పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/772

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆధునిక వాస్తువాదములు


తరువాత ఆధునిక వాస్తు శాస్త్ర చరిత్ర, వైతాళికులైన వ్యక్తులను బట్టిగాక, ప్రపంచమంతటను వ్యాపించిన యుద్యమమునుబట్టి నడచినది. దీనికి కారణము వాస్తు శాస్త్రజ్ఞులలో ముఖ్యులైన వారి నిరంతర ప్రయత్నములే. ఫ్రెంచి దేశీయుడును, స్విట్జర్లాండులో జన్మించినవాడును, ఆకృతి రచనావేత్తయు, తత్త్వజ్ఞుడును అగు లి-కార్ -బిజీయరు, జర్మనీదేశపు వాస్తు శాస్త్రజ్ఞులైన వాల్టర్ గ్రోపి యస్, మైస్ వెండర్ రోహె, ఎరిక్ మెండల్ సోహన్, డచ్ దేశీయుడగు జె. జె. పి ఔడ్ అనువారు ఈ సందర్భమున పేర్కొనదగినవారు. లి-కార్ బిజీయరు ఈ ఉద్యమ నాయకుడుగా నెన్నబడుచున్నాడు. ఆధునిక వాస్తువు ప్రాథమిక దశయందు చిత్రకళా రంగము నందలి వివిధ మతములచే ప్రభావితమైనది.

ఈ తత్వము లన్నియు సందర్శన సిద్ధాంతమును (Theory of Vision) గూర్చిన వివిధ వాదములపై ఆధారపడి యున్నవి. వీనిలో కొన్నిమాత్రమే వాస్తువు నందు ప్రతిబింబించినవి. వీటిని క్యూబిజమ్, నియోప్లాస్టీ సిజమ్, ఎక్స్ ప్రెషనిజమ్, ప్యూరిజమ్, కన్ స్ట్రక్టి విజమ్, ఫ్యూచరిజమ్ అందురు. పయిని పేర్కొనిన వాదములు వాస్తుశాస్త్రము నావరించి చాలకాలము నిలువలేదు. ఇవి ఒక నూతనరీతిలో సంయోగము నొంది ఐరోపాలో నందరిచేత నవలంభింవ బడినవి. అమెరికాదేశమున ఫలివన్ ఫ్రాంక్ లాయిడ్ రైట్ (Sallivan Frank Lloyd Wright) అను వారి మార్గ దర్శకత్వమున ఆధునిక వాస్తువు భిన్నమార్గ మవలంబించినది. కాని ప్రస్తుతము ముఖ్యమైన వాస్తుపద్ధతి యొక్కటే నిలిచియున్నది. ఈ పద్దతి అమెరికా ఐరోపా పద్ధతుల సమ్మేళన రూపమని చెప్పవచ్చును. మనదేశమునందలి ఆధునిక వాస్తుశాస్త్ర పద్ధతులగూర్చి సంక్షిప్తముగా అంత్యభాగమున చర్చింతము.

క్యూబిజం : ఇది వస్తువులను రేఖాగణిత సంబంధము అయిన ఆకారములతో కూర్చి చిత్రించు పద్ధతి. వాస్తు శాస్త్రమును ప్రభావితము గావించిన విభిన్న వాదములలో క్యూబిజమ్ (Cubism) ముఖ్యమయినది. ఈ ప్రభావమొక యుద్యమ రూపమున కలిగినది. యథాదర్శనము (perspective) కనిపెట్టబడిన తరువాత అది నవజీవన (Renaissance) యుగవాస్తువుపై ప్రభావము కలిగించినది. ఆధునిక వాస్తువుపై క్యూబిజమ్ ప్రభావముగూడ నిట్టిదే. యథాదర్శనము కనుగొనుటతో దృక్కు (Vision)త్త్రె పరిమాణకముగా మారినది. ఒకే దృక్కోణము నుండి స్థలాకాశము (Space) లోతునందును. ఇతరము లయిన రెండు పరిమాణములందును గ్రహింపబడుచున్నది. నిరంతరము పరిభ్రమించు ఒక కేంద్రమునుండి స్థలాకాశము యొక్క భౌతిక భావనను గ్రహించుటను క్యూబిజము వాదులు అలవరచుకొనిరి. వీరికి ఒక దృక్కోణమునుండి చూచుట సరిపోదు. ఒకేవస్తువును వివిధ దృక్కోణముల నుండి ఏక కాలమున పరికించి సాధ్యమైనంత సన్నిహితముగ దాని ప్రత్యేక సారమును తెలిసికొనుటకు వీరు ప్రయత్నింతురు. వస్తువు యొక్క బాహ్యరూప సందర్శనముతోనే తృప్తినందక వీరు వస్తువు యొక్క అంతర రూపమునుకూడ ప్రదర్శింతురు. యథాదర్శనము యొక్క మూడు పరిమాణములకు తోడుగా నాలుగవదిగా నెన్నబడు కాలమునుగూడ వీరు చేర్చిరి. దీనిని సాధించుటకై వస్తువును అంగ ప్రత్యంగములుగా విడగొట్టి దానిని సామూహిక చిత్రముగా ప్రదర్శించుటకు క్యూబిజము చిత్రకారులు యత్నించిరి. ఈ పద్ధతి ఆధునిక వాస్తువున చాల నూతన లక్షణములు బయలు దేరుటకు కారణమైనది. గమనాగమనము లొనర్చు సమతలములు, ఒక దానినొకటి అడ్డముగా దాటి వివిధకోణములలో చొచ్చుకొనిపోవు ఉపరితలములు, స్థలా కాశమునందు వ్రేలాడు సమతలములు మొదలగు లక్షణము లిట్టివి. దాని ప్రత్యేక పరిమాణము లలో చూడబడినదై ఒక సామాన్యమైన గోడయు, ఒక రేఖాగణిత ఆకృతియు, విశిష్టస్థాయి నందుకొని మనకు ప్రత్యేక సాంద్రానందము నీయ జాలియున్నది. ఇట్టివానికి అలంకరణపు జిలుగులు అనావశ్యక భారములే యగుచున్నవి. ఇదివరకు వాస్తుకారులు భవన విషయములో పృథుత్వ దృఢత్వములను గూర్చియే యాలోచించువారు. కాని యాధునిక వాస్తుకారులు ఘనపరిమాణమును, "సమతలముచే నియమితమైన స్థలాకాశమును" దృష్టియం దుంచుకొనుచున్నారు.

1925 సం॥న గ్రోపియన్ చే నిర్మింపబడిన డెస్సాలోని బావుహాప్, ప్యారిస్ సమీపమున లి-కార్- లిజీయర్ నిర్మించిన సెవాయ్ భవనము, క్యూలిస్టు వాస్తురీతిని