ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పూర్వభాగము . ఆ. 7

167


తే.

కఱకుటెండదాఁకిన తొగకామభంగి, బాఁపఱేనిమే నెంతయు బలము దఱఁగి
స్రుక్కె నింద్రియంబుల యేపుడక్కెనూర్పు, లొయ్యనొయ్యన డింద[1]ఁ గుట్టుసుఱుదక్క.

51


వ.

ఆసమయంబున.

52


క.

లయకాల కేళితాండవ, భయంకరుం డైనభర్గుభంగిఁ దనరుకా
ళియమౌళిరంగ నటునకు, జయ వెట్టిరి సకలలోకచారులుఁ బ్రీతిన్.

53


వ.

ఇబ్బంగి నత్యంతదురవస్థం బొందినయద్దందశూకప్రవరుండు వివశం బగుమాన
సంబు నెట్టకేలకు నూలుకొల్పి గోవిందచరణారవిందంబులక్రింద నున్నయట్ల
యుండి భీతివిహ్వలంబు లగుజిహ్వలు దొట్రిల్ల నల్లన దీనస్వరంబున నప్పురు
షోత్తము నుద్దేశించి యిట్లనియె.

54


మ.

నిను సర్వాధికుఁగా నెఱుంగక కడున్నీచుండనై నీచపుం
గినుక న్నీమహనీయదేహమునకుం గీ డిట్లు గావించితిం
జనునా క్రొవ్వునకింతవట్టు త్రిజగజ్జన్మస్థితిధ్వంసముల్
పొనరింపంగఁ బ్రభుండ వీకొలఁదితప్పుల్ సైఁచు టొప్పుం గృపన్.

55


క.

నీ విమ్మెయి దండించుట, దేవా! నిర్విషుఁడ నైతిఁ దెలివియు శమమున్
భావమున నొలసె నీపను, లేవియయినఁ జేయువాఁడ నే వశ్యుఁడ నై.

56


తే.

అజసురేంద్రాదులకుఁ జేర నలవిగాని, యుష్మదీయపదాంభోజయుగళి నాదు
తలలు సోఁకుటఁ జరితార్థతముఁడనైతిఁ, గడఁగి నీయాగ్రహము ననుగ్రహమయమయ్యె.

57


తరువోజ.

జయ సర్వభూతేశ జయ సర్వవరద జయ సర్వరక్షక జయ సరోజాక్ష
జయ జగద్వందిత జయ జగన్నాథ జయ జగద్ధారక జయ విశ్వరూప
జయ కృష్ణగోపాల జయ మహాసత్వ జయ పూతనాఘాత జయ దైత్యదమన
దయనిము జీవితదానంబు నాకు [2]తగశరణాగతత్రాతవు గావె.

58


చ.

అని శరణంబు వేఁడిన మహాహివరేణ్యుని సత్యకీర్తనం
బునకుఁ గృపార్ద్రచిత్తుఁ డయి పుష్కరలోచనుఁ డాక్షణంబ యా
తని కభయం బొనర్చిన నతండును దత్కరుణార్ద్రదృష్టిపా
తనము సుధా[3]రసం బగుచుఁ దన్ను సచేతనుగా నొనర్చినన్.

59


వ.

తనఫణపంచకంబునుం దచ్చరణాగ్రంబులు మోవం బ్రణామంబులు చేసి ముంచట
నిలుచున్న నద్దేవుం డతని కి ట్లనియె.

60

శ్రీకృష్ణుడు కాళియుని యమునాప్రవాహంబు వెడల నడుచుట

సీ.

ఇదియాదిగా నిన్ను నీ యమునానది వసియింపనీ నేను వార్థిగుఱిచి
సకుటుంబకంబుగాఁ జనుము జలస్థలచారులై యున్ననీవార లెల్ల
నీతోన చనుదెంతు రీతోయములు భవద్విషయోగమునఁ దొల్లి విషము లగుట
నిజముగా నట్లుండె నేఁడు నిర్విషము లై యమృతనామకము తథ్యముగఁ దాల్చి

  1. గ నుసురు చిక్కె
  2. భయశరణాగతిఁ బ్రార్థింతు నిన్ను
  3. మయం