ఆంధ్ర వాఙ్మయ చరిత్రము - II
గురియైనవాడు పూసపాటి సీతారామ చంద్రరాజు అను విజయనగర సంస్థానమంత్రి యని చెప్పుదురు. ఈతని
గ్రంథములలోని కెల్ల ఉత్తమమైనది కవిజన రంజనము. చంద్రమతీ పరిణయ మిందలి కథ. ఇందలి పద్యములు
పెక్కు వసుచరిత్రము నందలి పద్యములను తలపించు చుండుటచే దీనికి పిల్ల వసుచరిత్ర మను పేరు కల్గినది.
ఇందు మూడాశ్వాసము లున్నవి. ఈ కవి తన కృతుల నన్నిటినీ రామచంద్రపురము నందలి రామలిం గేశ్వరున
కంకితము చేసెను. సూరకవి శైలి లాక్షణికమును, సమాస భూయిష్ఠమునై రమ్యముగా నుండును. ఈతని తిట్టు కవిత్వము “సూరకవి తిట్టు కంసాలి సుత్తెపెట్టు" అని ప్రసిద్ధి కెక్కినది.
క్రీ.శ. 18వ శతాబ్ది యందలి ఆంధ్ర కవులలో మిక్కిలి ప్రౌఢుడని పేరందినవాడు కనుపర్తి అబ్బయా మాత్యుడు. ఇతడు సూరకవికి సమకాలికుడు (1780). మంగళగిరి పానకాలరాయని భక్తుడు. ఇతడు అనిరుద్ధ చరిత్రము, కవిరాజ మనోరంజనము అను రెండు ప్రబంధములు రచించెను. ఇందు మొదటిదాని కంటే రెండవది మిక్కిలి ప్రౌఢమై పిల్ల వసుచరిత్ర మని ప్రసిద్ధి గాంచినది. పురూరవశ్చక్రవర్తి చరిత్ర మిందలి విషయము. "వసు చరిత్రమునకు తరువాత నీతని కవిరాజ మనోరంజనముతో సరితూగదగిన ప్రబంధము లొకటి రెంటి కంటె నెక్కువగాలేవని కీ. శే. వీరేశలింగం పంతులుగారు దీనిని గూర్చి చెప్పియున్నారు. ఈ కవి భట్టుమూర్తివలె సాహిత్యమునందే కాక సంగీతమునందు కూడ మిక్కిలి ప్రవీణుడై నట్లు తెలియుచున్నది.
ఈ కాలమున మిక్కిలి ప్రసిద్ధికెక్కిన మరొక కవి కంకంటి పాపరాజు. ఇతడు నెల్లూరు మండలము నందలి ప్రళయ కావేరీపట్టణమున అమీనుగా లౌక్యాధికారమం దుండినవాడు ( క్రీ. శ. 1750-1800). తిక్కన సోమయాజీ నిర్వచనముగా రచించిన ఉత్తరరామాయణమునే ఇతడు ప్రబంధ రీతిని చంపూకావ్యముగా సంతరించెను. ఆచ్చటచ్చట కొన్ని లాక్షణిక దోషము లున్నను ఇది మిక్కిలి రసవంతమై సహృదయ హృదయరంజకముగా ఉండును. దీనికి మూలము రామాయణము నందలి ఉత్తర కాండము. తిక్కన మూలమును సాధ్యమైనంతవరకు
సంగ్రహించుటకు యత్నింపగా పాపరాజు దానిని విస్తృత మొనరించినట్లు కాననగును. ఇందలి వర్ణనలు ప్రబంధో చితములై మిక్కిలి ప్రౌఢముగా నున్నవి. రావణ కుంభ కర్ణాదుల పూర్వ చరిత్రలును, శ్రీరాముడు జనాపవాద కారణమున సీతను పరిత్యజించుటయు ఇందు చక్కగా వర్ణింపబడినవి. సీతా పరిత్యాగము, రాముని అశ్వమేధా చరణము, కుశలవులు రామాయణ గానము, నిండుసభలో సీత భూగర్భము చోచ్చుట మున్నగు ఘట్టములను వర్ణించుపట్ల పాపరాజు మిక్కిలి నేర్పు ప్రదర్శించెను. గ్రంథారంభమున ఇతడు శబ్దాలంకారములందెక్కువ మక్కువ చూపినను, పోను పోను రసపోషణమునకే ఎక్కువ ప్రాధాన్య మొసగియుండెను. ఈ కావ్యమున వృత్తములు సంఖ్య హెచ్చు. రచన సంస్కృత సమాస భూయిష్ఠమై మిక్కిలి ధారాళముగా నుండును. ఈ కావ్యమును రచించుటలో తనకు పుష్పగిరి తిమ్మన సాయ మొనరించెనని పాపరాజు చెప్పుకొనియుండుటచే కొందరీ గ్రంథమంతయుకూడ ఆతడే రచించి, పాపరాజు పేర ప్రకటించెనని యభిప్రాయపడుచున్నారు. ఈ కావ్యమును రచించుటకు ముందు పాపరాజు విష్ణు మాయా విలాసము అను యక్షగానమునుగూడ రచించియుండెను. ఈ రెండు గ్రంథములును అతని ఇష్టదైవమగు మదన గోపాలస్వామి కంకితము చేయబడినవి,
దిట్టకవి నారాయణకవి రంగారాయ చరిత్రమను మూడాశ్వాసముల చారిత్రక ప్రబంధమును రచించి (1790) బెల్లంకొండ దుర్గాధిపతియు, పద్మనాయక వంశజుడును అగు మల్రాజు రామారాయనింగారి కంకితము కావించెను. ఇది వీర రస ప్రధానమైన ప్రబంధము. బొబ్బిలి సంస్థానాధిపతియైన రావు రంగారావుగారి సేనలకును, బుస్సీ ఆధిపత్యమునందలి ఫ్రెంచిసేనలతోగూడిన పూసపాటి విజయరామరాజుగారి సేనలకును క్రీ. శ. 1757 వ సంవత్సరమున బొబ్బిలికోట దగ్గర జరిగిన యుద్ధ మిందు వర్ణింపబడినది. ఈ యుద్ధమున బొబ్బిలివారే ఓడిపోయినను వారందు ప్రదర్శించిన శౌర్య ధైర్యములు నిరువమానములు. వానిని నారాయణకవి మహోత్సాహమున వర్ణించేను. లక్షణదోషము లెడ నెడ గోచరించు చున్నను ఈ కావ్యము హృద్యమైన రచనతో కూడి మిగుల