ఈ పుట ఆమోదించబడ్డది

80

రాయచంద్ భాయి

ఆయన ఎప్పుడూ పురుషార్ధం, ఆత్మ సాక్షాత్కారం, హరిదర్శనం అంటూ ఆ భావనలో లీనమైయుండేవాడు. ఆయన వ్రాత బల్లమీద చిఠ్ఠాలతో పాటు ఏదో ఒక వేదాంత గ్రంథం, దినచర్య (డైరీ) వ్రాసుకొనే పుస్తకం వుండేవి. వ్యవహారం ముగియగానే ఆ రెండిటిలో ఒక పుస్తకం తీసుకొనేవారు. యీ డైరీ నుంచి సమీకరించి ఆయన పలు గ్రంథాలు ప్రకటించారు. ఆయన లక్షల కొద్ది వ్యాపారస్తులతో లావాదేవీలు జరిపిన తరువాత ఆత్మజ్ఞానానికి సంబంధించిన గూఢ విషయాలు వ్రాస్తూ వుండేవారు. ఆయన సామాన్య వర్తకుడు కాడు. జ్ఞానకోటి లోనివాడు. దుకాణంలో వ్యాపారం సాగుతూ వుండగా ఆయన ధ్యానమగ్నుడై పుండటం అనేక పర్యాయాలు నేను చూచాను. ఆయన అందరితోను సమానంగా వ్యవహరించేవాడు. ఆయనకు నా విషయంలో స్వార్థం ఏమీలేదు. వారితో గాఢ పరిచయం కలిగింది. నేను అప్పటికి పనిపాటలు లేని బారిస్టరును. నేను వారి దుకాణానికి వెళ్ళినప్పుడు వేదాంత చర్చ దప్ప మరో చర్చ జరిగేదికాదు. నాకు అప్పటికి వేదాంత విషయాల్లో అంతగా ప్రవేశం లేదు. అయినా వారి మాటలే నాకు మంత్రాలుగా వుండేవి. తరువాత నేను అనేకమంది మతాచార్యుల్ని దర్శించాను. ప్రత్యేకించి విశేష ప్రజ్ఞ కలిగిన ఆచార్యుని కోసం అన్వేషించాను. కాని రాయచంద్‌భాయి యిచ్చే ఉపదేశాల వంటివి ఎక్కడా లభించలేదు. వారి ఉపదేశం సూటిగా హృదయంలో నాటుకునేది. వారి బుద్ధి యెడ, వారి ప్రామాణికత్వం యెడ నాకు అపారమైన ఆదరణ ఏర్పడింది. ఆయన నన్ను అన్యమార్గానికి తీసుకుపోడనే నమ్మకం నాకు కలిగింది. తన హృదయంలో వుండే భావాలు కొన్ని నాకు ఆయన చెబుతూ వుండేవాడు. భగవంతుణ్ణి గురించి తెలిసీ తెలియక కొట్టుమిట్టాడుతున్నప్పుడు ఆయన అండగా కనిపించేవాడు. రాయచంద్‌భాయి యెడ నాకు యింత గౌరవం వున్నా ఆయనను ఆధ్యాత్మిక గురువుగా నేను భావించలేకపోయాను. నా హృదయమందలి ఆ సింహాసనం యింకా ఖాళీగానే వున్నది. నా అన్వేషణ యింకా సాగుతూనే వున్నది.

హిందూ వేదాంతం గురువు అను పదానికి ఎంతో మహత్తు కల్పించింది. దాన్ని నేను అంగీకరిస్తాను. గురువు లేనిదే ముక్తిలేదన్న విషయం సత్యం. అక్షర జ్ఞానం కలిగించే గురువు అజ్ఞాని అయినా ఫరవాలేదు. కాని ఆధ్యాత్మిక గురువు అసమర్ధుడైతే సాగదు. గురువు పదవికి పూర్ణ జ్ఞానియే అర్హుడు. జ్ఞానప్రాప్తి కోసం సదా సర్వదా శోధన ఆవసరం. శిష్యుని యోగ్యతననుసరించి గురువు లభిస్తాడు. తన తన యోగ్యతను బట్టి ప్రతి సాధకుడు ప్రయత్నించవచ్చు. అట్టి అధికారం అతనికి వుంటుంది. ఫలితం ఈశ్వరాధీనం.