పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/760

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆధునిక పాశ్చాత్య చిత్రకళ

ఆదిలాబాదుజిల్లాలో 37 యంత్రశాలలున్నవి. కార్మికుల సంఖ్య 5098. ఇందు పురుషులు 4613 మంది, స్త్రీలు 485 మంది.

ముఖ్య స్థలములు : ముహూరు : ఇది కిన్వటు తాలూకాకు 30 మైళ్ళ దూరముననున్న చిన్న గ్రామము. ఇది పూర్వము దక్కను మహమ్మదీయ రాజులకు ప్రాంతీయ రాజధానిగా నుండెను. దీనికి కొంతదూరమున ముహూరు దుర్గము కలదు. ప్రాంతీయ విప్లవములను అణచుటకు వచ్చిన ఫిరోజుషాహ బహమనీ నెల దినములు ఇచ్చట నివసించినట్లు ముస్లిము చరిత్రకారుల కథనము కలదు.

మాక్కరు : ఇది అదిలాబాదు తాలూకాలో నున్నది. ఇచ్చట ఒక పర్వత దుర్గము కలదు. ఈ దుర్గమున ప్రాచీన మైన ఒక మసీదును, కొండ దిగువభాగమున పాండోలేనా అను దేవాలయమును ఉన్నది.

నిర్మల  : ఇది ఆదిలాబాదు జిల్లాలో చారిత్రక ప్రాముఖ్యము గల ప్రదేశములలో అతిముఖ్యమైనది. నిర్మల 18 వ శశాబ్దపు ఉత్తరార్ధమున మిర్జా ఇబ్రాహీం బేగు జఫరుద్దౌలా దీనిని స్వాధీనపరుచుకొనునంతవర కిది వెలమ రాజుల స్వాధీనములో నుండెను. ఇచట గల కొండల దిగువభాగములందు ఫ్రెంచి ఇంజనీర్లు నిర్మించిన కోటగోడ లున్నవి.

రవాణా : ఈ జిల్లాలో రవాణా సౌకర్యములు చాల తక్కువగా నున్నవి. ఆసిఫాబాదునుండి బెల్లంపల్లిగుండా మంచిర్యాలకు పోయెడి రోడ్డు 75 మైళ్ళ పొడవు కలదు. చిన్నూరునుండి పశ్చిమముగా 84 మైళ్ళలో నున్న నిర్మలకు పోవుబాటలో ఇది కలియుచున్నది. ఈ త్రోవ గోదావరీనదికి సమానాంతరముగా ఉన్నది. నిర్మలనుండి ఆదిలాబాదుకు పోవు 50 మైళ్ళ రోడ్డు ఒకటే జిల్లా ముఖ్య నగరముతో కలిపెడి రహదారి. ఈ జిల్లాలో మొత్తము రోడ్ల పొడవు 806 మైళ్ళు.

కాజీ పేటనుండి బల్లారుషాకు పోవు రైలుమార్గము ఈ జిల్లా గుండా వెడలును. అయోమార్గము తూర్పువైపున పారిశ్రామిక ప్రాంతములు, బొగ్గుగనులు, కాగితపు మిల్లులు కల ప్రదేశముల ననుసరించి పోవును. జిల్లా మధ్యభాగములోని ప్రత్తి, జొన్న మొదలగు పంటలను రవాణాచేయుటకు ముద్ ఖేడ్, ఆదిలాబాదు ఇనుప దారి ఈ మధ్య నే నిర్మింపబడినది. దీనిపొడవు 101 మైళ్ళు.

పట్టణములు  : ఈ జిల్లాలో (1) నిర్మల, (2) ఆదిలాబాదు, (3) బెల్లంపల్లి, (4) కొత్తపేట - కాగజునగరు, (5) మంచిర్యాల, (6) చిన్నూరు. (7) ఆసిఫాబాదు, (8) కిన్వటు, (9) బోధ్, (10) సిర్పూరు, (11)రాజూరా. (12) లక్సెట్టిపేట, (13) ఖానాపూరు, అనునవి జనాభా లెక్కలప్రకారము "పట్టణములు"గా వర్గీకరింపబడినవి.

భాషలు : ఈజిల్లాలో అధిక సంఖ్యాకులు తెలుగు మాతృభాషగా కలవారు. ఇచట మొత్తము 64 భాషలు మాట్లాడెడు జనులు ఉన్నారు. ముఖ్యమైన భాషలు, వానిని మాట్లాడు వారి సంఖ్యలు - ఇట్లుండును :

(1) ఆంధ్రము 5,08,133. (2) మరాఠి 1,86,028 (3) ఉర్దు 55,448. (4) గోండి 90,204. (5) లంబాడి 35,518. (6) కోలామి 8,325. (7) హింది 3,965.(8) కోయ 2,975. (9) మార్వాడి 1,036. (10) గుజరాతి 1,022. (11) ఇతర 54 భాషలు 9,867.

ఎం. కు.

ఆధునిక పాశ్చాత్య చిత్రకళ  :- ప్రాచ్య పాశ్చాత్య నాగరకతా సమ్మేళనమువలన ఐరోపా దేశములో నొక నూతన కళావిర్భావము ఘటిల్లిన కారణముగా చిత్రకళా జగత్తునం దాకాలము బై జంటైన్ యుగము (Byzantine Period) అను పేర వ్యవరింపబడెను. నాటినుండి నేటివరకు నిత్యనూతన రీతులతో నీకళ సెలయేరువలె ప్రవహించుచునే యున్నది. ఈ బై జంటైన్ యుగమునకు చెందిన కళాకారులు మహమ్మదీయ కళారీతుల ననుసరించక, విలక్షణమైన పద్ధతుల నవలంబించియున్నారు. సాధారణముగ ఈ యుగ ప్రారంభకాలమునందు గాని, క్రైస్తవశక ఆరంభకాలమందు గాని, చిత్రకారులపని, కేవలము క్రైస్తవాలయ కుడ్యముల నలంకరించుట యందును, క్రైస్తవ మతసంబంధములగుగాథలను చిత్రరూపమున చిత్రించుట యందును, మతసంబధములగు విషయములకు రూపవికాసములను కల్పించుటయందును కేంద్రీకరింపబడి యుండెను. ఈ విధముగ క్రైస్తవ మత సంబంధమగు విషయమునే ప్రధాన వస్తువుగా గ్రహించి