పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/722

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆంధ్రీతిహాస పరిశోధక మండలి


1922 సెప్టెంబరు నెలలో స్థాపితమయ్యెను. 1860 సంవత్సరము 21 చట్టము ప్రకారము ఇది నమోదు కాబడినది.

మండలి ఉద్దేశములు : (1) తామ్ర, శిలాశాసనములు, నాణెములు, పురావస్తుసామగ్రి (ఇటుకలు, బొమ్మలు, పూవులు మొదలగునవి) తాళపత్ర గ్రంథములు సంపాదించుట, (2) ఈ చరిత్ర సామగ్రిని పరిశోధించి, పండిత సభలయందు వాటి విషయమై చర్చించుట, (3) చారిత్రకోత్సవములను జరుపుట, (4) చారిత్రక వస్తుప్రదర్శనములను ఏర్పాటు చేయుట, (5) ఆంగ్లమున త్రైమాసిక పత్రికను ప్రకటించుట, (6) ఆంధ్ర రాజవంశముల చరిత్రలను ప్రకటించుట, (7) ఉచిత వఠనాలయమును, పుస్తక భాండాగారమును నెలకొల్పుట.

మండలి కార్యకలాపములు 1924 నుండి సక్రమముగా, చురుకుగా జరుగసాగెను. శ్రీ రాళ్ళబండి సుబ్బారావుగారు కార్యకర్తగా నుండి మండలి యుద్దేశ సాఫల్యమునకు అవిరళకృషి సలిపిరి. శ్రీ న్యాపతి కామేశ్వరరావు, శ్రీ రాజా కాండ్రేగుల శ్రీనివాస జగన్నాథరావు, శ్రీ డా. చిలుకూరి నారాయణరావు, శ్రీ భావరాజు వేంకట కృష్ణారావుగారలు ధనసహాయము చేసిరి. చారిత్రక వస్తుసామగ్రిని ఇచ్చిరి. ఇతర విధముల అభిమానించి తోడ్పడిరి. విజయనగరరాజులైన శ్రీ విజయరామ గజపతిరాజుగారు మండలి భవననిర్మాణమునకై పదమూడు వేల రూపాయల విరాళము నొసంగిరి. ఇట్లే పెక్కు మంది వదాన్యుల సహాయమున గౌతమీతీరమున మండలికి స్వంతభవనము నిర్మాణమయ్యెను.

మండలి కార్యకలాపములలో సంఘమునకు కీర్తిని, ధనమును, ప్రజారంజకత్వమును తెచ్చి పెట్టినది ఆంగ్లమున ప్రకటితమగుచున్న త్రైమాసిక పత్రిక. ఈ పత్రికాప్రచురణ కార్య విభాగమున 84 సంచికలు ప్రకటింపబడినవి. వీటికి పరివర్తనగ పెక్కు పత్రికలు, గ్రంథములు, మండలికి వచ్చుచున్నవి. వీటివలన వాచనాలయమును, గ్రంథఖాండారమును పరిపుష్టి చెందుచు, ప్రయోజనాత్మకముగ ఉపచరించుచున్నవి.

ప్రస్తుతము మండలికి 140 వ్యక్తి సభ్యులును, 60 సంస్థ చందాదారులు, 80 పరివర్తన సంస్థలు గలవు.

కేంద్ర, ఆంధ్రప్రభుత్వములు మండలి సేవను గుర్తించి ధనసహాయము చేసినవి. గ్రంథ భాండారమున,

1. చరిత్ర, శాసనసంపుటములూ ...3000
2. మాసపత్రికలు...1000
3. తామ్రపు రేకులు...24
4. బంగారు, వెండి, రాగి, సీసము నాణెములు అన్ని ఆంధ్ర రాజవంశములకు సంబంధించినవి...200
5. తామ్రశాసములు...4
6. శిలాశాసనములు...40
7. అమూల్యము, అపూర్వములు అయిన వ్రాత ప్రతులు...35
8. తాళపత్ర గ్రంథ ప్రతులు...1000

కలవు.

చారిత్రకోత్సవములు, జయంత్యుత్సవములు జరుపబడినవి. చాళుక్య (1922), కళింగ (1927), కాకతీయ (1932), రెడ్డి (1937), విజయనగర (1946), వేంగి (1947) రాజ్యములనుగూర్చి ఆయా రాజ్యములు ప్రధాన నగరములందు మహోత్సవములు జరుపబడినవి. ఉత్సవ దినములలో పరిశోధక విషయచర్చలు, ప్రసంగములు, చారిత్రక వస్తు ప్రదర్శనములు జరుపబడినవి. అంతియేగాక మండలి దశాబ్ది జయంత్యుత్సవము, రజతోత్సవము ఘనముగ జరుప బడినవి. పురాతత్వ పరిశోధనయందు ప్రారంభకులయిన శ్రీ జయంతి రామయ్యపంతులు గారి అభినందన జయంత్యు త్సవముగూడ జరుపబడినది. ఈ సమ్మేళనములు చరిత్ర పఠనాసక్తికిని, చరిత్ర విజ్ఞాన ప్రసారమునకును దోహద మొనర్చి, మండలి కార్యక్రమమునకు శోభ తెచ్చినవి. ఈ యుత్సవముల జ్ఞాపకార్థము అమూల్యములైన ప్రత్యేక సంచికలు సర్వాంగశోభితముగ ప్రకటితము లయినవి. ఈ సంచికలయందు, ఆయా రాజ్యములకును, విషయములకును సంబంధించిన వ్యాసములు, శాసనములు మున్నగునవి కలవు.

మండలి యుద్దేశములు చాలవరకు కొనసాగినవనియే చెప్పవలయును. ఇప్పుడు మండలివారు మూడు సంపుటములలో ఆంధ్రదేశ చరిత్రను రచించుటకు సంకల్పించినారు. వస్తుప్రదర్శనశాల కొక భవనమును, పత్రికాపఠన