పుట:సర్పపురమాహాత్మ్యము (కూచిమంచి తిమ్మన).pdf/49

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


జ్జ్వలుండును దనుమధ్యుండును శ్రీవత్సకౌస్తుభాంభోధితనయావానతనుమధ్యుండును జగ
జ్జనధరుండును బీతకౌశేరేయవాసుండును శారదాంభోజనీకాశపదద్వయరాజితుండును
సర్వప్రభుండును నగుశ్రీమద్భావనారాయణమహాప్రభుసేవార్థంబు కళత్రబాంధవో
పేతుల మై ధనుర్మాసవైశాఖమాసంబులు నీవెంబడి వచ్చుచుండెద మని విన్నవించు
చున్నసమయంబున శంభుండు భావనారాయణస్వామి నిట్లని వినుతించె.

104

శంభుఁడు భావనారాయణస్వామిని నుతించుట

తే.

మహియు సలిలంబుఁ దేజంబు మారుతాభ్ర, ములు మనోబుద్ధ్యహంకారములును భిన్న
సరణు లయ్యు నభిన్నతఁ బరఁగి యేమ, హామహునిరూప మయ్యె నయ్యనఘుఁ గొలుతు.

105


వ.

మఱియు నాబ్రహ్మస్తంబపర్యంతంబు స్థావరజంగమాత్మకం బగుజగం బెవ్వనిలీలాపరి
కరం బట్టినీకు నమస్కారంబు నేనును జతుర్ముఖసోమసూర్యపురందరాదిసమస్తదేవత
లు నెవ్వనితనుభూతంబుల మైతి మట్టినీకు నమస్కారం బీశ్వరత్వాభిమానుల మగు
మముబోంట్లఁ బ్రతిబోధించుటకై నారదునకు స్త్రీత్వంబును బురుషసంసర్గంబును బుత్త్ర
శతోదయంబును దత్పంచత్వంబున నత్యంతదుఃఖంబును గల్పించి క్షణమాత్రంబున
గ్రమ్మఱ మహర్షిం జేసి పరతంత్రుండ వై పరఁగుచున్న నీమహత్త్వంబు తెలియ నెవ్వం
డర్హుండు నీవు నా కిట్టినిశ్చలబుద్ధి యొసంగు మని ప్రార్థించుచున్నసమయంబున
నారదుండు హరి కిట్లనియె.

106

నారదుండు హరిని వేఁడుకొనుట

తే.

భావనారాయణ కృపాబ్ధి దేవదేవ, నిఖిలలోకశరణ్య నే నిన్ను శరణు
నందుదు ననారతంబు నాయందుఁ గలుగు, వత్సలత నిందు నీ వుండవలయుఁజుమ్మి.

107


సీ.

పుణ్యమానసు లైన పురుషులచేత నా, రాధ్యమానుండ వై రహిని వా రొ
సంగుతత్తత్కాలసముచితారాధనం, బులఁ దృప్తిఁ బొందుచు నలర వారి
కీప్సితార్థఫలంబు లిడుచు శ్రీదేవియు, భూదేవి నీళయు భుజగవిభుడుఁ
బతగేంద్ర సేనేశ పరివారములుఁ గొల్వ, వైకుంఠమున నుండు వల నెనంగఁ


తే.

జిరతరంబుగ నిమ్మహాక్షేత్రమున వ, సించి యాశ్రితజనుల రక్షించుచుండు
సర్సపురవాస భువనరక్షణవిలాస, భావనారాయణ మహానుభావ దేవ.

108


క.

మంగళము నీకు శ్రితజన, మంగళదాయక మునీంద్రమానసవిలస
ద్భృంగాయమానవిగ్రహ, మంగళ మఖిలాండకోటి మహితపిచండా.

109