పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/790

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆనకట్టలు : నిక్షేప జలాశయ నిర్మాణము


మందు నిలుపబడు నీటిలోతు ఏబది అడుగులకన్న ఎక్కువగా నున్నప్పుడు రాయి, గచ్చుతో కట్టను కట్టవలసి యుండును. అందుచేత, నీటిలోతు ఎక్కువగా ఉండవలసి నప్పుడు రాతి, గచ్చుతోనే కట్టలుకట్టుట ఉచితము. ఇట్టి కట్టలు 200 అడుగుల లోతుగల నీటిని ఆపుటకుగూడ ఉపయోగపడును.

గాతికట్టలను కట్టుటకు కావలసిన ముఖ్యపదార్థము గచ్చు. దీనిని తయారు చేయుటకు సున్నము, ఇటుకపొడి, ఇసుక, సమపాళ్ళలో కలిపి గానుగలో త్రిప్పించవలెను. దీనిని 'సుర్కి' అనిగూడ అందురు. సురితో నే గాకుండ సిమెంటు, ఇనుక 1:8 మొదలు 1:4 నిష్ప త్తిలో కలిపి గూడ గచ్చు తయారు చేయవచ్చును.

రాతికట్టడమునకు ముఖ్యమైన పరికరములు కఠినమైన రాళ్ళు: అగ్ని శిలలు (Granite), మెట్టురాళ్ళు (Trap), ఇసుకరాయి మొదలగునవి. రాతి కట్టడము యొక్క స్వరూపము ఈక్రింది పటములో చూపబడినది .

కట్టడము యొక్క నీటిపార్శ్వము నిట్టనిలువుగాను,లేక కొంచెము వాలుగాను ఉండును. వెనుక తట్టు యొక్క వాలు 2:3 నిష్పత్తిలో ఉండును. ఇవి నిర్ణయమైన తరువాత కట్ట యొక్క అడుగుభాగపు వెడల్పు ,కనుగొనవలసియుండును. నీటివలన కలుగు ఒత్తిడి, కట్ట యొక్క బరువు దృష్టియందుంచుకొని వెడల్పును నిర్ణయింపవలెను.

రాతికట్ట నిర్మించుటకు గట్టి పునాది అవసరము. దీని కొరకై భూగర్భములో కఠినమైనరాయి దొరకువరకును పునాది త్రవ్వవలసియుండును. గట్టి చదరపురాయి కనబడిన తరువాత దానిని గరుకుగా ఉండునట్లు చేయవలెను. ఇట్లు చేసిన రాతిమీద గచ్చు గట్టిగా పట్టుకోనును . 3 అంగుళముల మందముగల గచ్చును, పునాది రాతిపై పరచి దానిపైన పెద్ద పెద్ద రాళ్ళను తెచ్చి పేర్చవలెను. రాళ్ళమధ్య చిన్న చిన్న రాతిచెక్కలను నింపి, మధ్య నున్న సందులందు గచ్చు కూరవలెను. ఒకవరుస కట్టిన తరువాత గచ్చు గట్టిపడునంతవరకు పనిని ఆపి తిరిగి రెండవ వరుసలో రాళ్లు నింప వలెను. ఈవిధముగా కట్టను పైదాక తీసికొని రావలెను.

5. సిమెంటు కట్టలు  :- రాతికట్టలు 200 అడుగుల ఎత్తువరకే కట్టవచ్చును. ఇంతకన్న ఎత్తైన కట్టడములకు సిమెంటు, కాంక్రీటు అనుకూలముగా నుండును.

సిమెంటు, కాంక్రీటువలన కట్టడములకు ఎంత బలము కావలెనో అంతబలము కలిగించవచ్చును. సిమెంటు కాంక్రీటు తయారుచేయుటకు తగిన యంత్రములున్నవి. సిమెంటు కాంక్రీటు పనికి శాస్త్రీయ పద్ధతులున్నవి. పరిశోధ నాలయములో నిర్ణయించిన బలము సిమెంటు కాంక్రీటు కట్టడములో నమ్మకముగా కలిగించవచ్చును. కాని రాతి కట్టడములో నున్న బలము నిర్ధారణగా చెప్పుటకు సాధ్యముకాదు. ఈ కారణమువలన చాల ఎత్తైన కట్టడములు కట్టవలసి వచ్చినపుడు సిమెంటు, కాంక్రీటు వాడుటయే మంచిది. సిమెంటు కాంక్రీటు తయారుచేయుటకు వివిధ రకముల యంత్రము లుండుటవలన రాతి కట్టడముకన్న సిమెంటు కాంక్రీటు కట్టడమునకు చాల తక్కువ కాలము పట్టును.

సిమెంటు కాంక్రీటు తయారు చేయుటకు ఈ క్రింది పదార్థములు అవసరము. (1) సిమెంటు, (2) రాతి కంకర, (3) ఇసుక. పై పదార్థములు ఏ నిష్పత్తిలో కలిపి కట్టడములో వాడుదుమో దానినిబట్టి సిమెంటు కాంక్రీటు యొక్క బలము ఆధారపడి యుండును. వివిధ నిష్పత్తులలో తయారైన కాంక్రీటు యొక్క బలము ఈ క్రింది విధముగా ఉండును:-