పుట:సర్వలక్షణసారసంగ్రహము.pdf/141

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

140

మంజువాణి


శా.

ఓలోలంబకయోలయోలలనయోలోలంచు మేలంబునన్
లోలంబాలక యోర్తు గ్రుంకి బిసవల్లుల్ దున్మి తూఁటాడి కెం
గేలం బూని తటాలున న్నెగసె నక్షీణాంబునాదాంబుజా
క్షీలోకంబు జయించి వారలయశశ్శ్రీఁ దెచ్చుచందంబునన్.

71

వసుచరిత్ర

వ.

లోలంబాలక యోర్తు గ్రుంకి యనఁగా = లో = నీళ్లలోను, లంబాలక యనంగా = విస్తారమైన అలకములు గలది యోర్తు గ్రుంకి యిక్కడనే రోలంబాలక = తుమ్మెదలవంటి అలకములుగలదని రేఫలకారములకు అభేదముఁ జెప్పుచున్నారు. ఇటువంటి ప్రయోగములు మఱి యెక్కడను లేవు గనుక రోలంబాలకయను పాఠము కాదు. లోలంబాలక యనియే చెప్పుకొనునది. కనుక రేఫలకారములకు మైత్రి లేదు. నిఘంటువు। సమో రోలంబ లోలంబౌ రేఖా లేఖాచ కధ్య తే। తథా మార్జార మార్జాలౌ తరుణీ తలునీతిచ॥ అనియు॥ క. కేళాదిరాయ యభినవ। లీలామకరాంకచంద్ర లేఖాంకుర . . . . . అన్నచోట రేఖాంకురమని నైషధమం దున్నదనుకొనిరి. "రేఖా లేఖాచ కథ్య తే” అని ద్విరూపకోశమందుఁ జెప్పినాడు గనుక "లేఖాంకుర" యని మూడోపాఠమే సిద్ధము.

72

ప్రభునామయతికి

18 లక్షణము

ఆ.

అమ్మ యక్క యప్ప యయ్య యన్నయు నని
పలుకుచోట నూదఁబడక రెండు
చందములను వళులు జెందును ప్రభునామ
విరమణము లనంగ వృషతురంగ.

73