పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/803

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆపస్తంబుడు


ఉపయోగించును. సింగాభట్టీయము, ఆండపిళ్ల, అనాకుల, తాత్పర్యదీపిక అనునవి ఆపస్తంబ గృహ్యసూత్రముల పై వెలసిన వ్యాఖ్యానములు. సింగాభట్టు, అణిపిళ్ల హరదత్తుడు, సుదర్శనాచార్యుడు అనువారు క్రమముగా పైని పేర్కొనబడిన వ్యాఖ్యలను వ్రాసినవారు. ఆంధ్రదేశమున తైత్తిరీయులు తరచుగా అవస్తంబ సూత్రానుసారులుగా నున్నారు.

ధర్మ సూత్రములలో ఆవ స్తంబ ధర్మసూత్రము కృష్ణ యజుశ్శాఖీయులకు ముఖ్యమైనది. "అధాతస్సామయా చారికాన్ ధర్మాన్ వ్యాఖ్యాస్యామః" (ఆ. ధ. 1) అను నీ ప్రథమ సూత్రము ధర్మశాస్త్ర స్థానమున బ్రహ్మ యజ్ఞాదులందు ఉపయోగింపబడుటచేత ఈ గ్రంథము పరమధర్మ శాస్త్రమని తేటబడుచున్నది. ఆపస్తంబ ధర్మ సూత్రములలో పెక్కు ముఖ్య విషయములు కలవు. ఉపనయన కాలమున వటువు పాదోవ సంగ్రహణము, గురుసన్నిధియందు అధ్యయనము, భిక్షాచరణము, మున్నగు ధర్మములను సక్రమముగా ఆచరించినచో, నాతని కర్మలు సఫలము లగును. లేనిచో ఆతని సంతానము బ్రహ్మవర్చసవిహీనమగును. ఆతని సంతతిలో ఋషులు పుట్టరు. పుట్టినను శ్వేత కేతువువలె పూర్వకర్మ భోగార్థమై కొలది మంది జనన మొందుదురు. కావున బ్రహ్మచర్య మవశ్యాచరణీయము అని చెప్పబడినది. విక్రయాన్నము తినకుండుట; రసద్రవ్యములు, పచ్చిమాంసము, మధు- లవణేక్షురసములు, పృథుక- భ్రష్టయవ - సక్తు - శాక మాంస - పిష్ట - క్షీర వికారములు, ఓషధి - వనస్పతి - మూలఫలములు మున్నగు వాటిని తినుటయు: ఆపత్కాలమున అగ్నిసువర్ణములచే స్పృశించి కృతాన్నమును గ్రహించుటయు గృహస్థధర్మములుగా పరిగణింపబడినవి. ఆర్య పోషితులయిన శూద్రులు స్నానాదులచే శుద్ధులయి త్య్రైవర్ణికులగు గృహస్థులు అతిథులు మున్నగు వారి కొరకు పొకము చేయవచ్చును. శూద్రుడు నిత్యము క్షారము చేయించుకొని సచేల స్నానమొర్చినకొని పర్వ కాలమునందును, అష్టమి నాడును క్షౌరము చేయించుకొని గాని, పరోక్షముగా వండి తెచ్చిన అన్నమును అగ్నిలో నుంచి, నీళ్ళతో ప్రోక్షించినచో అది దేవతార్పణమునకు అర్హమగునని చెప్పబడినది. అతిథికి గోమధుపర్క: మిచ్చి

నచో ఫలాధిక్యము చేకూరు నను విషయమున బ్రాహ్మణము ప్రమాణమగు చున్నదని ఆపస్తంబుడు వచించెను. అవిధిగా సన్యసించినవారు అభోజ్యాన్నులలో పరిగణింపబడిరి. వ్రాత్యశబ్దము అమరకోశమునందును (వ్రాత్య స్సంస్కారహీనః స్యాత్) 'వ్రాతేన జీవతి' అను పాణీనీయ సూత్రమునందును నిందితపరముగా వ్యాఖ్యాతమైనది. ఆపస్తంబుడు దీనిని పూజ్యపరముగా ప్రయోగించెను. ఇయ్యాశయమునే సమర్ధించుచు ప్రతేఘసాధు ప్రత్యః; స ఏవవ్రాత్యః అను వ్యుత్పత్తిని వ్యాఖ్యాతలు ప్రదర్శించిరి. దంపతుల నియమములను వివరించుచు భార్యాభర్తలు స్వీయ నియమాతిక్రమము చేసి రేని శిక్షార్హులగుదు రని ఆపస్తంబుడు చెప్పెను. అతడు నియోగ పద్ధతిని నిషేధించెను. రాజు. తపో విద్యావంతులగ బ్రాహ్మణులకు తన దేశములో జీవన క్షేత్రము లొన వారిని పోషింపవలయు నని చెప్పబడినది. ఇతర సూత్ర కర్తలు అష్టవిధ వివాహములను చెప్పిరి. ఆపస్తంబుడు ఆరింటినే పేర్కొనెను. ఏకాగ్ని కాండము నందలి కొన్ని మంత్రార్థములచే యువతీ వివాహము ప్రతిపాదిత మగు చున్నను, హరదత్త ప్రభృతి వ్యాఖ్యాతలు అవ్విషయము నంగీకరించి యుండలేదు.

రాజధర్మములలో, రాజు దేశారాధన తత్పరుడగుచు రాష్ట్రమందలి ప్రజలలో ఏరికిని శీతవాతాతపవ్యాధు వలన క్లేశము కలుగకుండ చేయవలయు ననియు; బాల -వృద్ధ - కర్మకార - అంగవికల - శ్రోత్రియులనుండి పన్నులు గ్రహింపకూడ దనియు, నగర గ్రామ రక్షకులుగా కాయస్థులను (కరణాలను) నియమింపవలయుననియ నగర గ్రామములలో దొంగలు అపహరించిన డబ్బును నష్టపడిన యజమానులకు నగర రక్షకు డొసగవలయు ననియు చెప్పబడినది. ఈ ధర్మములు అనుష్ఠించుట కష్ట సాధ్యము. ఐనను అవి శ్రద్ధతో ననుష్ఠించిన వారికి ఆయురారోగ్యములను, చిత్తశుద్ధిని ప్రసాదింప సమర్థములు. హార దత్తస్వామి 'ఉజ్జ్వల' అను సమగ్ర వ్యాఖ్యను ఆపస్తంబ ధర్మసూత్రములపై రచించెను. ఈ ధర్మసూత్రములలొ కొన్ని వేదాంత ప్రతిపాదకములును కలవు. వాటినే శ్రీ శంకర భగవత్పాదులు వ్యాఖ్య వ్రాసిరి.

ఖం.స