పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/725

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆంధ్రోద్యమము (తెలంగాణములో)


శాసనములను సేకరించి ప్రచురించుటలో ప్రశంసనీయమైన కృషిగావించిరి.

ఈ కాలమున ఆంధ్రోద్యమమునకు అండగానిల్చిన “నీలగిరి" (స్థాపితము 24-8-1922 నల్లగొండ), “తెనుగు పత్రిక" (స్థాపితము 27-8-1922 ఇనుగుర్తి. మానుకోట తాలూకా) అను వారపత్రికలను ప్రత్యేకముగ ప్రశంసించవలసి యున్నది. 10-5-1926 నాడు ఆంధ్రోద్యమమునకు పెట్టనికోటగా “గోలకొండ పత్రిక" ప్రారంభమైనది. ఆంధ్రోద్యమవ్యాప్తికి, వికాసమునకు ఈ పత్రికలు మిక్కిలి తోడ్పడినవి. ఆంధ్రజనసంఘము కేవలము రాజకీయేతర సమస్యలనే తీసికొన్నప్పటికిని ఈ సభల సందర్భమున ప్రభుత్వము యొక్క వ్యవసాయ, పశుచికిత్స, సహకార, వైద్యశాఖల ప్రదర్శనాలు ఏర్పాటు చేసినప్పటికిని ఇతర విధములుగ ప్రభుత్వముతో సహకరించుటకు ప్రయత్నించి నప్పటికిని, ప్రభుత్వమునకు మాత్రము ఇందులో ఏవో రాజకీయాలు ఇమిడియున్నవను అనుమానము అప్పుడప్పుడు కలుగు చుండెను. ఈ అనుమానముతో సభలకు అనుమతి నిచ్చుటయందు ప్రతిబంధకములు కల్పించబడినవి. అప్పుడు హైద్రాబాదులో అమలులో నుండిన వాగ్బంధన శాసనము యొక్క ప్రతిబంధకములనుగూడ ఎదుర్కొనవలసి వచ్చెను. ఈ వాగ్బంధనశాసన ప్రయోగము వలన ప్రభుత్వము యొక్క అనుమతి లేక సమావేశాలు జరుపుటగాని, పత్రికలు నడపుటగాని, సాధ్యముగాని పరిస్థితి యేర్పడి యుండెను. తుదకు ఒక గ్రామములో పాఠశాలను పెట్టవలెననినను, గ్రంథాలయము స్థాపించవలెననినను ప్రభుత్వము యొక్క అనుమతి అవసరమై యుండెను. ఈ అనుమతి సాధారణముగా దొరకుచుండేడిది కాదు, విశ్వప్రయత్నము గావించవలసి వచ్చెడిది. ఇట్టి ప్రతికూల పరిస్థితులలో ఈ ఆంధ్రోద్యమ నౌకను మిగుల జాగ్రత్తగా నడిపిన గౌరవము శ్రీ మాడపాటి హనుమంతరావు పంతులుగారికి చెందుచున్నది. క్రమక్రమముగ ప్రత్యక్ష రాజకీయాలకు దూరముగా నున్నప్పటికిని, ప్రజల కష్ట నిష్ఠురములనుగూర్చి ఈసభలు శ్రద్ధ వహించక తప్పదయ్యెను. అందుచేత తిప్పర్తి, సూర్యాపేట, మున్నగుచోట్ల రైతుల కష్టసుఖములను విచారించుటకు రైతుసంఘములను స్థాపించుటకూడ జరిగెను. మొత్తముమీద 1930 వ సంవత్సరమువరకు అనగా మొదటి 8 సంవత్సరాల కాలము ఆంధ్ర సంస్కృతిని, ఆంధ్రభాషను కాపాడుటకు కృషిసల్పుటయే, ఆంధ్రోద్యమము యొక్క ఆశయమై యుండెను. ఈ కాలమున స్త్రీల సభలను ఏర్పాటు చేసి మహిళలలో ప్రచారము చేయు కార్యక్రమము నిర్వహించుట జరిగినది. ఆనాడు మహిళాప్రబోధము గావించినవారిలో శ్రీమతి చాట్రాతి లక్ష్మీనరసమ్మ గారిని ప్రత్యేకముగ పేర్కొనవలసి యున్నది.

ఆంధ్ర జనసంఘములు ఈ విధముగా అక్కడక్కడ స్థాపితములయి కొంతపని చేయుచుండగా" అరువదిలక్షలకు మించిన నిజాం రాష్ట్ర ఆంధ్రుల యొక్క కష్ట సుఖములను తెలిసికొనుటకును, వారి సమష్టి అభిప్రాయమును నిర్మించు టకును" ఒక మహాసభ అవసర మను భావము క్రమక్రమముగ ప్రచారమై తత్ఫలితముగ 1930 సం. మార్చి 3, 4, 5, తేదీలలో జోగిపేటలో మొట్టమొదటి ఆంధ్ర మహాజనసభ ఏర్పాటు జరిగినది. ఈ మహాసభకు అధ్యక్షులు కీ. శే. సురవరం ప్రతాపరెడ్డిగారు. ఈ మహాసభకు ఎంతో కష్టముమీద క్రింది షరతుల ప్రకారము అనుమతి లభించినది: (1) అధ్యక్షుడు పరదేశీయుడు (గైర్ ముల్కి) కాకూడదు. (2) ఇతర మతస్థులకు మనస్తాపముగాని, అనుమానము కాని కలుగు పరిస్థితి కల్పింపకూడదు. (3) రాజకీయ ప్రసక్తి ఉండకూడదు. ఈ మహా సభతోపాటు మొట్టమొదటి ఆంధ్ర మహిళాసభకూడ జరిగినది. ఈ ఆంధ్రమహాసభలో వాగ్బంధన శాసనము రద్దు చేయవలెననియు ; ప్రాథమిక విద్య నిర్బంధముగ ప్రవేశ పెట్టవలెననియు, మద్యపాన దురభ్యాసమును పోగొట్టవలెననియు, రైతులకు కొన్ని అనుకూలములు కల్పించవలెననియు, వెట్టిచాకిరిపోవలెననిచేయు, మహిళా సభలో వివాహసమస్య, వితంతువులస్థితి మొదలగు అంశములను గూర్చియు తీర్మానములు జరిగినవి. ఈ తీర్మానములను పరిశీలించినపుడు ఇవి అన్నియు రాజకీయేతర తీర్మానములే యని స్పష్టము కాగలదు. ఈ విధముగ 1930 నుండి 1946 వరకు పదుమూడు ఆంధ్రమహాసభా సమా వేశాలు జరిగినవి. ఈ సమావేశాల వలన అపారమయిన ప్రబోధము కలిగినది. మొదటి పది మహాసభలతోపాటు