ఆంధ్రోద్యమము
శాల కొక భవనమును నిర్మింపదలచి యున్నారు. ఈ ఆశయములు నెరవేర్చుటకు తగు ప్రోత్సాహము లభించునని మండలి వారాశించుచున్నారు.
రా. సు.
ఆంధ్రోద్యమము (తెలంగాణములో) :- రెండు నూర్ల పాతిక సంవత్సరాల ఆసష్టాహి పరిపాలన ఫలితముగ హైదరాబాదు రాష్ట్రములో ఆంధ్రుడు తౌరక్యాంధ్రుడై నాడు. అతనికి అరబ్బీ, పారసీభాషలతో అక్షరాభ్యాసము కావించు దుస్థితికలిగినది. ఉర్దూభాష రాజభాష,యగుటయేగాక ప్రాథమికదశనుండి విశ్వవిద్యాలయ దశవరకు బోధనాభాష కూడా అయినందున ఆంధ్ర భాషకు కొన్ని శతాబ్దాల అజ్ఞాతవాసము ప్రాప్తించినది. ఈ కాలమున ఆంధ్రుడు అన్ని రంగము లందు వెనుకబడినాడు. పరిపాలనా రంగమున అతనికి తగిన స్థానము లభించలేదు. పరదా, వరశుల్కము మొదలైన సాంఘిక దురాచారములు ప్రబలియుండెను. తెలుగురైతు పన్నుల భారముతో క్రుంగి దరిద్రేవత పాదాలక్రింద నలిగిపోయెను, చదువుకొన్న వారిసంఖ్య నూటికి మూడింటివరకు దిగజారెను. తెలంగాణమున పాఠశాలలు, కళాశాలలు చాలాకొద్దిగా నుండెను. ఇట్టి పరిస్థితిలో ప్రారంభమైనది ఆంధ్రోద్యమము.
హైదరాబాదు నగరమున 1-9-1901 వ సంవత్సరమున స్వర్గీయ శ్రీ కొమఱ్ఱాజు వేంకటలక్ష్మణ రావు ప్రోత్సాహముతో శ్రీకృష్ణ దేవరాయాంధ్ర భాషా నిలయము స్థాపిత మైనది. ఈ ప్రయత్నమున లక్ష్మణరావు గారి సహచరులుగా నిలచి పనిచేసిన వారు శ్రీ మునగాల రాజాగారును, స్వర్గీయ శ్రీ రావిచెట్టు రంగారావు గారును. కృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయమును తెలంగాణమందేకాక సకలాంధ్రమందును మొట్టమొదటి గ్రంథాలయముగా పేర్కొనవచ్చును. తెలంగాణమున హనుమకొండ మొదలైన పట్టణాలలో 1901 నుండి 1910 వరకు మరికొన్ని గ్రంథాలయాలు లక్ష్మణరావు గారు చూపిన దారిన స్థాపితమైనవి. ఈకాలముననే విజ్ఞాన చంద్రికా గ్రంథమండలి కూడ హైదరాబాదులో స్థాపిత మైనది. విజ్ఞాన చంద్రికా గ్రంథమండలిని ఆంధ్ర తెలంగాణ మధ్యదృఢమైన సాంసృతిక బంధనముగా ఏర్పాటు గావించిన లక్ష్మణరావుగారే విశాలాంధ్ర ఉద్యమానికి కూడ పునాదులు వేసిరని చెప్పవచ్చును. హైదరాబాదులో ఆంధ్రోద్యమము ఈ విధముగా ఈ శతాబ్ది ప్రారంభమున వైజ్ఞానికోద్యమముగా ప్రారంభమయి క్రమక్రమముగ రాజకీయో ద్యమమున పరిణమించినది. ఆనాడు గ్రంథాల యోద్యమము ద్వార తెలంగాణమును ప్రబోధించిన వారిలో కీ. శే. ఆదిపూడి సోమనాథ రావు, కీ. శే. మైలవరపు నరసింహశాస్త్రి గారలను ప్రత్యేకముగ స్మరించవలసి యున్నది. శేషాద్రిరమణ కవుల "నిజాంరాష్ట్ర ప్రశంస" అను ఖండకావ్యమును కూడ ప్రత్యేకముగ పేర్కొనవలసియున్నది.
ఇరువది సంవత్సరాల గ్రంథాలయోద్యమము తెలంగాణమును కొంత మేల్కొల్పినది. ఇట్టి సందర్భములో 1921 వ సంవత్సరమున హైదరాబాదు నగరమున సుప్రసిద్ధ మహారాష్ట్ర విద్వాంసుడైన ధోండు కేశవ కార్వే పండితుని అధ్యక్షతన జరిగిన సంఘ సంస్కరణ సభలలో అప్పుడు హైదరాబాదులో న్యాయవాదులుగా నుండిన ఆలంపల్లి వేంకటరామారావుగారు తమ ఉపన్యాసమును తెలుగులో ప్రారంభించగా మహారాష్ట్ర సభ్యులు చప్పట్లతో హేళనగావించిన సంఘటనము చరిత్రనిర్మాణమునకు కారణభూతమైనది. ఈ సంఘటనమును అవమానముగ భావించిన ఆంధ్రులు ఆనాటి రాత్రి కీ. శే. టేకుమాల రంగారావు, హైకోర్టు వకీలుగారి ఇంటిలో సమావేశమై ఆంధ్రజనసంఘమును స్థాపించిరి. ఇది ఆంధ్రోద్యమ చరిత్రలో మహత్తరమైన సంఘటనము. ఆంధ్రజనసంఘ స్థాపన గావించిన సమావేశములో శ్రీ బూర్గుల రామకృష్ణారావు పంతులుగారు, మాడపాటి హనుమంతరావు పంవంతులుగారు, ఆదిరాజు వీరభద్రరావుగారు మొదలైన పెద్దలు పాల్గొనియుండిరి. ఈ ఆంధ్రజన సంఘము తత్ క్షణమే తన పనిని ప్రారంభించి, నూరుగురు సభ్యులను చేర్పించి 4-4-1922 నాడు తెలంగాణ నాయకులైన శ్రీ కొండా వేంకటరంగారెడ్డిగారి అధ్యక్షతన సమావేశమును ఏర్పాటు కావించి చిత్తునియమావళి నామోదించి కార్యనిర్వాహకవర్గమును ఎన్నుకొనుట జరిగినది. ఆనాటి కార్యనిర్వాహక వర్గమునకు కీ.శే. బ్యారిస్టర్ రాజగోపాల రెడ్డిగారు అధ్యక్షులుగను, ఆంధ్రపితామహ