పుట:హంసవింశతి.pdf/7

ఈ పుట ఆమోదించబడ్డది

vi

శుక సప్తతిలోఁ బంజరస్థ శుకము కథలు చెప్పును. హంసవింశతిలో, బంజరస్థ హంసము కథలు చెప్పును. హంస జలపక్షి కదా! పంజరమున నొదుగునా? అని అడుగరాదు. పక్షులు కథలు చెప్పఁగలవా! కవిత్వము జెప్పఁగలవా? అని యడిగినచో, కాదంబరిలోని చిలుక, నైషధములోని అంచ మనకు జవాబు చెప్పఁగలవు. ఇటువంటి కథలు ఏకాంతమున నాయికకుఁ బురుషునితోఁ జెప్పించుట తప్పు. స్త్రీతోఁ జెప్పించుటయు నంత సరసముగ నుండదు. పక్షితోఁ బలికించుటయే బాగు. సూరన్న ప్రభావతీ ప్రద్యుమ్నమున, శుచిముఖి యను హంసియొక్క వాక్కౌశలముఁజూచి సహస్రాక్షుడు “విహంగయోషవె? భాషాప్రావీణ్యము చూడఁగ వాగ్దేవతవో, కాక, యాకె దిద్దిన కవివో!” అన్నాఁడు. నల దమయంతులకుఁ బొత్తు గూర్చిన హర్షుని హంస మగది. ప్రభావతీ ప్రద్యుమ్నులకుఁ బొత్తు గూర్చిన సూరన్న హంస ఆఁడుది. హంస వింశతి హంస మగదే. ఇరువది రాత్రులు కాలక్షేపము చేసినది. తొలిరాత్రి శుష్కహితోపదేశముతోఁ దెల్లవాఱించినది. మలిరాత్రి నక్కకథ చెప్పి తెల్లవాఱించినది. మూడవరేయి ఆ పప్పు లుడుకవని తెలిసికొని, పచ్చి శృంగారమున ముంచి తేల్చినది. తుదిదాఁక స్థాయి తగ్గకుండఁ బట్టికొన్నది.

మనకు లెక్కలేనన్ని పిట్టకథ లున్నవి. కాని, వాని తీరు వేఱు. దేవతలు, రాక్షసులు, సర్పములు, భూతములు, పిశాచములు, మాంత్రికులు, రాజులు, రాణులు, వేశ్యలు భూమికలుగాఁ గథకట్టి స్వప్నలోకములు సృష్టించి, వినోదము కలిగించుట వాని ధర్మము. అట్టి కథలను బాలసాహిత్యమునఁ జేర్పవచ్చును. హంసవింశతి ప్రౌడ కథా సాహిత్య ప్రబంధము. కాఁగా హంస వింశతి కథా సాహిత్య ప్రయోజన మేమి ? "తొల్లి పరమేశ్వరుండు సంతోష మొదవఁ బార్వతీదేవి కెఱిఁగించె" నఁట చిత్ర విచిత్రమైన భామల చిత్తవృత్తి రహస్యము. ఆ రహస్యము బట్టబయలుగా విప్పి చెప్పినాఁడు పురోహిత బ్రాహ్మణుఁడు; విన్నాఁడు కొలువై నలమహారాజు. అన్నీ కలియుగ కథలే. ఆ కథలు హంస పక్షి చెప్పినది. ఊరక చెప్పలేదు. ఉబుసుపోకకుఁ జెప్పలేదు. ఆక్కఱపడి చెప్పినది. హేమావతి అందగత్తె. ఆమెను రాజు కోరెను. భర్త దూరదేశ మేఁగెను. అది సందుగా నామె రాజునొద్దకుఁ బయనమయ్యెను. హంస పోనీయ లేదు. పట్టి నిలిపి కథలు చెప్పినది. మంత్రాలకుఁ