పుట:సీతారామాంజనేయ సంవాదము.pdf/29

ఈ పుట ఆమోదించబడ్డది

10

శ్రీ సీతారామాంజనేయసంవాదము

కారణశరీరమును, జీఱన్ =నశింపఁజేయఁగాను, అవికారపరకారణమున్ = నిర్వికార మగు నుత్తమమైన పరబ్రహ్మమును, చేరన్ = పొందుటకును, పరఁగువానిన్ = తగినవాని (లేక, సమర్థుఁడగువానిని}, పరబ్రహ్మమును అపరోక్షానుభవపూర్వకముగఁ దెలిసికొనినవానిని, తనయందున్ = తనలో, జగము=ప్రపంచము (కలదు), అందు = ఆ ప్రపంచమునందు , తాన్ = తాను, పొందుగా నొందుచెలువున్ = బాగుగా చెందునట్టిసమృద్ధిని (తానా ప్రపంచమునం దుండుటను), ఒందువిందుగాన్ = ఒందుచున్న సంతోషముతో, తెలియువానిన్ = తెలిసికొనువానిని (తనయందు ప్రపంచ మున్నదనియు, తానా ప్రపంచమం దున్నాఁడనియు బాగుగఁ దెలిసికొనియున్నవానిని), నిగమ.. ములు - నిగమ= వేదములందు, నిగదిత= చెప్పఁబడిన, సుగుణములు, అగణితముగన్ - లెక్కకు మిక్కిలియై, మిగులన్ = అధికముగ, నిగుడఁగన్ = నిలచియుండుటచేత, సగుణుఁడై=గుణవంతుడై, అగుణుఁడు=నిర్గుణుఁడు, అగుచున్ (పరబ్రహ్మరూపముతో వర్ణింపబడుచుండుటచే నిట్లు చెప్పఁబడినది.), పగలు రేయనకన్ = పగలు రాత్రి అని భేదము లేక (కాలపరిచ్ఛేదమునఁగా ఈకాలమునఁ గలఁడు, మఱియొకకాలమున లేఁడు అను భేదము లేక), ఏకరీతిన్ = ఒకటేవిధముగా, నెగడువానిన్ = విహరించువానిని, శ్రీమహాదేశగురునిన్ = శోభాయుక్తుడగు మహాదేవుఁ డనుగురువర్యుని, ఎప్పుడున్ భజింతున్ = సేవించెదను.

తా. బ్రహ్మజ్ఞానమునకు విఘ్నములై యుండు నానావిధము లగుపాపములను నశింపజేయుచు అధ్యాత్మికాదితాపములను బోఁగొట్టి తనసత్యస్వరూపమును ప్రత్యక్షముగ చూపఁగలసామర్థ్యము గలవాడును, సూక్ష్మశరీరమును ధ్వంసము చేసి అవిద్యను తొలగించి కృతార్థులుగాఁ దలంచువారలకు శరణ్యుఁడును, కారణశరీరమును ధ్వంసము కావించి నిర్వికారపరబ్రహ్మముతో నైక్యముఁ జెంది యుండువాఁడును “మయ్యేన సకలం జాతం మయి సర్వం ప్రతిష్ఠితం, మయి సర్వం లయం యాతి తద్బ్రహ్మద్వయ మస్మ్యహమ్" "ప్రపంచము నాయందే జనించినది. నాయందే నిలిచియున్నది. నాయందే లయమగును. సర్వ కారణభూతుఁడగు పర బ్రహ్మము నేనే” అనువిషయమును జక్కఁగ నెఱింగి యున్నవాఁడును, నిర్గుణస్వరూపుఁ డయ్యును శాస్తోక్తము లగుసకలసద్గుణములును గలవాఁ డగుటచే సగుణుఁడై కూడనుండువాఁడును, కాలపరిచ్ఛేదము లేక నొకరీతిగ నుండువాఁడు నగు నామహాదేవగురువును సేవించెదను (ఈకవికి నారాయణుఁడు అనియు మహాదేవుఁడనియు నిరువురు గురువులు. అందు నారాయణుఁడు పద్యమున వర్ణింపఁబడి యున్నాడు. ఈ పద్యమున మహాదేవగురువు విజ్ఞానవంతుఁడుగఁ గొన్ని చోట్లను గేవల పరబ్రహ్మరూపుడుగ మఱికొన్నిచోట్లను వర్ణింపబడియున్నాఁడని తెలిసికొనవలయును.)