పుట:సీతారామాంజనేయ సంవాదము.pdf/36

ఈ పుట ఆమోదించబడ్డది

పీఠిక

17


గావ్యముచేఁ వర్ణింపఁబూని నే నేకాంతస్థలమునందుండి మహాదేవగురురూపుఁ డగు శ్రీరాముని పరమార్థరూపమును (నాకును బ్రహ్మమునకును భేదములేదు; అను విషయమును) ధ్యానించుచుండఁగా (పైపద్యముతో నన్వయించుకొనవలయును).

సీ. కమనీయవరదివ్యకాంచనచేలంబుఁ, గాషాయవస్త్రంబుగా ధరించి
    చాపబాణంబులు చంచత్కమండలు, దండము ల్గాఁగ హస్తములఁ బూని
    రమణీయరత్నహారంబు రుద్రాక్షమా, లికగా గళంబున లీలఁ దాల్చి
    సీతావధూటిని శ్రీరాజయోగాహ్వ, యాధ్యాత్మవిద్యగా నవధరించి

తే. ప్రేమ మీఱంగ శ్రీరామ రామ రామ
    యనుచుఁ దనపేరు నుడువుచు నద్భుతముగ
    శ్రీమహాదేవగురుఁ డైనరామవిభుఁడు
    గరుణతోడుత నెదుర సాక్షాత్కరించె.16

టీ. కమనీయ. .. చేలంబు - కమనీయ = రమ్యమైన, వర= శ్రేష్ఠమైన, దివ్య = దేవలోకసంబంధమైన, కాంచనచేలంబు = సువర్ణవస్త్రమును, కాషాయవస్త్రంబుగాన్ = కాషాయవస్త్ర మగునట్లుగా (కాషాయవస్త్రమువలె) ధరించి, చాపబాణంబులు = ధనుస్సు బాణంబులును, చంచత్ .. దండముల్ - చంచత్ = ప్రకాశించుచున్న, కమండలు - కమండలములు, దండముల్ = దండము, ఇని, కాఁగన్ = అగునట్లుగా, హస్తములన్ = చేతులయందు, పూని = ధరించి, రమణీయరత్నహారంబున్ - మనోహర మగురత్నాలహారము, రుద్రాక్షమాలికగాన్ , గళంబునన్ = కంఠమునందు, లీలన్ = విలాసముగా, తాల్చి = ధరించి, సీతావధూటిన్ = సీతాదేవిని, శ్రీ...విద్యగాన్ - శ్రీ = ఒప్పుచున్న, రాజయోగ = రాజయోగ మనియెడు, ఆఖ్య = పేరుగల, ఆధ్యాత్మవిద్యగాన్ = ఆత్మవిద్యగా, అవధరించి = స్వీకరించి (పార్శ్వమునం దుంచుకొని) ప్రేమ మీరంగన్ = ప్రీతి యధికమగుచుండఁగా (నన్ననుగ్రహించి,} శ్రీరామరామ, అనుచున్ , తనదుపేరున్ = తనదివ్యనామమును, నుడువుచున్ = చెప్పుచు, అద్భుతముగన్ =ఆశ్చర్యము గలుగునట్లుగా, శ్రీమహాదేవగురుఁడు అయిన= శ్రీమహాదేవగురుస్వరూపుఁడైన, రామవిభుఁడు = శ్రీరామమూర్తి, కరుణతోడుతన్ = దయతో, ఎదురన్, సాక్షాత్కరించెన్ = ప్రత్యక్షమయ్యెను.

తా. మనోహర మగుపీతాంబరము కాషాయవస్త్రముగ, ధనుర్బాణంబులు కమండలు దండములుగ, రత్నహారంబులు రుద్రాక్షమాలికలుగ, సీతామహాదేవి రూపమునుదాల్చినవేదాంతవిద్ గా,తన నామధేయము నెఱిఁగించుట తారకజపముగ, నా శ్రీరామమూర్తి మహాదేవగురుస్వరూపముతో న పైఁ గరుణ వెలయఁ బ్రత్యక్ష మయ్యెను.