పుట:సకలనీతికథానిధానము.pdf/130

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

124

సకలనీతికథానిధానము


ఆ.

తనదుపుత్రుఁ డనుచు దాసిపుత్రునిఁ దెచ్చి
ప్రేమ మేఖలకునుఁ బెండ్లి సేయఁ
బడఁతి యెఱిఁగి మానభంగంబునకు రోసి
రత్నసుందరియును రాజు గూడి.

348


వ.

ఉన్నయవసరంబున నడుగులం బడి తనమానభంగంబు విన్నవించిన నూరకున్న నది రాజకృత్యంబని కోపించి రత్నసుందరి యతఃపురంబున కరిగిన నక్కేయూరబాహుండు విరహభ్రాంతచిత్తుండై మధ్యమకుడ్యకుహరస్తంభవేదికాస్థలంబున విచారనిద్రాలసుండై యున్న సమయంబున నిద్దఱుదూతికలు తమలో నిట్లనిరి.

349


క.

చారాయణుండు మెల్లన
నారీమణి మేఖలకును నచ్చినగతి నే
పోరామి చేసి మానము
దూరము గావించె నిట్టిధూర్తుడు గలఁడే.

350


వ.

అనిన మఱి రెండవ దిట్లనియె.

351


ఆ.

చేరఁదగనివానిఁ జేరుచుకొన్నను
ప్రాణమానహాని ప్రాప్త మగును
కాకిఁ జేర్చుకున్న గాదె హంసకు మున్ను
ప్రాణహాని యగుట పద్మనయన!

352


వ.

అది యెట్లనిన.

353


ఆ.

చిత్రకూటనగము(శిఖరము)నందును
హంస లున్నవేళ నచటి కొక్క
కాకి చేర నచటఁ గా లూఁదనిచ్చిన
రెట్టవెట్ట మఱ్ఱిచెట్టు మొలిచె.

354