పుట:హంసవింశతి.pdf/102

ఈ పుట ఆమోదించబడ్డది

యై యెట్టకేలకుఁ జెవి యొగ్గిన నగ్గజరాజగామినిన్ బాసి తనరాక కెదురు చూచుచున్న రాజసన్నిధికిం జని తాఁ బోయివచ్చిన కార్యం బెఱింగించె నంతట దైవయోగంబున విష్ణుదాసునకు దూరప్రయాణంబు సంభవించె నంత. 103

విష్ణుదాసుని విదేశప్రయాణసన్నాహము

తే. పయనమున కైనయవి యమర్పంగ నపుడు
పరిచరుల కానతిచ్చినఁ బటకుటీర
పాత్ర సామగ్రి మొదలైన బరువులెల్ల
శకటవామ్యశ్వవృషమహోష్ట్రముల కెత్తి. 104

వ. మఱియుం గలమాన్నంబులుం, గల వంటకంబులుఁ బొంగలి పులియోగిరంబు దధ్యోదనంబు, నానవాలు, జున్నులు, మీఁగడ పెరుగులు, నవనీతంపు ఘుటికలు, నొలుపుఁ బప్పు, నప్పడంబులు, వఱుగులు, వడియంబులుఁ, బెరుగు వడియంబులు, మిరియపుంబొడి, మెంతికూటువ, సంబారంబుఁ, జింతపండులు, బజ్జు, లుసిరికలుఁ, బచ్చ ళ్ళూరుఁబిం, డ్లూరుఁగాయలు, మామిడితొక్కులు, నివి మొదలుగాఁగల పరికరంబులును, మఱియు వడపప్పు, బేడలు వేఁపుళ్ళు, ననుఁప గుగ్గిళ్ళు, బొరుగులుఁ, బొడులుఁ, బాకపుఁ జలిమిడి, కాయమ్ములుం, జిమ్మిరుంటలు, నటుకులు, మూఁగలు, లాజలుఁ, బేలాలుఁ, జిటి కాఱుకులు, నువ్వులు నానబియ్యంబులుఁ బేలపిండిఁ, బ్రేలసత్తు, దోసగింజలు, వెల్లగిసెలు, గోఁగులు, గరింగరుము, లుపిళ్ళు, సెనగపప్పు, బొరుగుపప్పు, సారపప్పు, జీడిపప్పు, బాదంగి పలుకులుఁ, గొబ్బెర, గసగసాలు, ఖర్జూరములు, ద్రాక్ష, లాదియైన ఫలహారంబులును, మఱియు నుండ్రంబులు, మండెఁగలుఁ, గుడుములు, దోసె, లరిసెలు, రొట్టెలు, నిప్ప, ట్లప్పంబు, లతిరసంబులు, సుకియ, లమృతకలశమ్ములు, సోగులుఁ, జక్కెర బుడగలుఁ, గరిజులుఁ, బొరివిళంగాయలుఁ, దేమనంబును, బాలకాయలుఁ, జక్కిలమ్ములు, మినుఁప చక్కిలమ్ములు, మినుప పోకలు, మనోహరంబులు, గారెలు, బూరెలు,