పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/861

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆర్యసమాజము


I ఈ దృశ్యమాన ప్రపంచమునకు మూల కారణములు మూడని యీ సంఘసిద్ధాంతము. (1) ఈశ్వరుడు, (2) జీవులు, (3) ప్రకృతి. ఇందు మొదటి రెండు పదార్థములు చేతనములు. మూడవదైన ప్రకృతి జడము.

(1) ఈశ్వరుడు :- సచ్చిదానంద స్వరూపుడు. నిత్య శుద్ధ బుద్ధ ముక్తస్వభావుడు. సృష్టి, స్థితి, లయములకు కారణభూతుడు. ఆద్యంతములు లేక నిర్వికారుడై, నిరంతరము సర్వాంతర్యామియై, జీవులకు కర్మఫలముల నొసంగుచుండును. అతడే విశ్వమున కధిష్ఠాత. శివుడు, విష్ణువు, మహాదేవుడు, బ్రహ్మము, పరమాత్మ, ఇంద్రుడు, అగ్ని, వాయువు మున్నగు అనేక నామములచే వేద శాస్త్రములందు పేర్కొనబడి యున్నాడు.

“ఏకం సత్ విప్రా బహుధా వదన్తి అగ్నిం మిత్రం వరుణ మాహు రథో దివ్యః స సుపర్ణ"

ఓంకార మతనికి ముఖ్యనామము. ఓంకారమే ప్రణవ మనియు చెప్పబడును. సృష్టి ప్రారంభమునుండి ఋషులీ నామముతోనే యీశ్వరుని స్మరించిరి.

“తస్య వాచకః ప్రణవః" - యోగశాస్త్రము.

ఈశ్వరుడొక్కడే. అతనికి సమానుడుకానీ, అధికుడు కానీ మరియొకడు లేడు.

"అణో రణీయాన్ మహతో మహీయాన్" అనున దీతనియం దన్వర్థము. • ఈశ్వరుడు నిరాకారుడు. కావున నతడు శరీరధారి కాడు. రాముడు, కృష్ణుడు, క్రీస్తు, బుద్ధుడు మున్నగువారు మహాపురుషులేకాని ఈశ్వరుని యవతార పురుషులు కారు. వీరెల్లరు జీవకోటిలోనివారే. ఇట్టి ఈశ్వరు నుపాసించి జీవులు పరమపదము నందగలరు. జీవులు ముక్తులగుటకు జీవేశ్వరులకు మధ్య అవతార పురుషులను కానీ, సందేశహరులను కానీ, దేవుని ప్రియ పుత్రులను కానీ అంగీకరించవలసిన యవసరము లేదని ఆర్యసమాజము చాటి చెప్పెను.

ఈశ్వరుడు సృష్టి ప్రారంభమునందే మానవులకు వలయు జ్ఞానము, మహర్షుల పవిత్రాంతఃకరణములందు ప్రకాశింప జేసియున్నాడు. ఆ జ్ఞానమే వేదములనబడును,

ఈశ్వరుడు సర్వవ్యాపకుడు, నిరాకారుడు కావున నతనికొక ప్రతికృతి (బొమ్మ) కానీ, ప్రతిమ (విగ్రహము) కానీ యేర్పరుపజాలము. అందువలన విగ్రహారాధనము ఈశ్వరారాధనము కాదనియు, నది యవై దికమగుటచే త్యాజ్యమనియు నార్యసమాజము బోధించును.

ఆర్యసమాజము సగుణ నిర్గుణోపాసనముల నంగీకరించును. 'భగవంతుడాయా గుణములు (ఆనందాదులు) కలవాడనిభావించుట సగుణోపాసనము. ఆయాగుణములు (రాగద్వేషాదులు) లేనివాడని భావించుట నిర్గుణోపాసన మని ఈ సమాజము చెప్పును. ఈశ్వరుడు సగుణుడయ్యు సాకారుడు కాడు. అందువలన సాకారోపాసన ఈశ్వరో పాసనము కాజాలదని సమాజ మభిప్రాయపడుచున్నది.

(2) జీవులు:- రెండవ చేతన తత్త్వము జీవుడనబడును. సుఖము, దుఃఖము, ఇచ్ఛ, రాగము, ద్వేషము, జ్ఞానము, ప్రయత్నము మున్నగు గుణములు జీవుని లక్షణము. జీవతత్త్వము, ఈశ్వర తత్త్వమువలె సర్వ వ్యాపకము కాక, అణుపరిమాణము కలదియై యుండును. కాని యిదియు పుట్టుక, నాశము లేనిదై యుండును. సర్వజ్ఞము కాక యల్పజ్ఞము, సర్వశక్తిమంతము కాక యల్పశక్తిమంతమై యుండును. ఇట్టిజీవులు ప్రతి శరీరమున కొక్కటి చొప్పున నసంఖ్యాకము లని యార్య సమాజ మంగీకరించును. ఇదియే శాస్త్ర సమ్మతము.

జీవులు కర్మచేయుటలో స్వతంత్రులుగా నుందుర ఫలము ననుభవించుటలో వారికి పారతంత్య్రము తప్పదు అందువలన నిష్టమువచ్చినట్లు శుభాశుభ కర్మల నొనరించి వానికి తగిన ఫలముల నీశ్వరు డొసంగగా తప్పనిసరిగా వారనుభవింతురు. ఆయా కర్మల ఫలముల ననుభవించటకు జీవు లొక శరీరమును విడిచి మరియొక శరీరమున బొందుచుందురు. అందువలన క్రిమికీటాది బ్రహ్మ పర్యంతము గల శరీరములు జీవులు కర్మానుగుణ ఫలముల ననుభవింప ననువగు యోనులు, జీవులకు శరీరముతో సంబంధము కలుగుటను జన్మమనియు, శరీరముతో సంబంధము విడిపోవుటను మరణ మనియు నందురు జీవునకు స్వరూపతః జనన మరణములు లేవు.

"న హన్యతే హన్యమానే శరీరే"

"జీవులు జన్మింతురుకాని, వారికి నాశములేదు. అను సిద్ధాంతము బుద్ధి విరుద్ధమని యార్యసమా