పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/854

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆర్థిక వ్యవసాయ ప్రణాళిక (ఇండియా)

• హెచ్చుచేయుటకు ప్రయత్నించుట అవసరము. పౌరులెల్లరు ఆర్థికాభ్యుదయ కార్యక్రమములో ప్రముఖపాత్ర వహింప జాలెడు ఆర్థిక వ్యవస్థానిర్మాణమునకు మనము ప్రయత్నించవలెను. స్వల్ప సగటు ఆదాయము, ప్రాముఖ్యముగా వ్యవసాయాధారమైన ఆర్థికవ్యవస్థ, అధికముగా పెరిగిపోయెడు జనసంఖ్య, అధికమైన దామాషా జననమరణాలు, భారీపరిశ్రమలు లేమి - ఇవి వెనుకబడి యున్న ఆర్థిక వ్యవస్థ యొక్క కొన్ని లక్షణములు. జనసంఖ్య పెరుగుదలను ఆపుచేసెడు చర్యలు, సంపదలను వినియోగించుటకు సాంకేతిక నైపుణ్యము అత్యవసర విషయములు. జలవిద్యుచ్ఛక్తి యంత్రముల స్థాపనకు, జలాధారముల నిర్మాణమునకు, వ్యవసాయములో యంత్ర విధానములు ప్రవేశపెట్టుటకు అభివృద్ధిచెందిన దేశములు వెనుకబడిన దేశములకు తోడ్పాటు నియ్య వలెను. దురదృష్టవశమున హద్దువద్దులు లేక పెరిగి పోయెడు జనసంఖ్య ఆర్థికాభివృద్ధికి ఒక పెద్ద అడ్డంకియైనది. బహుముఖాభివృద్ధిని సాధించుటకు కాలవ్యవధి, పాశ్చాత్య దేశములవారి తోడ్పాటు అవసరము. కావున స్వల్ప కాలములోనే సత్ఫలితముల నీయజాలెడు ఉపాయ ములను మనము అన్వేషించవలసియున్నది. మానవుల అనుదిన జీవితమును సుఖప్రదము చేయుట యనే మహా ప్రయత్నములో మనము నిమగ్నులమై యున్నాము. నిరుద్యోగముకన్నను చాలినంత పనిలేకపోవుట భారతదేశమును, ఆసియాయందలి ఇతరదేశాలను పీడించుచున్న గడ్డువ్యాధి. జీవనప్రమాణాలు బహుతక్కువగా నుండుట కిదియే హేతువు. జనసంఖ్య పెరిగిపోవుటవలన వ్యవసాయములో నిమగ్నులయిన వారిసంఖ్య సాగులో నున్న భూవిస్తీర్ణమునుబట్టి ఉండవలసినదానికంటెను అధికముగా నున్నది. దుష్టములయిన భూయాజమాన్య విధానములు, సామర్థ్యరహితములైన వ్యవసాయపద్ధతులు, మిగుల చిన్నవైన వ్యక్తిగత భూవసతులు జీవితముపట్ల అనాది సిద్ధమైన అవకతవకదృక్పథము- ఈ సమస్యను మిగుల క్లిష్టతరము చేయుచున్నవి. జనసంఖ్య వత్తిడిని తగ్గించుట అవసరము, వ్యవసాయ కూలీలసంఖ్య ఉద్యోగావకాశములను మించి పెరిగిపోవుచున్నది. మన వ్యవసాయము ఋతుపవనములతో: జూదము కావున చాలినంత పనిలేకుండుట మన ఆర్థికవ్యవస్థకు వంటబట్టిన రోగమై పోయినది. పరిశ్రమలు నెలకొల్పుట ద్వార ప్రజలను గ్రామ సీమల నుండి పట్టణములకు మార్పుచేయగలము. కాని పెట్టుబడి నిర్మాణము శీఘ్రముగ వృద్ధిపొందకుండుటచే, అందులకు అత్యావశ్యములైన ఆర్థిక వసతులు సమకూరకున్నవి. భారతదేశమునందు ఇంతవరకు ఆంగ్లవ్యవసాయ విప్లవము వంటి విప్లవముయొక్క ఛాయలైనను పొడచూపుట లేదు. నేటి చేతిపనులలోను, చిన్న పరిశ్రమలలోను నవీన పద్ధతులను ప్రవేశ పెట్టియు, వానిని తద్వారా వృద్ధి చేసి జీవనప్రమాణమును పెంచవచ్చును. అవి గ్రామసీమలందే కలవు. కావున వానిద్వారా రైతులయొక్క పెక్కు అవసరములను తీర్చవచ్చును. అవి నేటికిని పెక్కుమందికి జీవనాధారములుగ నున్నవి. భారతదేశమునందు 2 కోట్ల మంది చిన్న పరిశ్రమలలో, కుటీరపరిశ్రమలలో పనిచేయు చున్నారు. కావున వానిని వృద్ధిచేయుట సమంజసమైన విషయము, చేనేత పరిశ్రమ ద్వార దేశమున తయారగు బట్టలో నాల్గవ వంతు ఉత్పత్తి యగుచున్నది. సింహళములో ఇట్టి పరిశ్రమలు (చిన్న పరిశ్రమలు, కుటీర పరిశ్రమలు) మొత్తము జనసంఖ్యలో పదవ వంతుకు పని కల్పించుచున్నవి. దీనినిబట్టి జనసంఖ్యలో పెక్కుమందికి పనికల్పించి, వ్యవసాయముపై నాధారపడిన జనుల జీవన ప్రమాణము యొక్క పెంపుదలకు దోహద మివ్వజాలునను విషయము స్పష్టమైనది. భారీపరిశ్రమల పోటీ వలన పతనమునకు గురియైన ఈ పరిశ్రమలలో నవీన పద్ధతులను ప్రవేశ పెట్టి, వాటికి నూతన శక్తి సౌష్ఠవములను చేకూర్చవలెను.

గృహపరిశ్రమలు, చిన్నపరిశ్రమలు ఆవశ్యకములా ? యని తర్జనభర్జనలు చేయవలసిన కాలము గతించినది. వానికి మన ఆర్థిక వ్యవస్థలో అత్యధిక ప్రాధాన్య మున్నది. వానివలన తయారగు వస్తునంచయము హెచ్చు కాగలదు. పెట్టుబడి పెట్టుటకు మనకుగల శక్తి స్వల్పమైనది. కాని మనకు అపొర మనుష్యశక్తి సంపద గలదు. భారీ పరిశ్రమలు వృద్ధిపొందరాదని ఎవరి అభిమతమును కాదు. 'కాని నేటి పరిస్థితులలో గృహపరిశ్రమలు, చిన్న పరిశ్రమలు మాత్రమే ఉత్పత్తిని పెంచుటలోను, ప్రజావసరములను తీర్చుటలోను స్వల్పకాల సత్ఫలితముల నియ్యగలవు.