పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/673

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆంధ్ర వాఙ్మయ చరిత్రము - II


సంస్కృతాంధ్రములందు గొప్ప పండితుడు. ఇతని విష్ణు పురాణము సంస్కృత గ్రంథమును చక్కగా అనుసరించు చున్నది. ఇందలి రచన సంస్కృత సమాస భూయిష్ఠమును, ప్రౌఢమునునై నిర్దుష్టముగా నున్నది. దాక్షిణాత్య గ్రాంథికాంధ్ర రచయితలలో ఇత డగ్రగణ్యుడు.

మధుర సంస్థానాశ్రితులు కాకపోయినను, విజయరంగ చొక్క నాథుని కాలమునం దేయుండిన శ్యామరాయకవి, వేంకటసుబ్బకవి అనువారు వచనమున రామాయణములను రచించిరి. రామభద్రకవి అను నతడు హాలాస్య మాహాత్మ్యమును వచనకావ్యముగా వ్రాసియుండెను.

పుదుక్కొటను పరిపాలించిన రాజులు ఆంధ్రనాయకులు కాకపోయినను, ఆంధ్రభాషపై అభిమాన మూని అందు కవులను పండితులను పోషించుటయేకాక స్వయముగా గ్రంథరచనకూడ కావించిరి. క్రీ. శ. 1682 నుండి 1730 వరకు పరిపాలించిన రఘునాథునిపై ఆంధ్ర కవులు రచించిన చాటువులు పెక్కు కానబడుచున్నవి. అతని తమ్ముని కుమారు డైన రామస్వామి నృపాలుని నాయకు నొనర్చి ఉద్దండ విద్వత్కవియైన శేషయార్యుడు శృంగారవాణీదండకము రచించెను. అతని పుత్రుడైన తిరుమలనాయకుడును, మనుమడైన రాజగోపాల నాయకుడును పలువు రాంధ్రకవులను పోషించిరి. విజయ రఘునాథుడు (క్రీ. శ. 1730- 69) నుదురుపాటి కవుల నాదరించి వెంకన రచించిన ఆంధ్రభాషార్ణవమను నిఘంటువును కృతిపొందెను.

నుదురుపాటి వెంకన పైనిఘంటువునే కాక రాజవంశ ప్రశస్తి, మల్లు పురాణము, రఘునాథీయము అను గ్రంథములను కూడ రచించెను. ఇందలి తుది రెండు గ్రంథములును అముద్రితములు. ఇతడు విద్వత్కవి. ఇతని తండ్రి మహోద్దండకవి అని ప్రశస్తిపొందిన సీతారామార్యుడు. ఇతని రచన లేవియు లభించుటలేదు.

రఘునాథుని పుత్రుడగు రాయ రఘునాథుడు (క్రీ.శ.1769-89) వేద వేదాంతముల తోడను వాత్స్యాయనాది శాస్త్రముల తోడను పరిచయముగల వాడును నిరంకుశ ప్రతిభా భాసుడునై పార్వతీ పరిణయమను ప్రబంధమును రచించెను. ఇతడు ఉద్దండకవి. సీతా రామార్యుని శిష్యుడు. వెంకనకు సతీర్థ్యుడు. ఇతని

పార్వతీ పరిణయము నూతనములైన కల్పనలతోడను, మధురమంజులములైన పదములతోడను, లోకోత్తరములైన వర్ణనములతోడను కూడి మిక్కిలి సరసముగా నుండును. ఇందెడ నెడ కాళిదాసుని కుమారసంభవ శ్లోకములకు అనువాదములు కానవచ్చును. అచ్చటచ్చట వ్యాకరణ మర్యాద నతిక్రమించి ప్రయోగములు కూడ నున్నవి. ఈ కావ్యము నుదురుపాటి వెంకనయే రచించి రాయ రఘునాథుని పేర ప్రకటించెనను ఐతిహ్య మొక్కటి కలదు. కాని దానిని సమర్థించుటకు తగిన ఆధారములు లేవు.

రాయ రఘునాథుని తరువాత పుదుక్కొట సింహాసనము నధిష్ఠించిన విజయరఘునాథుడు కూడ కవిపండిత పోషకుడే. వెంకన కుమారుడగు సాంబకవి ఈతని సమకాలికుడు. రఘునాథుని గురువును, మహాపండితుడు నగు గొనసూరి నారాయణయ్యంగారు భానుమిశ్రుని రస మంజరి యను శృంగార శాస్త్రగ్రంథమును తెనిగించెను. ఇందలి కవిత్వము ప్రౌఢమై మిక్కిలి సరసముగా నుండును.

విజయ రఘునాథుని తమ్ముడైన రఘునాథుడును (క్రీ. శ. 1835-39) కవులను పోషించి వారి ప్రశంసలకు పాత్రు డయ్యెను. ఇతనికి "His Excellency" అను బిరుదము కలదు. ఇతని కుమారుడగు రామచంద్రుడు వెంకన మనుమడైన చిదంబరకవిని పోషించెను. ఇతడు రామచంద్రుని పేర చంద్రాననా దండకమును రచించెను.

విజయనగర రాజ్యమంతరించిన పిమ్మట స్వతంత్రములైన సామంతరాజ్యములలో మైసూరు రాజ్య మొకటి.ఇచ్చటకూడ కొందరు కవులు పద్యగద్య కావ్యములను రచించి ఆంధ్రవాణి నలంకరించిరి. ఇచ్చటి పద్య కావ్యములలో ప్రధానమైనది శుకసప్తతి. దీనిని రచించిన వాడు పాలవేకరి కదిరీపతి (క్రీ.శ.1660). ఇతని పూర్వులు కోలారు ప్రాంతమున సామంత రాజులుగా నుండిరి. శుక సప్తతి చక్కని కథాకావ్యము. చిలుక చెప్పిన కథ లగుటచే దీనికీ పేరు కల్గినది. సప్తతి అనగా డెబ్బది. కాని ఇందు పూర్తిగా డెబ్బది కథలు లేవు. స్త్రీల మనశ్చాం చల్యమును ప్రదర్శించుటకై ధౌమ్యు డీకథలను చిలుకచే ధర్మరాజునకు చెప్పించెను. ఇందు కొన్ని కథలతి శృంగార