ఈ పుట ఆమోదించబడ్డది

182

పిల్లల చదువు

వాళ్ళు ఏమనుకున్నా, తల్లి దండ్రుల సహవాసం వల్ల కలిగే అనుభవజ్ఞానం వారికి కలిగిందని చెప్పగలను. స్వాతంత్ర్య సముపార్జనా పాఠం వాళ్ళు బాగా నేర్చుకున్నారని నా అభిప్రాయం. వాళ్ళ అభిరుచి ప్రకారం వాళ్ళను స్కూలుకు పంపించి యుంటే యిట్టి జ్ఞానంవారికి కలిగి యుండేది కాదు. వీళ్లను ఇంగ్లాండుకు పంపించో, లేక దక్షిణ-ఆఫ్రికాలో ఉంచో చదివించి కృత్రిమ శిక్షణ గరిపించియుంటే వీరి విషయమై నేను యీనాడు వున్నంత నిశ్చింతంగా వుండలేకపోయేవాణ్ణి. వాళ్ళు రుజూజీవితం అంటే ఏమిటో, త్యాగం అంటే ఏమిటో గ్రహించలేకపోయేవాళ్ళు. వారి కృత్రిమ చదువులు నేను చేస్తున్న దేశారాధనా కార్యక్రమానికి అడ్డంకులుగా పరిణమించి యుండేవి.

మొత్తంమీద నేననుకున్నంతగాను, వాళ్లు అనుకున్నంతగాను భాషా జ్ఞానం వాళ్లకు లభించకపోయినా, బాగా యోచిస్తే వారి విషయంలో నా ధర్మాన్ని శక్తివంచన లేకుండా నిర్వర్తించాననే భావిస్తున్నాను. ఆ విషయమై నేను పశ్చాత్తాపపడటంలేదు. ఈనాడు నా పెద్ద కుమారునియందు చింతించవలసిన ఏ దోషాలు నేను చూస్తున్నానో, అవి అశిక్షితాలు, అమూర్తాలునగు నా ప్రథమ జీవితాంశాల ప్రతిధ్వనులని మాటిమాటికి నాకు అనిపిస్తూ వున్నది. నా ఆ ప్రథమ జీవితాంశం ఒక మాదిరి మూర్ఛాకాలం లేక వైభవకాలం. అప్పటి వయస్సు ననుసరించి అది అటువంటిది కాదని మా పెద్ద పిల్లవాడి ఊహ. నా జీవితంలో అదే రాజమార్గమనీ, తరువాత నాలో వచ్చిన మార్పులన్నీ వివేకమను పేరట మోహరాహిత్యం వల్ల నాలో కలిగాయని అతడి విశ్వాసం. ఆ విధంగా నా ప్రథమ జీవితమే రాజమార్గమనీ, తరువాత కలిగిన మార్పులు సూక్ష్మాభిమానవకృతాలనీ, అజ్ఞానజనితాలనీ అతడు ఎందుకు భావించ కూడదు? కొందరు మిత్రులు నాతో యీ విషయమై వాదించారు కూడా. నీ కుమారులు బారిష్టరులైతే వచ్చిన నష్టం ఏమిటి? వారిరెక్కలు విరగ గొట్టే అధికారం మీకెవరిచ్చారు? వాళ్లను వాళ్ల యిష్ట ప్రకారం పోనీయకుండా యిలా అడ్డు పడటం ఏమిటి? యిదీ మిత్రుల తర్కం.

అయితే యీ ప్రశ్నల్లో నాకు విశేషం కనబడలేదు. అనేక మంది విద్యార్థుల్ని గురించి నాకు తెలుసు. యితర బాలుర విషయమై కూడా యిట్టి ప్రయోగం చేసి చూచాను లేక అందుకు సహకరించాను. ఫలితాన్ని కూడా చూచాను. ఆ పిల్లలు, మా పిల్లలు యిప్పుడు ఒకే ఈడులో వున్నారు. వారు మానవత్వం విషయంలో నా పిల్లలకంటే మించలేదని చెప్పగలను. వారి దగ్గర నా పిల్లలు నేర్చుకోవలసింది ఏమీ లేదని నా అభిప్రాయం.