పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/774

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆధునిక వాస్తువాదములు


Purism - నిష్కళంకతావాదము (విశుద్ధతావాదము ) : ఇది క్యూబిజమునకు మిక్కిలి సన్నిహితమైనది. దీనిని లి - కార్ బిజీయరును, ఓజెన్ ఫాంటు అను చిత్రకారుడును ప్రవేశ పెట్టిరి. రేఖాగణితపు రూపములును, సహజ రూపములును గూడ సౌందర్య స్థానములేయనియు సమకోణ చతురస్రము, గ్రుడ్డు, వక్రరేఖ మొదలగు ఆకృతులన్నియు సుందరము లేయనియు ఈ వాదసారము. వాస్తువున ఈ వాదమును ప్రవేశపెట్టినవాడు లి-కార్ బిజీయర్ అనునాతడు.

Constructivism - నిర్మాణత్వవాదము  : భిన్న భిన్న కాలములందీ వాదమునకు భిన్న భిన్నార్థములు కల్పింప బడినవి. కాసిమిర్ మాలెవిచ్ (Kasimir Malewitch) అను రష్యా చిత్రకారుడు 1913 ప్రాంతమున దీనిని ప్రారంభించెను. ఈతడు సహజ వస్తువులన్నిటిని త్రోసి పుచ్చి, వంగ్యాత్మకములును, భావములను తెలియ జేయునవియు నగు కొన్ని చిహ్నములను గ్రహించెను. ఇతడు విభిన్న వస్తువులకును, వాటి అన్యోన్య సంక్రమిత దశలకును గల సంబంధమును గుర్తించుటకు యత్నించెను. యుద్ధానంతరము రష్యాలో ప్రచారమైన వాస్తు - ఉద్యమ మంతయు నిర్మాణత్వ వాదము పేర బరగుచున్నది. ఈ నిర్మాణములన్నియు భవనము యొక్క అంతరార్థమును కాల్పనిక స్థాపత్యరీతులలో ధ్వనింప చేయుటకు పూనుకొనును. ఈ ఉద్యమము ఐరోపాఖండమున అంతగా ఆమోదమును బడయలేదు. బ్రిటిషు చిత్రకారుడు గేబో దీనిని గ్రహించినను వాస్తువున నిది ప్రత్యేక కృతులను ప్రసాదించలేదు.

Futurism - భవిష్యతావాదము : ఇటలీ దేశీయుడైన ఆంటోనియో సాంగ్ యీలియా అనునతడు (Antonio Sant Elia) 1914 సం॥ లో చేసిన ప్రకటన పత్రిక (Manifesto) తో భవిష్యతావాద మారంభమైనది. కాని త్వరలోనే ఇది ఆచరణము నుండి యంతరించినది. బోక్సి యోని యొక్క శిల్పఖండములు ఈ త త్త్వమునకు నిదర్శనములని చెప్పవచ్చును. వాస్తువునందు ఈతత్త్వము ప్రయోజనతా వాదమును స్థిరపరచినది. ఇదిగాక సమ్యత్వము (Elasticity), తేలికదనము, గమనశీలము (Mobility), నిరంతర పరివర్తనము అను గుణములను గూడ ఈ వాదము సమర్థించినది. సాంత్ ఈలియా యొక్క చోద్యమైన ఊహలేకాని అతడు తన ఊహలకు ఎట్టి రూపమును నొసగజాల డయ్యెను. ఈ ఉద్యమము భవన బాహ్య స్వరూపముతో సంబంధించినది మాత్రముగానేఉండెను. బాహ్య ప్రదేశముననుండి పైకిని, క్రిందకును కదలుచుండు లిఫ్టులును విభిన్న తలములలో మోటార్లు పయనించుటకు వీలగు విశాలమైన వీథులును-భూగర్భమున ప్రయాణముచేయు రైలుబండ్లును ఈ వాదము వారి ప్రధాన విషయములు.

ఆధునిక వాస్తువునకు, ప్రయోజనాత్మకము, వాస్తవికము, అంతర్జాతీయము, అను విశేషణము లుపయోగింపబడుచున్నవి. అంతర్జాతీయమని అమెరికాలో ప్రచార మధికము. ప్రయోజనాత్మకము, వాస్తవికము అను విశేషణముల ముఖ్యసూత్రము లివి. నగరములకు భవనములకు ఏర్పరచిన ఆకృతులకును వాటి నిత్యోపయోగ సూత్రములకును, టెక్నికల్ అవకాశములకును వాస్తుశాస్త్రము విరుద్ధముగా ఉండరాదని వీరి యుద్దేశము. ఆకృతి రచనలు మానవుల నిత్య ప్రయోజనము లకు సంబద్ధములై యుండవలెను. జనుల రాక పోకల అవసరములనుగూడ దృష్టిలో నుంచుకొనవలెను. ఒక దృష్టితో పరికించిన ఆధునిక వాస్తువు ప్రయోజనాత్మక మైనమాట నిజమేకాని, ప్రయోజనాత్మకతయే వాస్తువునకు మూలసూత్రము కారాదు. ఆధునిక వాస్తువు అంతర్జాతీయమని చెప్ప వీలు లేదు. ఇది దీని ప్రాథమికావస్థలో అంతర్జా తీయముగా నుండెను. దీనికి కారణములు : అభిరుచుల పునరుద్ధరణము సాంకేతికముగా క్రొత్తరీతుల కనుగొనుట, మార్పులు, సామాజిక సమస్యలపై నాసక్తి, నిర్మాణ ద్రవ్యములు- ఇవన్నియు అంతర్జాతీయములు. ఇవి యాధునిక వాస్తువునకు అంతర్జాతీయత్వమును సమకూర్చినవి. నిపుణమైన వాస్తువు ఒకేకాలమునందు వివిధ ధర్మములను కలిగియుండునని ఇప్పుడు విజ్ఞులందరును అంగీకరించుచున్నారు. అది అంతర్జాతీయము, జాతీయము, ప్రాంతీయము, వైయక్తికముకూడ ఏకకాలమునందు కావచ్చును.

1923-33 వరకుగల దశాబ్దమున ఐరోపాలో ఆధునిక వాస్తువును ప్రోత్సహించిన కేంద్రములు రెండుగలవు.