ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మకథ

145

ఏసు మిత్రులు నా ధర్మ జిజ్ఞాసను తీవ్రం చేశారు. అది ఏవిధంగాను శాంతించలేదు. నేను దాన్ని శాంతింపచేయాలని ప్రయత్నించాను. కాని ఏసు మిత్రులు శాంతపడనీయలేదు. అప్పుడు దర్బనులో దక్షిణ ఆఫ్రికా జనరల్ మిషనుకు అధ్యక్షులు స్పెన్సరు వాలటన్‌గారు. వారు నన్ను పసికట్టారు. దాదాపు నేను వారి కుటుంబంలో ఒకడినైపోయాను. ఈ సంబంధానికి కారణం ప్రిటోరియా పరిచయం. వాల్‌టన్‌గారి స్వభావం విచిత్రమైంది. ఆయన నన్నెన్నడు ఏసు మతంలో చేరమని చెప్పినట్లు గుర్తులేదు. కాని అతడు తన జీవితం సమస్తం నా ముందు ఉంచి తన మంచి చెడ్డల్ని నిరీక్షించు అవకాశం నాకు కల్పించాడు. అతని సతీమణి ఎంతో వినయవంతురాలు, వివేకవంతురాలు.

ఆ దంపతులు ప్రవర్తన నాకు సంతోషం కలిగించింది. మా యిద్దరికీ గల అభిప్రాయభేదం యిద్దరికీ తెలుసు. ఎటువంటి తీవ్రచర్చ కూడా మా యిద్దరి అభిప్రాయాల్ని ఏకం చేయలేదు. అయినను ఎచట ఉదారత, సహిష్ణుత, సత్యం ఉంటాయో అచట భేదాలు కూడా లాభదాయకాలే అవుతాయి. ఆ దంపతుల వినమ్రత, ఉద్యమశీలత, కార్యపరాయణత నాకు సంతోషం కలిగించాయి. అందువల్ల ఇద్దరం తరుచు ఒకచోట కలుస్తూ వుండేవాళ్లం.

ఈ సంబంధం నన్ను మత విషయంలో జాగ్రత్తపడేలా చేసింది. మతాన్ని గురించి చింతన చేసేందుకు ప్రిటోరియాలో నాకు లభించిన అవకాశం యిక్కడ లభించలేదు. అయినా లభించిన స్వల్ప సమయాన్ని గ్రంథ పఠనానికి వినియోగించ సాగాను. ఈ విషయమై మళ్ళీ ఉత్తర ప్రత్యుత్తరాలు ప్రారంభమైనాయి. రాయచంద్ భాయి నాకు యీ విషయంలో త్రోవ చూపుతూ వున్నారు. నర్మదా శంకరుని (గుజరాతుకు చెందిన ఒక ప్రసిద్ధ కవి) ‘ధర్మ విచార్’ అను గ్రంథం ఒక మిత్రుడు పంపగా దాని పీఠిక నాకు ఎంతో ఉపయోగపడింది. నర్మదా శంకరుని విశృంఖల జీవితాన్ని గురించి వినియున్నాను. ఈ పీఠికలో అతడు తన శీలాన్ని ఎలా దిద్దుకోగలిగాడో వివరించాడు. అది నాకు ఆశ్చర్యం కలిగించింది. నాకు ఆ గ్రంథం యెడ ఆదరం పెరిగింది. దాన్ని అతిశ్రద్ధగా చదివాను. మాక్సు ముల్లర్ గారి ‘India, what can it teach us’ అను గ్రంథాన్ని, దివ్యజ్ఞాన సమాజం ప్రకటించిన ఉపనిషత్తులు అనువాదాన్ని శ్రద్ధగా చదివాను. వీటన్నింటివల్ల నాకు హిందూమతంపై ఆదరణ పెరిగి, నానాటికి దాని గొప్పతనం అమితంగా కనబడసాగింది. అయితే అందువల్ల యితర మతాల యెడ వైముఖ్యం కలుగలేదు. వాషింగటన్ ఇర్వింగ్ గారి “Life of