పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/808

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆఫ్రికా


అట్లాసు పర్వతములు ఉత్తరాఫ్రికాలో ముఖ్యమయిన పర్వతపంక్తులు. ఉత్తరమునుండి దక్షిణముగా నీ పర్వతశ్రేణులకు టెల్ అట్లాసు, గ్రేట్ అట్లాసు, సహారన్ అట్లాసు అను పేర్లు కలవు. అట్లాంటిక్ తీరమునుండి నైలునదివరకు పల్లపు పీఠభూమి వ్యాపించియున్నది. దీని మధ్యభాగమున టిబెస్టి పర్వత పంక్తులు కలవు,

ఉన్నత పీఠభూమి పూర్తిగా దక్షిణ ఆఫ్రికాలోనే కలదు. పడమరనుండి తూర్పునకు దీని ఎత్తు క్రమముగా నెక్కు వగును. హై వెల్దు, లోవెల్డు అను రెండు మెట్లుగా. ఈ పీఠభూమి తూర్పు అంచు తీరపు మైదానమునకు దిగుచున్నది. వీనినే కేవ్ కాలనీలో గ్రేట్ కారూ, లిటిల్ కారూ అని పిలిచెదరు. ఈ పీఠభూమియొక్క ఎత్తైన అంచులనే నేటాలు రాష్ట్రములో డ్రాకెన్సు బర్గు అని అందురు.

ముఖ్యమయిన పర్వత శిఖరములన్నియు ఆఫ్రికా తూర్పుననే యున్నవి.——మనెన్ జోలి (16,800 అ.); కెన్యా (17.040 అ.); నిరంతరము మంచుతోనుండు కిలిమంజారో (19,321 అ.). సముద్రతీరమున మాత్రమే పల్లపు మైదానము లున్నవి.

ఎడారులు  :- ఉత్తర ఆఫ్రికాలో 35,00,000 చ.మై వ్యాపించిన సహారా ఎడారి కలదు. ఇది అమెరికా సంయుక్త రాష్ట్రములకన్నను కొద్దిగా పెద్దది. తూర్పు పడమరలుగా దీని పొడవు 3,200 మై. ఉత్తర దక్షిణములుగా దీని వెడల్పు 800 మై. నుండి 1,400 మై. వరకు కలదు. సామాన్యముగా మనము భావించునట్లు సహారా ఎడారి యంతయు పనికి రాని ఇనుకబీడు కాదు. పశ్చిమ సహారా యొక్క మధ్యభాగములో 6,000 అడుగుల ఎత్తుగల శిఖరములతో నిండిన ఆయిర్, హాగర్' పర్వతములు గలవు. టిబెస్టి పర్వతపంక్తిలో 9,000 అ, ఎత్తు. గల ఉడిగిన అగ్ని పర్వతములు కలవు. మరియు బిల్నా వంటి సహజ సరస్సులు ఈ ఎడారిలో కలవు. ఈ సరస్సుల చుట్టును వృక్షజాలమును, జంతు జాలమును కాననగును. ఫలవృక్షములు పెంచబడును. బావుల నుండి నీటిని పారించి వ్యవసాయముకూడ చేయుదురు.

ఆఫ్రికా నైరుతి భాగముననున్న కల్ హరి ఎడారి సహారా అంత పెద్దదికాకపోయినను పేర్కొనతగినది.

సరస్సులు  :- తూర్పుననున్న పర్వత శ్రేణులయందలి చీలికలోయ (Rift valley) అని పిలువబడు పల్లపు ప్రాంతమున గొప్ప సరస్సులు ఉత్తర దక్షిణములుగా వ్యాపించియున్నవి. ఈ క్రింద పేర్కొనబడినవి ముఖ్యమైన సరస్సులు.

(క) విక్టోరియా న్యాంజా: వైశాల్యము 26,000 చ. మై, పొడవు 250 మై.,వెడల్పు 200 మై. లోతు 270 అ,

(ఖ) టాంగనీకా సరస్సు: వైశాల్యము 12,700 చ. మై., పొడవు 450 మై.. వెడల్పు 40 మై., లోతు 4,708 అ.

(గ) న్యాసా సరస్సు : వైశాల్యము 11,000 చ.మై. పొడవు 350 మై., వెడల్పు 45 మై.,

(ఘ) కిపూ సరస్సు: వైశాల్యము ---చ. మై.. పొడవు 50 మై., వెడల్పు 30 మై..

(చ) టానా సరస్సు : ఇది 5,690 అ. ఎత్తున అబిసీనియా పీఠభూమి యొక్క ఉత్తరభాగమునకలదు. నైలునదికి ఈ సరస్సు మూలజలములుగా నుపయోగపడుచున్నది.

(ఛ) రుడాల్ఫు సరస్సు : వైశాల్యము 3, 475చ. మై, పొడవు 185 మై. వెడల్పు 37 మై.

(జ) షాడ్, బంగ్ వలూ సరస్సులు : ఇవి మధ్య ఆఫ్రికా యొక్క ఈశాన్య నైరుతి భాగములయందు గలవు. వీటి నీరు ఋతువుల ననుసరించి సంకోచ వ్యాకోచములను చెందుచుండును.

నదులు  : ఆఫ్రికా ఖండమునందలి నదులు పెద్దవై నను జలపాతములవలనను అచ్చటి ప్రజల అనాగరికత వలనను అంతగా నుపయోగము లేనివిగానున్నవి. ఈ నదులవలన కొన్ని ప్రాంతములకు వాహన సౌకర్యములు కలుగు చున్నవి. నైలునదికి నాలుగు పెద్ద జలపాతములుకలవు, నైగరునదికి వేగముగల బూసా ఝరులు, కాంగో జాంబెసీ నదులకు ఎల్లాలా, విక్టోరియా జలపాతములు కలవు. వీనిలో కొన్ని 420. అ. ఎత్తుకూడ కలిగి యున్నవి. ముఖ్యమైనవి 5 నదులు :

1. నైలునది : (4,000 మైళ్ళు): ఇది ఉత్తరముగా ప్రవహించి, మధ్యధరాసముద్రములో కలియుచున్నది.