పుట:హరవిలాసము.pdf/41

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వ. ఇవ్విధంబునఁ దారకాసురుండు కాసరాక్ష తామ్రాక్ష ధూమ్రాక్ష చతురోదగ్ర ఖడ్గరోమ బాలబిడాల కాలనేమి ప్రధాన నానాబంధుసహాయుండై పాకశాసన పావక పరేతరాజ పలలాశి పాశి పవన పౌలస్త్య పన్నగాభరణులఁ బరిభవించి నిర్జరులం దర్జించి కిన్నరుల వెన్నుసూచి కింపురుషులఁ జంపి గరుడులఁ బడలుపఱచి గంధర్వుల బంధించి గుహ్యకుల సంహరించి యక్షుల నధిక్షేపించి ఖేచరుల గీటడంచి యచ్చరల హెచ్చు గుందాడి సిద్ధులకు బుద్ధి చెప్పి సాధ్యుల సాధించి మహారాజికుల రాజసం బుడిపి విద్యాధరుల నధగికరించి మహాఋషుల నదలించి పితరులఁ బ్రతిబంధించి వసువులఁ బరిమార్చి రుద్రుల కుపద్రవం బాపాదించి విశ్వేదేవతల కనాశ్వాసంబు సేసి యనశ్వరం బగునైశ్వర్యంబున నప్రతీపం బగుప్రతాపంబున నవార్యం బగువీర్యంబున నవక్రం బగుపరాక్రమంబున నస్తోకం బగువివేకంబున నేకాతపత్రంబుగాఁ ద్రిలోకంబు లేలుచున్న కొంతకాలంబునకు. 9

సీ, అనువు దప్పిరి నొచ్చి రలసి రాపద నొంది రదవద లైరి చీకాకుపడిరి
యంగలార్చిరి విచ్చి రారడిఁ బొందిరి బ్రమసిరి పాఱిరి పల్లటిలిరి
బెగ్గడిల్లిరి పికాపిక లైరి సొలసిరి కులకులఁ గూసిరి కుతిలపడిరి
గగ్గులకా డైరి కలఁగి రోటాఱిరి వెలవెల్ల నైరి నివ్వెఱఁగుపడిరి
లే. యసవుసవు లైరి గుజగుజ యైరి డస్సి, రొల్లఁబోయిరి వెగ్గిరి తల్లడిలిరి
సిగ్గుపడి రొచ్ఛవడిరి యిస్సియిసి యైరి, తారకునిచేత మునులు బృందారకులును. 10

ఉ. ఇట్టి విధంబునన్ విబుధు లెప్పుడునుం గనుఁగాపులట్లు ము
ప్పెట్టియుఁ జేసిచేసియును వేసరి యింద్రుఁడు మున్నుగాఁగ ది
క్కెట్టిటు లున్న మా కనుచు నేగిరి పద్మజుఁ గూర్చి యేగి కూ
పెట్టిరి హస్తముల్ మొగిచి పెద్దయెలుంగునఁ దద్గుణస్తుతుల్. 11

వ. జయ జయ జగన్నాథ! జగజ్జననస్థితిసంహారకర! జంభారిప్రముఖనిఖిలబర్హిర్ముఖశిఖామణీమయూఖమంజరీరంజితపాదపీఠ! జలజాసర! జాహ్నవీప్రముఖసకలతీర్థతీర్థసంపూర్ణస్వర్ణకమండలుధర! జపతపోనిష్ఠాగరిష్ఠమనోధిష్ఠానఋగ్యజుస్సామాధర్వణమయనానానిశ్వాస! హిరణ్యగర్భ! భూర్భువస్సువస్త్రయీశుకీపంజర! నిరంజన! భారతీవిహారసౌధాయమానచతుర్వదన! సనాతన! సనత్కుమారజనక! శతానంద! శాశ్వత! విశ్వతోముఖ! నిర్వికల్ప! నిరీహ! నిరాకార! ఓంకారగమ్య! అదిగ్దేశకాలవ్యవచ్ఛేదనీయ! ఆదిమధ్యాంతశూన్య! అవ్యయ! అవాప్తసకలకామ్య! అనంత! అద్వితీయ! నిరస్తసమస్తోపాధికసచ్చిదానందస్వరూప! నమస్తే నమస్తే నమః. 12

తే. నీదునిట్టూర్పుగాడ్పులు నిగమపఙ్క్తి, ప్రణవమంత్రాక్షరము నీకు భద్రపీఠి
విలయకాలంబు నీనిద్ర విశ్వమునకు, నీప్రబోధంబ యుదయంబు నిఖిలమునకు. 13