పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/825

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆయుర్వేద గ్రంథములు


మున్నగువానిని నివారణము చేయు పెక్కు ఓషధులు చెప్పబడెను.

గ్రహములను గూర్చి ఋగ్వేదము 10 మం. 118, 145, 161–166 సూక్తములలోమ వర్ణనలు కనుపించు చున్నవి. మానసరోగ చికిత్సను గూర్చియు, ఆరోగ్యమునకు మనస్సు ముఖ్యకారణమను విషయమును గూర్చియు గోపథ బ్రాహ్మణమున I, 30 వాక్యములో కనిపించు చున్నది. మణి మంత్రౌషధముల ఉపయోగములను గూర్చి తైత్తిరీయ సంహిత 4 వ కాం- 2 ప్ర- 6వ అను-2వ మంత్రములో కలదు. శల్యశాలాక్యములను గూర్చి ' ఋగ్వేదము 1వ మం. 116వ సూ. 15వ ఋక్కులోను ఇంకను అనేక స్థలములలోను వర్ణించబడి యున్నది. రసాయన వాజీకరణములను గూర్చి ఋగ్వేదము 1 మం. 117 సూ. 13వ ఋక్కులో చెప్పబడి యున్నది. ఈరీతిగ త్రిస్కంధాత్మక మగు అష్టాంగాయు ర్వేదమును గూర్చి వేదములందు గల వర్ణనము దిజ్మాత్రముగ సూచింపబడినది. ఆయుర్వేద గ్రంథములను మూడు రకములుగ విభజింపవచ్చును. అవి (1) వైదిక గ్రంథములు, (2) ఆర్షగ్రంథములు, (3) అనార్ష గ్రంథములు.

1. వైదిక గ్రంథములు  : చతుర్ముఖ బ్రహ్మ కల్పాది యందు వేదములను స్మరించినట్లుగనే ఆయుర్వేదమును గూడ స్మరించి పిమ్మట దీనిని లక్షశ్లోకరూపమగు సంహితగ చేసెనని ఇతిహాసమువలన తెలియుచున్నది. దీనికి బ్రహ్మసంహిత యని నామధేయము. ఇయ్యది వైదిక గ్రంథమని నుడువనగును. దీనిని బ్రహ్మ తన పుత్రుడగు దక్షప్రజాపతికి ఉపదేశించెను. దక్షుడును తాను గ్రహించిన యీ విద్యను .అశ్వినీదేవతలకును, వారింద్రునకును బోధించిరి. వైదిక గ్రంథములు పై నుదహరించిన బ్రహ్మ సంహితకన్న మరి వేరుగ కన్పడవు. ఆ బ్రహ్మసంహితయు భూలోకమున ప్రచారము నందలేదు.

2.. అర్షగ్రంథములు : ఇవి ఋషి పుంగవులచే రచింపబడిన తంత్రములు. ఋషులు అతీంద్రియ ద్రష్టలు ‘కావున వారు చెప్పిన విషయములలో సంశయములుండుటకు తావులేదు. కాన అత్యంత ప్రమాణములుగ - వీటిని స్వీక రింపదగ్గును. ఋషులకు వైద్యశాస్త్రము లభించిన విధము చరకసంహితాది గ్రంథములందు ఉదహరింపబడెను.

ఈ మహాయుగము యొక్క మొదటి భాగమగు కృతయుగ సమాప్తి సమయమున అనగా ఇప్పటికి సుమారు 22 లక్షల సంవత్సరములకు పూర్వము భూలోకము నందలి ప్రజలు రోగపీడితులై ధర్మార్థ కామమోక్షములను సాధించుటకు అసమర్థులై ఉండుటను గని భరద్వాజాది ఋషీశ్వరులు హిమవత్పర్వత ప్రాంతమునందు సభచేసిరి. ఆ సభా సదులందరును ధ్యానయోగముచే సురాధిపతియగు దేవేంద్రుడు మధ్యమలోక వాసుల బాధల తొలగించునని తెలిసికొని ఇంద్రునినుండి వైద్యశాస్త్రమును గొనివచ్చుటకు సమర్థుడు భరద్వాజుండని నిర్ణయించి ఆతని స్వర్గలోకమునకు బంపగా ఆ యుదంతము నంతయు నాకర్ణించి ఇంద్రుడు భరద్వాజునకు తాను అశ్వినీ దేవతల వద్ద నభ్యసించిన వైద్యశాస్త్రము నుపదేశించెను. భరద్వాజుడు తన విద్యను పునర్వసుడను పేరు గల ఆత్రేయుడు మొదలగువారి కుపదేశింప వారు తమ తమ పేర గ్రంథములను రచించిరి. వీటినే ఆర్షగ్రంథములని వ్యవహరించుదురు. ఆయుర్వేదమునందలి అష్టాంగము లనుగూర్చి గ్రంథములను రచించి వీరు లోకమునకు ఉపకారము గావించిరి. ఇందు ప్రధానముగ నేటివరకును పఠనపాఠములలో నున్న (1) చరకమును గూర్చియు, (2) సుశ్రుతమును గూర్చియు, (8) ఆర్షము కాకపోయి నను తత్తుల్యముగనుండు అష్టాంగ హృదయమును గూర్చియు ప్రథమమున వర్ణించబడుచున్నది.

1. అగ్ని వేళతంత్రము : ఇది చరకమహర్షిచే సంస్కరింపబడి చరకసంహితయని ప్రకృతము వ్యవహరింపబడు చున్నది. భరద్వాజుని శిష్యుడగు ఆత్రేయుడు ' కాయ చికిత్సా ప్రధానమైన వైద్యశాస్త్రమును అగ్ని వేళ, భేల, జాతూకర్ణ, పరాశర, హారీత -క్షారపాణి యను నాల్గురు శిష్యుల కుపదేశించెను. వారందరును తమతమ పేర నొక్కొక్క గ్రంథమును రచించిరి. ఇవి అర్ష వైద్యగ్రంథములలో మొదటివి. ఇందు అగ్నివేశతంత్రము మిక్కిలి ప్రధానమైనది. "బుద్ధే ర్విశేష స్తత్రాసీత్ - అగ్ని వేశ: అని చరకమునందు వర్ణితమై యున్నది. మిగిలిన తంత్రములు చాలవరకు లుప్తప్రాయములే. వాగ్భటుని కాలమునకే వీటికి పఠన పాఠనములు లేవని 'భేడాద్యా కిం న : పఠ్యస్తే' ఆనుః వాక్యముచే తెలియుచున్నది