పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/732

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆకృతి రచన - ఆధునిక నిర్మాణ ద్రవ్యములు


స్థానములు మొదలగువానికి, మునుపటికంటే ఉత్తమమైన ఆకృతిరచన చేయుటకును, మునుపటికంటే ఆరోగ్య వంతముగను, ప్రయోజనవంతముగను వాటిని ఉంచుటకును నేడు వీలగుచున్నది.

నూతన భవననిర్మాణవిధానమును, నిర్మాణద్రవ్యములును, పూర్వకాలపు వాస్తు పద్ధతులను పూర్తిగా మార్చి వేసినవి. చట్రనిర్మాణములు పూర్వకాలపు నిర్మాణ విధానముకంటే పూర్తిగా భిన్నములై యున్నవి. వాస్తు శాస్త్ర సత్యమునుగూర్చిన పూర్వభావములు నేడు మార్పు నొందవలసి వచ్చినది. పైనుండి చూచినంత మాత్రమున మోటరుబండి ఎట్లు పరుగెత్తునో, విమానము లెట్లు ఎగురునో నిర్ణయించుట అసాధ్యమైనట్లే, కేవలము కండ్లతో భవనములను చూచినంత మాత్రమున, ఆ భవనములకు ఉపయోగింపబడిన నిర్మాణద్రవ్యముల యొక్క బలిష్ఠతను నిర్ణయింపలేము. ఉదాహరణకు దృఢీకృతమైన కాంక్రీటు తీసికొందము. దీనిలో శక్తిమంతమైన అంశములు దానిలో లీనమై కన్నులకు గనుపించవు. భవనమునందలి ఒకానొక భాగము దుర్బలముగా నున్నట్లు కనుపించినప్పటికిని ఆ భాగము ఏ ఉద్దేశముతో నిర్మింప బడినదో అట్టి ఉద్దేశమునకు తగిన బలమును కలిగియుండవచ్చును. బరువు వహించుగోడలు రంగమునుండి పూర్తిగా అంతర్థానము చెందినవి. ఇప్పుడు భవనములందలి బరువు నంతటిని దృఢీకృతమైన కాంక్రీటుతో చేయబడిన ఆకృతి పంజరములుగాని, ఉక్కు స్తంభములు, దూలములుగాని భరించుచున్నవి. స్థలములకు ఆవరణము కల్పించుటకును, శబ్దమునుండియు, గాలినుండియు వానిని దూరముగా నుంచుటకొరకు మాత్రమే ఇపుడు గోడలు కట్టబడు చున్నవి. ఇప్పటి భవనములు, తమక్రిందినుండి - వీథి, తోట, చిన్న నీటిప్రవాహము మొదలైనవి పోవుచున్నను స్థిరముగా వానికాళ్ళపై అవి నిలుచుటకు సాధ్యమగు చున్నది. ఒక గోడపై జవాబుగా మరియొక గోడ ఉండవలసిన అగత్యమేమియు నేడు లేదు. ఎక్కడకు కావలసిన అక్కడకు జరుపుకొనుటకు వీలయిన తెరగోడల వలనను, అడ్డుగోడలవలనను భవననిర్మాణము చేయుట నేడు మిక్కిలి సుకరముగా నున్నది. అది యిప్పుడు నిర్మాణస్థలమునకును మానవుల అవసరమునకును, మిక్కిలి సన్నిహితముగా నున్నది. ప్రజల యొక్క ప్రస్తుతపు వసతి అలవాట్లు పూర్వములోవలె ఎప్పుడును ఒకే విధముగా మార్పులేక ఉండుటలేదు. అందువలన ఆకృతి రచనా విధానము కూడ పూర్తిగా మారవలసి యున్నది. చెరువుల, ఏరులమీదుగా వ్రేలాడు పెద్ద వితానములను ఏర్పాటు చేయుటగాని లేక భవనమునందలి ఏ అంతస్తు మీదనైనను తోటలను నాటుటగాని, ఇప్పుడు అసాధ్యమైన పనికాదు. ఇల్లు, తోట, ఇప్పుడు సులభముగా ఒకే చోట చేర్చవచ్చును. ఇండ్లలో మార్చుటకు వీలులేని నిర్బంధకరమైన పూర్వకాలపు విభాగవిధాన మంతరించినది. ఇప్పుడు ఇండ్లలోని అంతర్భాగములను అవసరమునుబట్టి శాశ్వతముగాగాని, తాత్కాలికముగాగాని ఏర్పాటు చేసికొన దగిన అవకాశము లభించినది. బల్లపరుపు మిద్దెలు ఇప్పుడు సర్వసాధారణమైనవి. ఇట్టి మిద్దెలను ఏర్పరచు విధానములు మంచుగాని, వర్షముగాని విశేషముగా కురియు దేశములందలి భవన నిర్మాతలకు తెలియనే తెలియవు. బల్లపరుపు మిద్దెలను నీరు చొరనట్టివిగాను, వాతావరణ స్పర్శితములు గాకుండునట్టివిగాను చేయవచ్చును. అందుచేతనే, తడి, పొడి, చల్లదనముగల ఏ వాతావరణమునైనను లెక్క చేయక, ఎట్టి ప్రదేశములలో నైనను, బల్లపరుపు మిద్దెలను ఉపయోగించుకొనవచ్చును. భవనముల ఆకృతి రచనయందు దృఢత్వముండవలెనను పాత ఉద్దేశముపోయి దానికి బదులు తేలికదనము సమసౌష్ఠవము ఉండవలెనను భావములు వచ్చినవి. పూర్వము భవనములను తరచుగా చెట్లతో పోల్చుచుండిరి. ఈ పోలిక యొక్క ఉద్దేశ మేమనగా, భవనములు చెట్లవలెనే భూమిలో పాతుకొనిపోయి సుస్థిరముగా మండవలెనని, కాని ఆధునిక భవనములు కేవలము ఇందుకు విరుద్ధముగా భూమిపై సమసౌష్ఠవముగా నున్నట్లు కనబడును. చట్రముల కూర్పుతో కట్టబడు భవననిర్మాణ విధానము అందమగునట్టి ఉపయోగకరమైన అనేక రూపములను ప్రసాదించినది. కాంక్రీటుతో చేయబడు ఆధునిక నిర్మాణపద్దతులు పెక్కురీతుల నూతన నిర్మాణములకు తావొసంగినవి. నిర్మాణప్రయుక్తమైన ఉక్కు కాంక్రీటులు గణిత సంబంధమైన సరియైన అంచనావేయుటకుకూడ అవకాశ మును కల్పించుచున్నవి. దీనివలన మిక్కిలి యథార్థము