పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/855

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆర్థిక వ్యవసాయ ప్రణాళిక (ఇండియా)


కర్మకారుల ఉత్పత్తి పద్ధతులను అభివృద్ధి చేసిన యెడల వారు చేయు వస్తూత్పత్తి యెంత యో అధికము కాగలదు. ఇంతటి శిక్షిత మనుష్యశక్తి విలువ నుపేక్షించుట, వస్తువులను, సంపదలను వ్యర్థముచేయుట మాత్రమే కాగలదు. చిన్న పరిశ్రమలద్వారాను, కుటీర పరిశ్రమలద్వారాను ఉత్పత్తిచేయువారిని అశ్రద్ధచేయుట అవాంఛనీయమైన చర్య కాగలదు. ఈ పరిశ్రమలలో నిమగ్నమైన అధికసంఖ్యలో నున్న జనులను అందుండి తొలగింపజాలము. వ్యవసాయదారులకు ఉపవృత్తుల యొక్క ఆవశ్యకతయు అంతటి ప్రాధాన్యముగల విషయమే. గృహ పరిశ్రమలను, చిన్న పరిశ్రమలను నిర్లక్ష్యముచేసి కేవలము భారీపరిశ్రమలను మాత్రమే ప్రోత్సహించు విధానమువలన అప్రధానసంఖ్య గల ఒక వర్గము వారి జీవనప్రమాణము పెరుగుటకు దోహదము కలుగుటయు, వ్యవసాయముపై నాధారపడిన తక్కిన వారిని దారిద్య్రముపాలు చేయుటయు కాగలదు. జన సంఖ్యలో నూటికి 70 మంది గ్రామసీమలందు నివసించు చున్నారు. గ్రామసీమలందలి అదనపు జనాభాకు జీవనోపాధి చూపించవలెను. జనసంఖ్యలోని అన్ని వర్గములకు పనిచూపించుటయే భారత దేశార్థికాభ్యుదయ సమస్య యొక్క కీలకము. మనదేశములోని జనులలో అధిక సంఖ్యాకులు గ్రామనివాసులగుట, వారి ప్రధాన జీవనోపాధి వ్యవసాయమే యగుట, వారికి చాలినంతపని లేకుండుట వాస్తవ విషయములు. ఈ పరిస్థితుల నుండియే కుటీర పరిశ్రమల ఆవశ్యకత ఉద్భవించుచున్నది. ఈ పరిస్థితులనుండి సంభవించిన రుగ్మతకే ఈ పరిశ్రమలు దివ్య ఔషధములు.

కుటీర పరిశ్రమలు పెక్కుమందికి పని కల్పించి, సంపదను సృష్టించుటతోపాటు అది విస్తృతముగా విభజనయగుటకు దోహద మివ్వగలవు. అసమర్థుడగు కార్మికుని సృష్టి స్వల్పమే కావచ్చును. కాని శరీర సౌష్ఠవము కలవారందరికి పనికల్గించుట యనునది మనముందు గల సమస్య. ప్రజలకు స్వగృహములందే పని కల్గించుట చిన్న పరిశ్రమల యందలి విశిష్టమైన సౌకర్యము. చిన్న పరిశ్రమలలోను కుటీర పరిశ్రమలందును కూడ సాంకేతిక విధానములను వృద్ధిచేసి, గ్రామసీమలు కలకలలాడునట్లు చేయవచ్చును. నేడు జనసంఖ్యతో పోల్చిన పెట్టుబడి అవకాశములు తక్కువగా నున్నవను విషయమును మనము విస్మరింపకుందుముగాక. పెట్టుబడి అవకాశములును మిగుల మందముగా వృద్ధియగుచున్నవి. తాత్విక చర్చలవలన ఈ సమస్యలు పరిష్కారము కావు. పెట్టుబడి కొదువగ నున్నప్పుడు ముడి సరకులను సంపదలను సమంజసమగురీతిని వినియోగించుటకు వీలుకాదు. ఒక మొత్తమును చిన్న పరిశ్రమలకు గృహపరిశ్రమలకు పెట్టుబడిగా వినియోగించిన యెడల అందుమూలమున ఎక్కువ పరిశ్రమా విభిన్నత్వము, పరిశ్రమా వికేంద్రీకరణము, మరియు తొందరలో సత్ఫలితముల ప్రాప్తించగలవు.

మన ఆర్థిక సమస్యను గ్రహించినవారికి జనసంఖ్య సమస్యను గూర్చియు, సంతాన నిరోధమును, పద్ధతుల గూర్చియు తాత్త్విక చర్చల వలన నిది పరిష్కరింపబడదను విషయము సుస్పష్టమే. దేశమున బహుళసంఖ్యలో గల ప్రజలకు పని కల్పించనలెనను వాస్తవిక దృష్టితో ప్రణాళికలు తయారు చేయుటయే యిందులకు పరిష్కార మార్గము. ద్వితీయ పంచవర్ష ప్రణాళికలో చిన్న పరిశ్రమలకు, గృహపరిశ్రమలకు ప్రాముఖ్యము ఇవ్వబడిన కారణమిదియే. జపాను. స్విట్జర్లండు దేశములందు పరిశ్రమలు అద్భుతముగ వృద్ధియగుటకు కారణము వానికై జాగరూకతతో ప్రణాళిక వేసి, శ్రద్ధతో తదను గుణ్యముగ వృద్ధిచేయుటయే. భారతదేశమున గూడ వానినట్లే వృద్ధిచేసి తద్వారా రైతుల పరిస్థితిలో మారుపు కల్గించుట అసాధ్యమగు విషయముగాదు.

చిన్న పరిశ్రమలను గృహపరిశ్రమలను గురించి ప్రణాళికలు వేయుట ఇటీవలి విషయము. మన ఆర్థిక వేత్తలలో పెక్కుమందికి వీనిలో ఇటీవలి వరకు నమ్మకము లేదు.

గత 5 సంవత్సరములలో కుటీరపరిశ్రమాభివృద్ధి హైద్రాబాదు ప్రభుత్వము మిగుల నిర్దుష్టమైన చర్యలు తీసికొనినది. పారిశ్రామిక సహకార సంఘముల సమాఖ్య వీని ఉత్పత్తికి ధనసహాయము, విక్రయ సదుపాయముల కల్గించుచున్నది. ప్రభుత్వ వాణిజ్య పరిశ్రమలశాఖ ఉత్పత్తి విధానముల వృద్ధిపొందించుటకు శిక్షణ కేంద్రము