ఈ పుట ఆమోదించబడ్డది

202

స్వదేశాగమనం

మెల్లమెల్లగా ప్రారంభించాను. “మన పిల్లలికి అప్పుడే పెళ్ళా! చిన్నతనంలో వాళ్ళకు పెళ్ళి చేయముకదా! పెద్దవాళ్ళు అయిన తరువాత వాళ్ళ పెళ్ళిళ్లు వాళ్లే చేసుకుంటారు. నగలు కావాలనే కోడళ్లు మనకెందుకు? అయినా నగలే అవసరమైతే నేను లేనా? నేను ఎక్కడి పోతాను?” అని అన్నాను.

“ఆ సంగతి నాకు తెలియదా? నా ఒంటిమీద వున్న నగలన్నీ ఒలిచి తీసుకొన్నవారు కదూ మీరు? నన్నే పెట్టుకోనీయనివారు రేపు నా కోడళ్ళని పెట్టుకోనిస్తారా? నా పిల్లల్ని యిప్పటి నుండే బైరాగుల్ని చేసి పెడుతున్నారు. ఈ నగలు నేనెవ్వరికీ యివ్వను. పైగా అవి నావి, నాకు యిచ్చారు. వాటిమీద మీకు హక్కుఎక్కడుంది?” “ఆ బంగారు హారం నీవు చేసిన సేవను చూచి యిచ్చారా చెప్పు! నేను చేసిన సేవకే గదా యిచ్చారు?” “పోనియ్యండి మీరు చేస్తే నేను చేసినట్లు కాదా? మీకు రాత్రింబవళ్ళు నేను సేవచేయడం లేదా? ఇది సేవ కాదా? ఇంటికి తీసికొని వచ్చిన అడ్డమైన వాళ్లందరికీ ఎముకలు విరిగేలా సేవచేయడం లేదా? దీన్ని ఏమంటారు? యిది సేవకాదా?” ఆమె వదిలిన బాణాలన్నీ వాడిగలవే. ఎన్నో నాకు గ్రుచ్చుకున్నాయి. కాని నేను నగలు తిరిగి యిచ్చి వేయాలని నిర్ణయించుకున్నాను. తరువాత చివరికి ఏదో విధంగా కానుకలు తిరిగి యిచ్చి వేసేందుకు ఆమెను ఒప్పించాను. 1896, 1901 వ సంవత్సరాలలో వచ్చిన కానుకలన్నింటిని తిరిగి ఇచ్చివేశాను. దానపత్రం వ్రాశాను. నా అనుమతితో కాని ధర్మకర్తల అనుమతితో కాని ప్రజాసేవకు యివి ఉపయోగించబడాలనే షరతుతో సొమ్మంతా బాంకులో జమ చేశాను.

ప్రజాసేవకు సంబంధించిన కార్యాలకు ఈ సొమ్ము ఉపయోగించాలని భావించాను. కాని అందుకు అవసరమైన సొమ్ము ఎప్పటికప్పుడు వస్తూ వుండటం వల్ల ఆ సొమ్మును ముట్టుకోలేదు. ఆ సొమ్ము సురక్షితంగా వుండిపోయింది. పైగా అది పెరుగుతూవున్నది.

ఇలా చేసినందుకు నాకు ఎన్నడూ పశ్చాత్తాపం కలుగలేదు. కాలం గడిచిన కొద్దీ కస్తూరిబాయి కూడా నేను చేసిన పని యొక్క ఔచిత్యాన్ని అర్థం చేసుకోసాగింది. ఈ విధంగా నేను ప్రలోభాల నుండి తప్పించుకోగలిగాను. ప్రజల సేవ చేసేవారికి ఎన్నో కానుకలు వస్తాయి. కాని అవి వారి సొంతం కాజాలవని నా నిశ్చితాభిప్రాయం.