పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/789

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆనకట్టలు : నిక్షేప జలాశయ నిర్మాణము


సంపూర్ణముగా లేవు. అందుచేత వీటిని సమభాగములుగా కలిపి కట్టిన, కట్ట మిక్కిలి పటిష్ఠముగా నుండును. కట్ట యొక్క మధ్యభాగములో నల్లమన్నును, కట్టకు అటు, ఇటు గరపమన్నును వేసికూడ బలమైన కట్టడము నిర్మింప వచ్చును. మన్ను షుమారు ఒక్కొక్క అడుగుమందము పరచి పశువులతో త్రొక్కించియైనను, లేదా యంత్రముతో నడిచేడు రోలర్లతోనైనను, గట్టి పరచుచు, కట్టను పెంచుచు పోవలెను.

కట్ట నిర్మాణమునకు అవసరమైన మట్టిని సేకరించిన పిదవ కట్ట ఎంత ఎత్తు ఉండవలెను, దాని వెడల్పు ఎంత యుండవలెను అను అంశములు నిర్ణయించవలసి యున్నది. కట్ట సాధారణముగా ఒక లోయ యొక్క ఒక పార్శ్వము నుండి మరియొక పార్శ్వమునకు ఆవరించి యుండవలెను. సేద్యము కాగల భూమి విస్తీర్ణత యొక్క అంచనా ప్రకారము కట్టయొక్క ఎత్తు నిర్ణయించబడును. ఎత్తు నిర్ణయమైన తరువాత కట్ట పై భాగము యొక్క వెడల్పు ఈ క్రింది పథకము ప్రకారము నిర్ణయమగును.

1 అ - 10 అ. ఎత్తువరకు కట్టపై వెడల్పు 6 అడుగులు
10 అ - 25 అ. ఎత్తువరకు కట్టపై వెడల్పు 8 అడుగులు
25 అ - 50 అ. ఎత్తువరకు కట్టపై వెడల్పు 15 అడుగులు
50 అ పైన ఎత్తువరకు కట్టపై వెడల్పు 20 అడుగులు

కట్టకు ఒక పార్శ్వమందు నీరు నిల్చి యుండును. దానిని నీటిపార్శ్వము అని అందురు. నీటి పార్శ్వమందు ఏట వాలు 1½ : 1 ఉండవలెను. ఈ పార్శ్వముపై రాతిని బిగించిన యెడల కట్టగుండ ఏ విధమైన నీటిజాలు కలుగ కుండ అరికట్టుటకు సాధ్యమగును. కట్ట యొక్క వెనుక భాగము 2:1 ఏటవాలుతో నిర్మించవలెను. సాధారణముగ మట్టికట్టల యొక్క పథకము ప్రక్క చూపబడి నట్లుండును.

వర్షాకాలములో ఒక్కసారి వర్షము ఎక్కువగా కురియుటచే చెరువులు నిండి వాటి కట్టలమీది నుండి నీరు పొర్లిపోవును. నీటి ప్రవాహమువలన కట్టలమన్ను కొట్టు కొనిపోయి కట్టలు తెగిపోవును. కావున నీటి ప్రవాహము కట్టల పై నుండి పొర్లిపోకుండ చేయుట అవసరము. దీని కొరకు మత్తడి కట్టవలసియుండును. మట్టికట్ట యొక్క మధ్య భాగమందుగాని, ఇరుపార్శ్వములందు గాని యీ మత్తడి రాతితో కట్టబడును. ఇదికూడ కట్టయందు ఒక భాగమే. కాని మట్టికట్టకున్న సుమారు 5, 6 అడుగుల ఎత్తు తక్కువ యుండును. అందుచేత నీటి ప్రవాహము అధికమైనప్పుడు ఎక్కువైన నీరు మత్తడి భాగముగుండ ప్రవహించి పోవుటచే మట్టికట్టకు ప్రమాదము కలుగదు.

మట్టికట్టను నిర్మించునప్పుడు ఎంత గట్టిగా త్రొక్కించినను మట్టి రేణువుల మధ్యనున్న సూక్ష్మరంధ్రముల ద్వారా తటాకమందలి నీరు కట్టగుండ జారుచుండును. నీటిజాలు గుండ మట్టి రేణువులు గూడ కొట్టుకొనివచ్చును. మట్టి రేణువులు కట్టలో నుండిపోవుటచే కట్టక్రమేణ బలహీన మగును. దీనిని నివారించుటకు వడకట్టు కాలువలు నిర్మించ వలసి యుండును. కట్టపొడుగున నేలమట్టముపై, ఒక గజము వెడల్పు, ఒక గజములోతు కాలువను త్రవ్వి ఇసుక, కంకర, మరియు పెద్ద పెద్ద రాళ్ళతో ఈ కాలువను నింపవలెను. కట్టలనుండి వచ్చు నీటిజాలు ఈ కాలువలోనికి చేరి చిన్న అడ్డ కాలువ ద్వారా బయటికి పంపివేయబడును. ఈ అడ్డ కాలువలో గూడ ఇసుక, కంకర, పెద్ద రాళ్ళను నింపవలెను,

4. రాతికట్టలు  : రాయి, గచ్చుతో కట్టబడిన కట్టలు మట్టికట్టలకంటే ఎక్కువ బలముగా నుండును. జలాశయ