ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మకథ

127

ఇతర అతిధులంతా మా మాటలు శ్రద్ధగా విన్నారు. వారిలో ఒకరు అందుకొని “ఏమండీ మీరు ఈ స్టీమరుకు బయలుదేరకండి. ఒకటి రెండుమాసాలు యిక్కడే వుండిపోండి. మీరు ఎలా చెబితే అలా చేస్తాం” అని అన్నాడు. “నిజం నిజం! అబ్దుల్లా సేఠ్! మీరు గాంధీ భాయిని ఆపివేయండి” అని మిగతా వారంతా గట్టిగా అన్నారు.

అబ్దుల్లా సేఠ్ మంచి ఇనుభవజ్ఞుడు. “ఇక గాంధీని ఆపగల అధికారం నాకు లేదు. ఇప్పుడు నాకెంత అధికారం వుందో మీకూ అంతే అధికారం వుంది. మీరు చెబుతున్నదంతా సత్యం. మనమంతా కలసి వారిని ఆపుదాం. కాని ఆయన బారిస్టరు. వీరి ఫీజు మాటేమిటి?” అని అన్నాడు. ఫీజు మాట ఎత్తేసరికి నాకు మనస్సు చివుక్కుమంది. నేను వెంటనే “సేఠ్‌గారూ! దీనికీ ఫీజుకూ సంబంధం లేదు. ప్రజాసేవకు ఫీజా? అసలు నేను వుంటే ప్రజా సేవకుడిగానే వుంటాను. వీరందరితో నాకు యిదివరకు పరిచయం లేదు. వీరంతా నాకు సాయం చేస్తారనే నమ్ముకం మీకు వుంటే నేను ఒక్క మాసం యిక్కడ వుంటాను. కాని ఒక్కమాట. మీరు నాకేమి యివ్వనవసరం లేదు. అయితే మనం చేయదలచుకున్న పనికి కొంత మూలధనం అవసరం. టెలిగ్రాములు పంపాల్సి వస్తుంది. అక్కడికి ఇక్కడికీ తిరగవలసిపస్తుంది. ఆయా వకీళ్ళతో సంప్రదింపులు జరపవలసి వస్తుంది. నాకు మీ “లా” రాదు కనుక కొన్ని ‘లా’ గ్రంధాలు నాకు కావాలి. అందుకు ధనం అవసరమవుతుంది. యీ పనికి ఒక్క మనిషి సరిపోడు, పలువురి సాయం కావాలి” అని అన్నాను. నా మాటలు వారందరినీ ప్రభావితం చేశాయి. “అల్లా దయవల్ల ధనం దానంతట అదే సమకూరుతుంది. జనం కావలసినంత మందిమి వున్నాం. మీరు మాత్రం “వుండిపోతాను, అని అనండి. చాలు” అని ఒక్కసారిగా అంతా అన్నారు. నాకు వీడ్కోలు యివ్వడానికి వచ్చిన అతిధి బృందం కార్యనిర్వాహక బృందం అయింది. తొందరగా విందు ముగించి ఇళ్ళకు వెళదామని అన్నాను. నేను నా మనస్సులో యిక ముందు చేయవలసిన సమరానికి రేఖలు గీచుకున్నాను. వోటరు జాబితాలలో చేరియున్నవారి పేర్లను తెలుసుకున్నాను. మరో నెలరోజులపాటు అక్కడ వుండటానికి నిశ్చయించు కున్నాను.

ఈ విధంగా భగవంతుడు దక్షిణ ఆఫ్రికాలో నా జీవితానికి పునాది వేసి ఆత్మ సన్మాన సంగ్రామానికి నాంది పలికాడు.