పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/739

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆగమ శాస్త్రములు


ఆగమముల విభాగములు : ఈ యాగమములు ప్రధానముగ శైవములు. వైష్ణవములు, శాక్తేయములు అని మూడు విధములుగ నున్నవి. శాక్తేయాగమములకు విశేషముగ తంత్రములని ప్రసిద్ధియున్నది. ఇంకను మరికొన్ని తంత్రము లున్నవి. వీనిలో శైవ వైష్ణవాగమములు దక్షిణదేశమునను, మిగిలినవి ఉత్తరదేశమునను బహుళ ప్రచారమున నున్నవి.

శైవ వైష్ణవాగమముల యందు, కేవలము మంత్ర యంత్ర-ఉపాసనాక్రమములు మాత్రమేగాక, దేవాలయ నిర్మాణము, విగ్రహనిర్మాణ ప్రతిష్ఠాది విధులును, వాస్తు-శిల్ప - గాన - పాకాది విశేషములును, పంచకాల పూజా పురశ్చరణాదులును నిరూపింపబడియున్నవి. శాక్తేయ- గాణాపత్య - భైరవాది తంత్రములయందు యంత్ర -తంత్ర - మంత్రోపాసనాదులే ప్రధానముగ నభివర్ణింపబడినవి.

శైవాగమములు - వాని ప్రభేదములు : శై వాగమములు సద్యోజాతము మొదలగు నీశ్వరుని యైదు ముఖముల నుండి ఇరువది యెనిమిది ఆగమములు ప్రాదుర్భూతములైనవి. ఆగమము అన్నిటికిని వక్త సాక్షాత్పరమ శివుడే - అని శైవుల సంప్రదాయము.

1. సద్యోజాతమునుండి - (1) కామికము (2) యోగజము. (3) చింత్యము (4) కారణము (5) అజితము -అని యైదును, 2. వామదేవమునుండి - (1) దీప్తము (2) సూక్ష్మము (3) సహస్రము (4) అంశుమాన్ (5) సుప్రభేదము అని యైదును. 3. ఆఘోరమునుండి - (1) విజయము (2) నిశ్వాసము (3) స్వాయంభువము (4) అనిలము (5) వీరము అని యైదును, 4. తత్పురుషమునుండి - (1) రౌరవము (2) మకుటము (3) విమలము (4) చంద్రజ్ఞానము (5) బింబము అని యైదును, 5. ఈశానమునుండి _ (1) ప్రోద్దీధము (2) అలితము (3) సిద్ధము (4) సంతానము (5) సర్వోత్తమము (6) పార మేశ్వరము (7) కిరణము (8) వాతుళము అని ఎనిమిదియును,

ఈ రీతిగ 28 ఆగమములు ఆవిర్భవించినవి.

వీనిలో, మొదటి పది ఆగమములు శివ భేదములనియు తరువాతి పదు నెనిమిదియు రుద్రభేదములనియు వ్యవహ రింపబడుచున్నవి. మరియు శివభేదములలో ఒక్కొక్క దానికి ప్రవర్తకులు ముగ్గురును, రుద్రభేదములలో ఒక్కొక్కదానికి ప్రవర్తకులు ఇద్దరును ప్రసిద్ధులై యున్నారు.

శైవుల సంప్రదాయము  : శివసృష్టి సమారంభమున శివభక్తి సమావేశముచే నిచ్ఛాశక్తివలన భువనోత్పత్తికై యోగమాయచే సృష్టి బీజము చిలుకరింపబడుచున్నది. అందుండి నాదము, దానిక్రింద శరత్కాల చంద్రునివంటి విత్తును ఆవిర్భవించుచున్నవి. దానిక్రింద “అంబిక" అను శక్తి తోచుచున్నది. దానిక్రింద వామశక్తికి అపర రూపముగ జయ, విజయ, అజిత, అపరాజిత, నివృత్తి, ప్రతిష్ఠ, విద్య, శాంతి, ఇజంతిక, దీపిక, లేచిక, మోచిక,వ్యోమరూప, అనంతర, అనాథ, అనాశ్రుత- అను శక్తులు గలిగి వీనిచే లోకమంతయును వ్యాపింపబడినటుల స్ఫురించుచున్నది. వీనినుండి ఏబది అక్షరములు గలుగుచున్నవి. స్వరాక్షరమున శివుడును, వ్యంజనాక్షరమున శక్తియును అధిష్ఠించి యున్నారు. స్వర వ్యంజన సమ్మేళనముచే వర్ణములు, పదములు, వాక్యములు ఏర్పడి అర్థప్రతీతి గలుగుచున్నది. అని శైవుల సంప్రదాయము.

పాద విభాగము : దీని యందు (1) జ్ఞాన (2) క్రియా (3) యోగ (4) చర్యాపాదము అని నాలుగు పాదము లున్నవి.

అందు జ్ఞాన పాదమున: పశు, పతి, పాశమ్ - అను మూడు పదార్థముల స్వరూప లక్షణ ప్రమాణములును ;(1) శివుడు (2) శక్తి (3) సదాశివుడు (4) ఈశ్వరుడు (5) శుద్ధ విద్య (6) మాయ (7) కళ (8) విద్య (9) రాగము (10) కాలము (11) నియతి (12) పురుషుడు (13) ప్రకృతి (14) బుద్ధి (15) అహంకారము (16) మనస్సు (17) శ్రోత్రము (18) త్వక్కు (19) చతుస్సు (20) జిహ్వ (21) ప్రాణము (22) వాక్కు (23) పాణి (24) పాదము (25) వాయువు (26) ఉపస్థము (27) శబ్దము ' (28) స్పర్శము (29) రూపము (30) రసము