పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/847

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆర్ధిక ఖనిజములు


ఆర్థిక ఖనిజపుగనులు ముఖ్యముగా రెండురకములుగా నున్నవి. మొదటిది భూమి పైనుండియే లోతుగా గోతులు త్రవ్వితీయునవి. వీనిని క్వారీలు (quarries) అందురు, రెండవది, భూమిలో సొరంగములుగా త్రవ్వి తీయునవి. వీనిలో మొదటిరకపుగనులు, ఖనిజములు భూమి పైననే దొరకుచోట్లగాని, లేక ఖనిజము లెక్కువ విలువలేనివై చాల తక్కువ ఖర్చుతో త్రవ్వి తీయబడగల చోట్లను, ఇంకా యిట్టి యితర సందర్భములలోను తీయుదురు. ఇవి సాధారణముగా 100 అడుగులకంటె ఎక్కువలోతు ఉండవు. కాని, ఒక్కొక్కప్పుడు 400-500 అడుగులవరకు కూడ లోతు ఉండుట గలదు. కొన్ని బొగ్గుగనులు, పలక రాళ్లు, కట్టడపు రాళ్ళు మొదలైన ఖనిజముల గను లీతెగకు చెందినవి. ఇట్టి గనులందు భూమియందుండి వచ్చు ఊటనీరేగాక వర్షపునీరుగూడ చేరుచుండుటచేత ఆనీరు పైకి తోడుటకు వ్యయమధికముగా నగుచుండును.

సొరంగపు గనులు, భూమిలో లోతుగానున్న ఖనిజ నిధులను త్రవ్వితీయుటకును, లేక భూమి పైభాగము నుండి క్వారీలద్వారా త్రవ్వుటకు సాధ్యముగాని, నిధులను త్రవ్వుటకును ఉపయోగింతురు. భూమి పైభాగము నుండి బావులు, లేక యేటవాలుగా నున్న సొరంగముల ద్వారా ఖనిజము లున్న చోట ప్రవేశించి వానిని త్రవ్వి తీయుదురు. ఖనిజనిధి జేరినవిదప దానియందే తగురీతిని వేర్వేరు సొరంగములను త్రవ్వి ఖనిజమును భూమి పైకి తీయుదురు, ఈ సొరంగములు పట్టాలమీద నడచు తొట్టి బండ్లలో ఖనిజమును పైకి తీసికొని పోవుటకును, పనివారు నడుచుటకును, పైనుండి పరిశుభ్రమైన గాలి పారుటకును తగినట్లు వెడల్పు, ఎత్తు గలిగియుండును. ఇట్టి గనులలో నొక్కొక్క ఖనిజమునకు సంబంధించిన సమస్యలు అసంఖ్యాకములుగా నుండును. సాధారణముగా నన్ని గనులలోను నీరూరుచుండును. ఆ నీటిని పైకి తోడుటకు పంపులు ఏర్పాటు చేయుచుండవలెను. ఖనిజములను, వాటి నంటియున్న శిలలను పగులగొట్టుటకై వాడు ప్రేలుడుమందు నుపయోగించుటచే జనించు విష వాయువులను, తదితర విషవాయువులను పైకి పంపుటకై పరిశుభ్రమైన గాలి గనులలోనికి వచ్చున ట్లేర్పాట్లు చేయవలెను,

బొగ్గుగనులు సుమారు 2000 అడుగులకంటే ఎక్కువ లోతుగా నుండవు. కాని కొన్ని ధాతు ఖనిజములగనులు 10,000 అడుగులకంటెగూడ ఎక్కువ లోతుగా నుండును. అట్టి గనులలో భూమిలోనికి పోయినకొలది వేడిమి యెక్కువగుచుండుట చేత పైనుండి పంపెడు పరిశుభ్రవాయువును చల్లబరచి పంపవలసి వచ్చుచుండును, ప్రపంచములో చాలాచోట్ల బంగారపు గనులు 10 వేల అడుగులపైగా లోతుగా నున్నవి. కోలారులో నున్న బంగారపు గనులుగూడ నట్టివానియందు జేరినవే. ఇట్టి లోతుగల గనులలో, పైనున్న శిలల పీడనమువలన ఒక్కొక్కప్పుడు రాళ్ళు తమంతటతామే ప్రేలు చుండి (Rock burst) ప్రమాదములు సంభవించుచుండును. అట్లే కొన్ని బొగ్గుగనులలో కొన్ని వాయువులు అగ్ని సోకగానే ప్రేలుటగాని, మండుటగాని సంభవించి ప్రమాదములు కలుగుచుండును. ఖనిజములు త్రవ్వి తీయగానే పైనున్న రాళ్ళు విరిగి పడకుండ కర్ర, లేక యినుప దూలములు, స్తంభములు, పోటీ పెట్టి యుంచుట గనులలో సామాన్య విషయమే. కొన్ని బొగ్గుగనులలో బొగ్గు తీయగానే, ఖాళీయైన స్థలమును ఇసుకతోగాని మరి యితరరాళ్ళ ముక్కలతోగాని నింపు చుందురు. ఇట్లు చేయుటచే గనులలోని పైభాగపు రాయి విరిగి పడకుండా నుండును. ఇట్లిసుకతో నింపుట సేండ్ స్టోయింగ్ (San stowing) అనబడును. ఇంకను ఇట్టి సమస్యలవలన ఒక్కొక్కప్పుడు, ఖనిజ నిధులు బాగుగా నున్నను వాని సేకరణ లాభదాయకముగా నుండదు. పెట్రోలియం గనులు పై జెప్పిన గనులవలెగాక మొదట బోరింగు వల్ల నీ ఖనిజమున్నదని తెలిసినచోట, పై నుండి యే పంపుల నేర్పరచి గొట్టముల ద్వార దీనిని పైకితీయుదురు. వీటిని నూనెబావు (Oil wells) లందురు.

ముడి ఖనిజములను శుభ్రపరచుట  :- ముడిఖనిజములను గనులనుండి త్రవ్వితీసిన వెనుక వాటిలో వివిధ పరిశ్రమలకు పనికివచ్చు ఖనిజములను వేరుచేసి శుభ్రపరుచుదురు. ఇట్లు శుభ్రపరచుట ఓర్ డ్రెస్సింగు (ore dressing) అందురు. పైన జెప్పినట్లు అలోహ ఖనిజములను చాలవరకు ఆ రూపములలో నే పరిశ్రమలలో వాడుదురు. అందు వీటిని శుభ్రపరచుట అనగా వానితో కలసియున్న