ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మకథ

49

ఈ విషయం ప్రతివారు శ్రద్ధతో గమనించి తనకు వచ్చే ప్రతి పైసకి, తాను ఇచ్చే ప్రతి పైసకి లెక్క వ్రాసి పెడితే చివరికి నావలెనే తప్పక మేలు పొందగలరు. ఇది తథ్యం. ఎంతో జాగ్రత్తగా ఆదాయ వ్యయాలు వ్రాస్తూ వున్నందున ఖర్చు తగ్గించుకోవడం అవసరమని తెలుసుకోగలిగాను. పద్దు పుస్తకం చూచుకుంటే అందు బాడుగలు ఎక్కువగా కనిపించాయి. నేను ఒక కుటుంబంతో కలిసి వుంటున్నందున, వారికి ప్రతి వారం కొంత డబ్బు ఇవ్వవలసి వచ్చింది. మర్యాద కోసం ఆ కుటుంబం వారితో కలిసి డిన్నర్లకు వెళ్ళవలసి వచ్చేది. అప్పుడు ఖర్చు నేను భరించవవలసి వచ్చేది. అందుకు కారణం ఆ దేశంలో డిన్నర్లకు పిలిచిన ఆమె స్త్రీ అయితే పురుషుడే వ్యయం భరించాలి. ఆ కుటుంబం వారికి ప్రతివారం ఇచ్చే సొమ్ములో ఆ డిన్నరు ఖర్చు తగ్గించుకోరు. అదనంగా ఆ ఖర్చు భరించవలసిందే. లెక్కలు చూచాక ఈ ఖర్చు తగ్గించవచ్చునని తోచింది. ఈ విధంగా దుబారా ఖర్చు చేస్తున్నందున నేను ధనికుడననే అపోహ కూడా జనానికి కలుగుతున్నదని తోచింది.

ఈ కుటుంబంతో పాటు ఇక వుండకుండా ప్రత్యేకంగా గదులు అద్దెకు తీసుకొని వుండాలని నిర్ణయించుకున్నాను. నేను చేయవలసిన పనులకు అనుకూలంగాను, సమీపంలోను వుండే చోటుకు మారాలని భావించాను. దానివల్ల అనుభవం గడించవచ్చునని అనుకున్నాను. పనివున్న చోటుకు తేలికగా గంటలో నడిచి వెళ్ళేందుకు వీలుగా దగ్గరలో గదులను అద్దెకు తీసుకున్నాను. అందువల్ల కార్ల బాడుగ వగైరా వ్యయం తగ్గింది. ఇదివరకు ఎక్కడికి వెళ్ళినా కారులో వెళ్ళేవాణ్ణి. అందుకు బాడుగ క్రింద కొంత సొమ్ము ఖర్చు పెట్టవలసి వచ్చేది. ఇప్పుడు అది తగ్గింది. కాని నడిచి వెళ్ళాలంటే కొంత కాలం పడుతున్నది. ఈ విధంగా ప్రతిరోజు చాలా దూరం నడుస్తుండటం వల్ల నాకు జబ్బులు రాకపోవడమే గాక చాలావరకు శరీర దారుఢ్యత కూడా కలిగింది. నేను రెండుగదులు కిరాయికి తీసుకున్నాను. ఒకటి కూర్చునేందుకు, రెండవది పడుకునేందుకు, నేను చేసిన మార్పుల్లో ఇది రెండవ దశ అని చెప్పవచ్చు. మూడో మార్పు కూడా త్వరలోనే వస్తుంది. ఈ విధంగా ఖర్చు సగం తగ్గిపోయింది. కాని సమయమో! బారిష్టరు పట్టాకోసం ఎక్కువగా చదవవలసింది ఏమీ వుండదని తెలిసి ధైర్యం కలిగింది. కాని నా ఇంగ్లీషు భాషాజ్ఞానం సరిగాలేదు. అందుకు బాధగా ఉండేది. “బీ.ఏ. పూర్తి చేసుకో, ఆ తరువాత రా” అని శ్రీ లేలీగారు అన్న మాటలు గ్రుచ్చుకుంటున్నాయి, బారిష్టరు కావడం కోసం ఇంకా అదనంగా చదవాలి. ఆక్స్‌ఫర్డు కేంబ్రిడ్జి కోర్సులను గురించి తెలుసుకున్నాను. చాలామంది మిత్రుల్ని కలిశాను.