ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మకథ

51

ఆర్థికంగా అతడు పడుతున్న బాధను గురించి తలుచుకునేసరికి విచారం కలిగింది. కొందరికి విద్యార్థి వేతనం లభిస్తూ ఉండేది. నా కంటే సాదాగా జీవనం గడుపుతున్న విద్యార్థులు కూడా నాకు తటస్థపడ్డారు. అటువంటి చాలా మంది బీద విద్యార్థులతో నాకు పరిచయం ఏర్పడింది. ఒక బీద విద్యార్థి లండన్ నగరంలో “బీదమహల్” లో వారానికి రెండు షిల్లింగుల చొప్పున సొమ్ము చెల్లించి ఒక గదిలో ఉండేవాడు. లోకార్టులో వున్న చవుక కోకో దుకాణంలో రెండు పెన్నీలకు “కోకో, రొట్టె” తీసుకొని పొట్ట నింపుకునేవాడు. అతడితో పోటీపడగల శక్తి నాకు లేదు. అయితే రెండు గదులు ఎందుకు? ఒక్క గదిలో వుండవచ్చుకదా! ఒక పూట భోజనం స్వయంగా తయారు చేసుకుంటే నెలకు అయిదు లేక ఆరు పౌండ్లు మిగులుతాయి. సాదా జీవనసరళిని గురించి పుస్తకాలు చదివాను. రెండు గదులు వదిలి ఒక గది మాత్రమే అద్దెకు తీసుకున్నాను. వారానికి ఎనిమిది షిల్లింగులు చెల్లించాలి. ఒక కుంపటి కొన్నాను. ఉదయం భోజనం స్వయంగా చేసుకోసాగాను. ఇరవై నిమిషాల సమయం వంటకు పట్టేది. వరిగల సంకటికి, కోకో కోసం నీళ్లు వెచ్చ పెట్టడానికి అంతకంటే ఎక్కువ సమయం అనవసరం కదా! మధ్యాహ్నం పూట బయట భోజనం చేసేవాణ్ణి, సాయంత్రం మళ్ళీ కోకో తయారు చేసుకొని రొట్టెతో బాటు పుచ్చుకునేవాణ్ణి. ఈ విధంగా ఒకటి లేక ఒకటిం పావు షిల్లింగ్‌తో రోజూ పొట్టనింపుకోవడం నేర్చుకున్నాను. ఇప్పుడు ఎక్కువ సమయం చదువుకు ఉపయోగించసాగాను. జీవనం సరళం అయిపోయినందున సమయం ఎక్కువ మిగిలింది. రెండో పర్యాయం పరీక్షకు కూర్చొని ప్యాసయ్యాను.

సాదాతనం వల్ల నా జీవితంలో నీరసం వచ్చిందని పాఠకులు భావించకుందురు గాక. ఈ విధమైన మార్పుల వల్ల నా అసలు జీవితానికీ, బాహ్య జీవితానికీ సరియైన సమన్వయం కుదిరింది. కుటుంబ పరిస్థితులకు అనుగుణ్యంగా నా నడవడికలో నా నిత్య వ్యవహారాలలో మార్పు వచ్చింది. జీవితం సత్యమయం అయింది. నాకు ఆత్మ తృప్తి కలిగింది.


17. ఆహారంలో మార్పులు - ప్రయోగాలు

నేను లోతుగా పరిశీలించసాగాను. బాహ్యాంభ్యంతరాలైన ఆచారాలు మార్చుకోవలసిన ఆవశ్యకత గోచరించింది. నిత్య వ్యవహారాలలోను, వ్యయం విషయంలోను మార్పు చేయడంతోపాటు ఆహారంలో కూడా మార్పులు ప్రారంభించాను. శాకాహారం గురించి పుస్తకాలు వ్రాసిన ఆంగ్ల రచయితలు నిశితంగా శోధన చేశారు. మత వైద్య ప్రకృతి శాస్త్రాల కనుగుణ్యంగా ఆచరణకు అనుకూలంగా లోతుగా