పుట:సీతారామాంజనేయ సంవాదము.pdf/43

ఈ పుట ఆమోదించబడ్డది

24

శ్రీ సీతారామాంజనేయసంవాదము


పాదకమలములయొక్క. సేవాది = సేవ మొదలగునవియే, ( లేక, సేవ మొదలగువానివలనఁ గలిగిన,) శ్రీమోదుఁడు=సంపదచే సంతోషించువాఁడు, (లేక , సంపదయే సంతోషముగాఁ గలవాడు,) అగు, శ్రీజనార్దనాహ్వయుఁడు = జనార్దనుఁడను యోగి, ప్రత్యక్షప్రహ్లాదుండు అనగా ప్రత్యక్షముగాఁ గానవచ్చుచున్న ప్రహ్లాదుఁడో యనునట్లు, ఒప్పున్ = ప్రకాశించుచుండెను.

తా. అదత్తాత్రేయగురువునకు శిష్యుఁడై యమ్మహానుభావునిపాదసేవయే తనకు మహోన్నతపదవిగ నానందించుచుఁ బ్రత్యక్షముగాఁ గానవచ్చుప్రహ్లాదుఁడో యన జనార్దనయోగి జగత్ప్రసిద్ధుఁ డై యుండెను.

మ. తన సౌశీల్యము శాస్త్రచింతనము నాత్మజ్ఞానముం జూచి హె
     చ్చినకూర్మి న్నిజదివ్యరూపములతో శ్రీభారతీమోక్షకా
     మిను లేతెంచి యహర్నిశంబు దను నెమ్మిం గొల్వఁగా శ్రీ జనా
     ర్దనయోగీశ్వరుఁ డొప్పె నెల్లెడ నవిద్యాధ్వాంతమార్తాండుఁడై.

టీక. తనసౌశీల్యము = తన సత్ప్రవర్తనము, శాస్త్రచింతనమున్ = శాస్త్రవిచారము, ఆత్మజ్ఞానమున్ - ఆత్మజ్ఞానమును, చూచి, హెచ్చినకూర్మిన్ = అధికమైనప్రేమచేత, నిజదివ్యరూపములతోన్ -తమ లోకోత్తరము లగు నాకారములతో, శ్రీభారతీమోక్షకామినులు = లక్ష్మీ-సరస్వతీ-పార్వతులు, (సదాచారమును జూచి లక్ష్మియు, శాస్త్రజ్ఞానమును జూచి సరస్వతియు, బ్రహ్మజ్ఞానమును చూచి పార్వతియు చెంత చేరి రనియు, ఈజనార్ధన యోగి విష్ణ బ్రహ్మమహేశ్వరరూపుఁ డనియు భావము. ) ఏతెంచి = వచ్చి, అహర్నిశంబున్ = రేయుంబవలు తనున్ = తనను, నెమ్మిన్ = ప్రేమతో, కొల్వఁగాన్ = సేవించుచుండఁగా, శ్రీజనార్దనయోగీశ్వరుఁడు, ఎల్లెడన్ = అంతటను, అవిద్యాధ్వాంతమార్తాండుడై = అవిద్య యనెడి, ( లేక, అజ్ఞానమనెడి ) చీఁకటికి సూర్యునివంటివాఁడై, ( జీవులకు అవిద్య యనునది ఆవరణము కావున దానినిఁ దొలఁగించి వారిని ముక్తులను జేయుచు అనుట.) ఒప్పెన్ = ప్రకాశించెను.

తా. ఆజనార్ధనయోగీశ్వరునిధర్మప్రవర్తనమును జూచి లక్ష్మియు, విద్యాసమృద్దిని జూచి సరస్వతియు, బ్రహ్మజ్ఞానమును జూచి పార్వతియు నాయన నాశ్రయించి స్త్రీస్వరూపములతో మిగుల ననురాగవతు లై సేవించుచుండిరి. ఇ ట్లపరిమిత మగుప్రభావముతోఁ గూడి త్రిమూర్తులస్వరూపము గలవాఁడై యాశ్రితులయజ్ఞానమును ధ్వంసము గావించి, మోక్షము నొసంగుచు నాఘనుఁడు ప్రకాశించుచుండెను.

తే. ఆజనార్దనగురున కత్యద్భుతముగ, శ్రీమదేకోగురుస్వామి శిష్యుఁ డయ్యె
    మును వసిష్ఠమహామునీంద్రునకు నర్థి, దాశరథి భక్తుఁడైనచందంబు దనర.