పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/773

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆధునిక వాస్తువాదములు


సూచించు రెండు చక్కని నిదర్శనములు. ఆధునిక వాస్తువునకు గురుప్రాయులైన యీ యిద్దరు శాస్త్రజ్ఞులును యుద్ధా నంతర కాలమున క్యూబిజము సిద్ధాంతములను వాస్తువున ప్రవేశ పెట్టుటకు ప్రోత్సహించిరి. బావుహాస్ లోని ప్రయోగశాలా భవనపు గోడలు బ్రహ్మాండ మైన గాజు పలకలతో నిర్మింపబడినవి. దీనివలన కలిగిన పారదర్శకత బాహ్యాంతరములకున్న భేదమును తొలగించినది. ఒక దానిమీద నొకటిగా పేర్చబడిన అంతస్తులన్నియు ఏక కాలమునందే దృష్టికి అనును. గాజుతో నిర్మింపబడిన మూలలు భవన బాహ్యము యొక్క నిరంతర క్రమమును దృష్టికి విచ్ఛేదన మొనర్చుటకు తోడ్పడుచున్నవి. ఇది యొక పెద్ద ద్రవ్యరాశి యను భావమే కలుగదు. భవనాంతర నిర్మాణము లన్నియు బాహ్య ప్రదేశము నుండి కాన్పించును. స్థలా కాశములో వ్రేలాడునట్లు భ్రమకొల్పు వివిధ సమతలము లే ఈ భవన నిర్మాణము నందలి మూలాంగములు. సేవాయ్ ప్రాసాదమునందుకూడ అదే పారదర్శకతయు, బాహ్యాభ్యంతరావకాశముల అన్యోన్య సంక్రమణమును చూడనగును. ఇది పారదర్శకతవలన మాత్రమేకాక, భవనము యొక్క బాహ్యప్రదేశమును లోపలి భాగమునందలి ఘనావరణము (Cube) లోనికి గొనివచ్చుటవలన సాధింపబడినది. ఇష్టము వచ్చినట్లు అమర్చుటకు వీలుగానున్న గాజు గోడలు బాహ్యాంతర్భేదమును తొలగించినవి. ఈ కట్టడము అన్ని వైపులను అభిన్నముగా నుండుట కూడ దీని క్యూబిస్టు తత్త్వమున కొక నిదర్శనము. ఇది స్తంభములపై ఏకాంతముగ నుండుట చేతను, మొదటి అంతస్తును దాదాపు పూర్తిగా కాశీగా వదలుటచేతను కట్టడపు ఘనపరిమాణదృష్టియే యదృశ్యమగుచున్నది.

నియోప్లాస్టిసిజం  : ఇది బంకమన్ను, మైనము మొదలగు మృదు పదార్థములతో ఆకృతులను కల్పించు శిల్ప ములో నూతనరీతి, ఇదియు, ఇకముందు పేర్కొనబడు వాదములలో ఎక్స్ ప్రెషనిజము అనునదియు తప్ప, తక్కిన వన్నియును క్యూబిజమునుండి బయలు దేరినవియే. క్యూబిజమును వాస్తవికముగా మార్చుటయను ఈ వాదమును మోండ్రియం (Mondriam) అను చిత్రకారుడు స్థాపించెను. చిత్రము యొక్క సమతలముమీద దీర్ఘచతురస్రములును, సమచతురస్రములును మృదుగతితో నుండు సంబంధముపైననే చిత్రనిర్మాణమంతయు ఆధారపడి యుండునని ఈతనివాదము, మరియు మూలవర్ణములైన నీలి, ఎరుపు, పచ్చ - రంగుల సమసమ్మేళనము, వానికి నలుపుతోను, తెలుపు యొక్క వివిధ చ్ఛాయలతోను ఉండదగిన సంబంధము అతి ప్రాముఖ్యము నొందునని ఈతని భావము. రంగుల సమప్రదేశములు, రేఖాగణిత శాస్త్రానుసారముగా నున్న ఆకృతులు ఒండొంటి సరసను నిల్పుటచే ఆకర్షణ కలుగు చున్నది. మైస్ వాండర్ రోహె అను వాస్తుకారుడే నియోప్లాస్టిక్ వాదియనుటకు అధికార్హత కలిగియున్నాడు. జె. జె. పి. అవుడ్ కూడ ఈ సిద్ధాంతము నుపాసించినవాడే. దీని ప్రభావము బాన్ హౌసేపై గూడ నున్నది. గ్రోపియస్, మైస్ అనువారు శిక్షకులుగానున్న హార్వర్డు శిక్షా స్థానము పై గూడ దీని ప్రభావము లేకపోలేదు.

ఎక్స్ప్రెషనిజము (Expressionism): యుద్ధానంతర కాలమున ప్రారంభమైన ఇంప్రెషనిజము (Impressionism) అనుదానికి ఇది ప్రతికూలముగా చిత్రకళారంగమున బయలు దేరినది. చిత్రకళయందు వ్యంగ్యరీతికి ప్రాధాన్యమిచ్చి వాస్తవికతను అంగముగా చేయుపద్ధతిని ఎక్స్ ప్రెష నిజము అందురు. చిత్రమునందు వివరముల యొక్క సమగ్రాకృతిపై భావనను నిలుపుటణం ప్రెషనిజము అనబడును. వాస్తువునందు ఈ సిద్ధాంతము సమకాలికమైన పిడివాదములకు ప్రతివాదముగా నావిర్భవించినది. ఎక్స్ప్రెషనిజము అను వాదమును సమర్థించిన నిర్మాత, ప్రయోజనవాదమును తిరస్కరించి, భవనాంగములను సాంకేతిక చిహ్నముల ద్వారమున ప్రకటించుటకు యత్నించును. నేత్రవైద్యమున కుపయోగపడు పరికరముల తయారు కర్మాగారము కన్నులవంటి రెండు మహోన్నత ద్వారములచే సూచింపబడినది. ప్రథమ ప్రపంచ సంగ్రామమునుండి 1924 వరకు ఎరిక్ మెండెహసన్ (Eric Mendhe Son) అనునాతడు గొప్ప వ్యంగ్యరీతి ప్రవక్తగా భావింపబడెను. అతని చిత్రములు, సొన్ స్టయిన్ గోపురము, ఈ వాదమునకు చక్కని నిదర్శనములు. జర్మను వాస్తు కారులందరు అల్పముగనో అధికముగనో ఈ యుద్యమముచే ప్రభావితులైనవారే.