పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/805

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆఫ్ఘనిస్థానము

కొనిరి. రెండవ ఆఫ్ఘను యుద్ధములో బ్రిటిషు సైన్యములు 3 వైపులనుండి ఆఫ్ ఘను రాజ్యమున ప్రవేశించెను. కాందహారు యుద్ధ ఫలితముగ క్రీ. శ. 1880 నుండి 30 సం॥ లు ఆఫ్ ఘన్ రాజు బ్రిటిషు మిత్రుడుగ నుండెను. మూడవ ఆఫ్ ఘన్ యుద్ధములో ఆఫ్ ఘనులు ఇండియాపై దండెత్తి యోటమి చెందిరి. 1919 లో హబిబుల్లా హత్యచేయబడెను. అమానుల్లా రాజయ్యెను. సంధి ఫలితముగ ఆఫ్ ఘనిస్థానము స్వతంత్ర రాజ్య మయ్యెను.

అబ్దుర్ రహమాను రోడ్లు వేయించెను. రాజ్యాంగమున సంస్కరణలు తెచ్చెను. అమానుల్లా ఐరోపాలో పర్యటనము చేసివచ్చి దేశములో మార్పులు చేసెను. క్రీ. శ. 1928 లో శాసనసభలు అమలులోనికి వచ్చెను.

వి. య.

ఆఫ్ఘనిస్థానము :- (భూగోళము) :- ఆఫ్ఘనిస్థానము ఆసియాఖండపు దేశాలలో ఒకటి. దీనికి దౌలత్ ఇ-పాద్ షాహీ-యే ఆఫ్ఘనిస్థానము అని పూర్తి పేరు. ఇది 29°-38° 35' ఉత్తర అక్షాంశముల మధ్యను 60°, 50 - 71° 50 తూర్పు రేఖాంశముల మధ్యను ఇమిడియున్నది. దీని వైశాల్యము 2 లక్షల 50 వేల చదరపు మైళ్ళు ఉండును. జనాభా ఒకకోటి ఇరువదిలక్షలు సుమారుగా ఉండును. అందులో ఇరువది లక్షలమంది స్థిరనివాసము లేని చరజాతు లున్నవి. పరిషియన్, పుష్టూ భాషలు మాట్లాడుదురు.

పరిపాలనము  :- 1914 లో జన్మించిన మహమ్మద్ జహీర్ షా ఈ రాజ్యమునకు రాజు. ఒక ఉన్నత సభ (Senate) 50 మంది సభ్యులతో కూడి ఉన్నది. ఇదిగాక, 171 మంది సభ్యులుగల జాతీయ సభ (National Assembly) పరిపాలనాధికారము కలిగియున్నది. మే నెలలొను అక్టోబరులోను సమావేశములు అగుచుండును. ఇదిగాక "లోయేజిర్గా" (Loe jirga) అను మహాసభ ఇంకొకటి అప్పుడప్పుడు సమావేశము అగుచుండును. రోజు ఏదైన అతి ప్రాముఖ్యము గల సమస్యను తీర్మానించు నిమిత్తమే దీనిని సమావేశ పరచుచుండును. దీనిలో ఆజాతికి సంబంధించిన పెక్కుమంది నాయకులు సమావేశమునొందుదురు. గడచిన సమా వేశము 1941 లో జరిగినది. ఇటీవల పాకిస్థానముతో ఏర్పడిన సమస్యల మూలముగా ఇప్పుడు మళ్ళీ సమా వేశపరచబడినది. దేశము ఏడు ముఖ్యమైన రాష్ట్రాలుగా విభజింపబడి ఉన్నది. కాబూలు, మజార్, కాందహారు, హీరాట్, కటఘన్, సంత్- ఇ-మష్రికీ, సంత్-ఇ-జునూబి అనునవి పెద్ద రాష్ట్రాలు. బదక్ షాన్, ఫరా, మైమనా, పర్వాన్ అనునవి నాల్గు చిన్న రాష్ట్రాలు. పెద్ద రాష్ట్రాలు నయీరో-ఉల్-హుకు మేఅను పరిపాలకుని చేత ను చిన్న రాష్ట్రాలు హా కేం-ఇ- ఆలా అను పరిపాలకునిచేతను, పాలింపబడుచున్నవి. కొన్ని శాఖలు మంత్రులక్రిందను, కొన్ని అధ్యక్షులక్రిందను ఉండి, వీరిరువురితో కూడిన మంత్రి వర్గము చేతులలో అధికారము కేంద్రీకృతమయి ఉన్నది. కొద్దిమంది పీయాశాఖీయులున్నను అధిక సంఖ్యాకులు సున్నీ శాఖకు చెందిన మహమ్మదీయ మతము ప్రధానముగా గలవారే. కాబట్టి న్యాయశాస్త్రము షరియత్ మీద ఆధారము చేసికొని అభివృద్ధి చెందినది. జిల్లా న్యాయ స్థానాలను మహకమా-ఇ-ఇబ్ తిదాయియాలు అనియు, రాష్ట్ర రాజధాను లలో ఉండువాటిని మహకమా-ఇ-మురాఫాలు అనియు అందురు. మహకమా-ఇ-అలీ తమిజ్ అను న్యాయ స్థానము హైకోర్టువంటిది. ఇది పరిపాలన న్యాయశాఖకు అనుబంధించి ఉండును. ఉన్నత సభకు అనుబంధముగా రారియ్యాసత్-ఇ-తమీజ్-ఇ-అయన్ అను సుప్రీంకోర్టుకూడనున్నది. ఆదాయపుపన్ను, భూమిపన్ను, వ్యాపార సుంకాలు దేశము యొక్క ఆదాయమును 18 కోట్ల 80 లక్షల ఆఫ్ఘనీ నాణెములవరకు పెంచినను, ప్రభుత్వాదాయము చాలుటలేదు. సామాన్యమైన సేనా వాహిని 75000, కలదు. తడవకు 2,000 మంది విద్యార్థులను తయారుచేయు మిలిటరీ శిక్షణాలయము ఒకటి పని చేయుచున్నది. కాబూలు పట్టణము దేశమునకంతకును రాజధాని, ఖ్వాజా రావావ్, షెర్ పూరు విమానాశ్రయాలను పురస్కరించుకొని కొద్ది విమానదళమున్నది. బ్రిటిషువారితో పూర్వము సరిహద్దులను గురించిన సంధులు (Treaties) పెక్కులున్నవి. 1946లో సోవియట్ రష్యాతో ఒక సరిహద్దు నిర్ణయము జరిగినది.

'ఆర్థిక పరిస్థితులూ :- దేశము యావత్తు పర్వత మయము. వర్షరహితమైనది. అయినప్పటికిని చిన్న చిన్న జలా ధారాల మూలమున వ్యవసాయము సాగుచునేయున్నది.