పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/859

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆర్యభటుడు


భూమికి దూరముగనుండు ప్రతి మండలస్థానము 'ఉచ్చ' అనియు, సన్నిహితముగనుండు ప్రతి మండల స్థానము 'నీచ' అనియు పిలువబడును. ఉచ్చస్థానమునకు మందగతి ఫలసాధనము చేసినపుడు 'మందోచ్చ' అనియు, శీఘ్రగతి ఫలసాధనము చేసినపుడు 'శీఘ్రచ్చ'అనియు చెప్పబడును. ఉచ్చస్థానమునుండి భుజఫలమును సాధించి ధన సంస్కారమును లేక ఋణ సంస్కారమును చేసినచో ప్రతిమండల వృత్తమునందు తిరుగు గ్రహము కక్షామండల మందు స్ఫుటగ్రహమై కనబడును. ఇట్టి సంస్కారములకు వలయు కొన్ని స్థిరాంకములను ఆర్యభటుడు ప్రయోగపూర్వకముగా నిర్ణయించెను. అవి నేటికిని అట్లే వాడబడుచున్నవి. (గ్రహలాఘవము - మధ్యమాధికారము)


గోళపాదము :- ఇందు ప్రయోగసిద్ధికై ఖగోళ కల్పనాదికములతో కూడిన యంత్ర నిర్మాణములు చెప్పబడెను. ఈ నిర్మాణములతో ప్రయోగములను సలిపి రాత్రింబవళ్ల ప్రమాణములు, ఉదయాస్తమయ కాలములు, రాత్రింబవళ్ల వృద్ధిక్షయములు, ఆయా దేశము లందు మేషాది రాసుల యొక్క ఉదయ కాల ప్రమాణములు, ఇష్టకాల నిర్ణయము, దృక్కర్మ విధానము, గ్రహణప్రకారము మున్నగు విషయము లన్నియు చెప్పబడెను. ఈ నిర్ణయములు గోళ త్రికోణమితికి చెందినవై శాస్త్రీయ నిరూపణములకు తగియున్నవి.

గ్రంథమందలి విషయము లన్నియు సాంకేతిక భూయిష్ఠము లగుటచేతను, సంక్షిప్తముగా సూత్రప్రాయములై యుండుటచేతను సంప్రదాయసిద్ధములుగా రచింపబడిన వ్యాఖ్యానములఅవసరము అనివార్యమైయుండును తరువాతివారగు బ్రహ్మగుప్తుడు, శ్రీధరాచార్యుడు భాస్కరాచార్యుడు మున్నగువారి ప్రతిభకు కూడ ఆర్మభటుడే మూలమని చెప్పకతప్పదు. వారందరు కొన్ని మార్పులతో ఆర్యభటుని నిర్ణయవిధానములనే బహుశముగా స్వీకరించియుండిరి. ఇట్లు దైవజ్ఞ మూర్ధన్యు డగు ఆర్యభటుడు జ్యోతిశ్శాస్త్ర ప్రవర్తకులలో విశిష్టస్థానమును వహించుచు అగ్రగణ్యుడై వరలెను.

ఆర్యభటుని గూర్చి విమర్శకుల దృష్టిని ఆకర్షించు మరియొక విషయము భూభ్రమణ సిద్ధాంతము. అతడు ఇరుపక్షముల వారికి అనువగు రెండు వాదములను చెప్పెను. 'పడవమీద పోవువారు ఒడ్డుమీద స్థిరముగా నుండు వృక్షాదులను తమకు వ్యతిరేకదిశలో పోవు చున్నట్లు గమనించుదురు. అట్లే తిరుగుచున్న భూమిమీద నున్న వారు గ్రహ నక్షత్రాదులు తిరుగుచున్నట్లు భావింతురు. కాని అవి స్థిరముగనే యున్నవి' (గో. పా.9 అని భూభ్రమణ సిద్ధాంతమున కనుగుణముగ చెప్పెను అట్లే 'సూర్యాది గ్రహములకు ఉదయాస్తమయములను కల్పించుచున్న నక్షత్ర పంజరము ప్రవాహవాయువు ఎల్లప్పుడును ప్రేరేపింపబడుచు లంకాస్థానమున నుండి వారి శిరోభాగమున సమపశ్చిమముగా కదలుచు తిరుగు చున్నది' (గో. పా. 10) అని నక్షత్ర భ్రమణము ప్రత్యేకించి చెప్పుటచే భూభ్రమణ సిద్ధాంతము నిరసిం