పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/758

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆదిలాబాదు జిల్లా

8. సిర్పూరు  : వైశాల్యము 855.68 చ. మైళ్ళు; జనాభా 1,04,091; పురుషులు 52,759; స్త్రీలు 51,352; జనసాంద్రత ప్రతి చ. మైలుకు 122 మంది,

9. చిన్నూరు : వైశాల్యము 688,64 చ. మైళ్ళు; జనాభా 86,117; పురుషులు 48,666; స్త్రీలు 42,451; జనసాంద్రత ప్రతి చ. మైలుకు 125 మంది.

10. లక్సెట్టిపేట : వైశాల్యము 734.08 చ. మైళ్ళు; జనాభా 98,812; పురుషులు 50,150; స్త్రీలు 48,662; జనసాంద్రత ప్రతి చ. మైలుకు 135 మంది.

11. ఆసిఫాబాదు : వైశాల్యము 833.92 చ. మైళ్ళు; జనాభా 92,245; పురుషులు 46,599; స్త్రీలు 45,646; జనసాంద్రత ప్రతి చ. మైలుకు 111 మంది.

పుణ్యక్షేత్రములు  : ఈ జిల్లాలోని 83 పుణ్య క్షేత్రములలో 62 హిందువులవి ; 21 ముస్లిములవి ; : ఆదిలా బాదు తాలూకాలోని కేసలాపురము, కిన్వటు తాలూకాలోని మాహూరు ప్రసిద్ధ పుణ్య క్షేత్రములు.

రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ ఫలితముగా, నాందేడు జిల్లా యందలి ముధోలు తాలూకాలోని ముధోలు, భైన్ సా, కుబేర్ సర్కిళ్లు ఆదిలాబాదు జిల్లాలో కలిసినవి. ఆదిలాబాదు జిల్లాలోని బోధ్ తాలూకా, ఇస్లాపూరు సర్కిలు, కివ్వటు, రాజూరా తాలూకాలు బొంబాయి రాష్ట్రములో చేర్చబడినవి. (1956)

పర్వతములు  : ఈ జిల్లాలో సహ్యాద్రి ముఖ్యమైన పర్వతము. ఈ పర్వతము జిల్లాలో వాయవ్యమునుండి, ఆగ్నేయదిశకు 175 మైళ్ళు వ్యాపించి యున్నది. ఇది గాక చిన్న గుట్టలుకూడ కొన్ని తూర్పు భాగమున కలవు.

నదులు  : ముఖ్యమైన నదులలో గోదావరి పేర్కొన దగినది. ఇది ఈ జిల్లాలో దక్షిణభాగమున ప్రవహించు చున్నది. ఆదిలాబాదు జిల్లా గోదావరినదివలన దక్షిణమున నిజామాబాదు నుండియు, కరీంనగరంలోని కొంతభాగము నుండియు వేరగుచున్నది. పెనుగంగానది ఇంకొక ముఖ్యమైననది. ఇది ఈ జిల్లా పశ్చిమ, ఉత్తర సరిహద్దులందు ప్రవహించి వార్ధాలో కలియుచున్నది. వార్థా, ప్రాణహిత నదులుకూడ ఈ జిల్లా ఈశాన్య పూర్వ సరిహద్దులపై ప్రవహించుచున్నవి. ఇవిగాక, పెద్దవాగు, కాపనవల్లి, అలమూను, వంటి చిన్న నదులుకూడ కలవు.

భూత త్త్వము  : ఇచట భూగర్భ నిర్మాణమున పురాణ యుగమునకు సంబంధించిన పొరల పాషాణములు, కడప, సుల్లవాయి, గోండ్వానా జాతులకు చెందిన రాళ్లు ఉన్నవి. గోండ్వానా రాళ్ళ తరగతిలో తాల్చేరు, బరాకరు, కాంప్టీ, కోటమా వేరి, చికియాల తలములు, దక్షిణ అగ్ని శీలాత్మకములు కూడి యున్నవి.

అరణ్యములు  : ఈ జిల్లాలో అధికభాగమున అరణ్యములు వ్యాపించియున్నవి. ఈ అడవులలో బిలుగు, టేకు, మామిడి, చింత, బిజాసాల్, వృక్షములు పెరుగును. ఈ అడవులందలి కొండ ప్రాంతములందు పులులు, చిరుత పులులు, ఎలుగుబంట్లు, సివంగులు, తోడేళ్ళు అడవి కుక్కలు, నివసించును. అడవుల మైదాన ప్రాంతము లందు ఎనుబోతులు, జింకలు తరచు కనుపించును.

శీతోష్ణస్థితి : అరణ్యము అధికముగా నుండుటవలన జిల్లా వాతావరణము ఆరోగ్యకరముగా నుండదు. ఉష్ణోగ్రత మే నెలలో 105° F వరకు హెచ్చును. డిసెంబరు నెలలో 56° F వరకు తగ్గిపోవును. ఇచట సగటు వర్షపాతము సంవత్సరమునకు 41 అంగుళములు.

ఖనిజములు : బలపపురాయి (Talc), సున్నపురాయి, ఎఱ్ఱలోహము, చల్ప ఆదిలాబాదు తాలూకాలో గలవు. సిర్పూరు తాలూకాలోని రాజులగుట్ట కొండలలో సుద్దరాయి, సున్నము లభించును. రాజూరా తాలూకాలోని శాస్త్రి, పూనా గ్రామములందు నేలబొగ్గు కలదు,