయాత్మతఁ జూడఁగఁ గేలుసాఁచి యా
దేవుఁడ యారగించెఁ గడుఁదెల్లముగా నుపహార మంతయున్.

147
  1. మహంబులన్
  2. బహు