ఈ పుట ఆమోదించబడ్డది

150

ఇంటి వ్యవస్థ

అంతవరకు లొంగని అపరాధి యిక తనను పోలీసులకు అప్పగిస్తానని గ్రహించాడు. తప్పు అతణ్ణి భయపెట్టింది. అతడు శరణు జొచ్చి పోలీసులకు చెప్పవద్దని బ్రతిమిలాడడమే గాక, ఇల్లు వదిలి వెళతానని అన్నాడు. తరువాత ఇల్లు వదిలి వెళ్లిపోయాడు.

ఈ ఘట్టం నన్ను మేల్కొలిపింది. ఆ దుష్ట మిత్రునివల్ల మోసపోయానను విషయం అప్పటికి గాని నాకు బోధపడలేదు. మంచికి పోయి చెడ్డను కొని తెచ్చుకున్నట్లయింది. తుమ్మ కొమ్మన గులాబీ పూలు పూస్తాయని భావించానన్న మాట. అతని నడవడి మంచిది కాదని నాకు తెలుసు. అయినా నా దగ్గర తప్పు చేయడని భావించాను. అతని నడవడిని బాగు చేద్దామని భావించి నేను చెడులో పడిపోయాను. ఈ విషయమై నాశ్రేయోభిలాషులు చెప్పినా నేను వినలేదు. మోహంలో పడి గ్రుడ్డి వాడినయ్యాను.

ఈ దుర్ఘటన నా కళ్లు తెరిపించింది. లేకపోతే నాకు సత్యం బోధపడేది కాదు. నేనతని వలలో పడిపోయివుంటే నేనిప్పడు తలపెట్టిన ఏకాంత జీవనం ప్రారంభించి యుండేవాణ్ణి కాదు. నా సమయమంతా అతని కోసం ఖర్చు చేసేవాణ్ణి. నన్ను అంధకారంలోకి నెట్టి చెడ్డ మార్గం పట్టించగల శక్తి అతనికి వుంది. కాని దేవుడు రక్షించిన వాణ్ణి ఎవడేమి చేయగలడు? నా మనస్సు పరిశుద్ధం కావున తప్పు చేసినప్పటికీ రక్షణ పొందాను. మొట్టమొదటనే కలిగిన యీ అనుభవం భవిష్యద్విషయాలలో నన్ను జాగరూకుణ్ణి చేసింది.

భగవంతుడే యీ వంటవానిని ప్రేరేపించి యుండవచ్చు. అతడు నిజానికి వంట చేయలేడు. అతడెంతో కాలం నా యింట్లో వుండలేడు. అతడు దప్ప మరొక రెవ్వరూ నా కండ్లు తెరవలేరు. ఆ వేశ్య యిక్కడికి రావడం యిది మొదటిసారి కాదట. అంత ధైర్యం ఆ వంటవానికి తప్ప మరెవ్వరికీ లేదు. ఆ మిత్రునిపై నాకు అపరిమిత విశ్వాసమనీ, ఆ నా విశ్వాసానికి అవధులు లేవని అందరికీ తెలుసు. వంటవాడు యీ విషయం తెలుపుటకే కాబోలు నా దగ్గరకు వచ్చి “అయ్యా నేను మీ యింట్లో వుండలేను. మీరు సులభంగా మోసపోతారు. యిది నాకు తగిన చోటుకాదు.” అని చెప్పి వెంటనే వెళ్లిపోయాడు.

నేను కూడా అతణ్ణి వుండమని పట్టుపట్టలేదు. వెనక వెళ్ళిపోయిన గుమాస్తా మనస్సును విరిచింది కూడా ఈ మిత్రుడే అని నాకు అప్పుడు తెలిసింది. ఆ గుమాస్తాకు నేను చేసిన అన్యాయాన్ని తొలగించుటకు చాలా ప్రయత్నించాను. అతని విషయంలో నేను చేసిన దానికి ఇప్పటికీ నాకు విచారమే. నేను గుమాస్తాను సంతృప్తిపరచలేక పోయాను. ఎంత సరిచేద్దామన్నా అతుకు అతుకేగదా!