పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/671

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆంధ్ర వాఙ్మయ చరిత్రము - II


అహల్యా సంక్రందనము ఇంద్రాహల్యల శృంగార వృత్తాంతమును వర్ణించు ప్రబంధము. వేంకట కృష్ణ నాయకుడు పురాణ మందలి కథను కొంతమార్చి శృంగార రసమునకు ఎడ నెడ హాస్యమును కూడ జోడించి ఈ ప్రబంధమును నిర్మించి నాడు. ఇందలి శృంగారము రాధికా సాంత్వనమందలి దానివలె నౌచిత్య మర్యాద నతిక్రమింపక మిక్కిలి సభ్యముగా ఉన్నది. ఇందలి కవిత్వము మృదుపద సంకలితమే అయ్యు. అచ్చటచ్చట శబ్దాలంకారములతోకూడి కడు రసవంత ముగా నున్నది. వేంకటకృష్ణప్ప నాయకుడు రచించిన జైమిని భారతము, సారంగధర చరిత్ర అను వచన కావ్యములు రెండింటిలో రెండవ దింకను ముద్రితము కాలేదు. జైమిని భారతము నాతడు పిల్లలమట్టి పినవీరభద్రుని పద్యకావ్యము ననుసరించియే వ్రాసెను. అందలి పదములు, సమాసములు పెక్కు యథాతథముగ ఇందనువదింపబడినవి. ఈ కావ్యము విజయరంగ చొక్కనాథున కంకితము చేయబడినది. ఇందాశ్వాసాద్యంతము లందు పద్యములు కూర్పబడినవి. సారంగధర చరిత్రము శ్రీరంగనాథున కంకితము చేయబడినది. ఇందు మూడాశ్వాసము లున్నవి. ఇది వేంకటకవి కృత సారంగధర చరిత్ర ననుసరించి వచనీకరింపబడియుండునని విమర్శకుల తలంపు. ఇతరులగ్రంథములందలి పదముల నెక్కువగా గ్రహింప యత్నించుటచే కాబోలు'ఈతని వచన కావ్యములలో పద్యకావ్యములందున్న సౌకుమార్యము కానరాదు.

శేషము వేంకటపతి తారా శశాంకుల ప్రణయగాథను ఐదాశ్వాసముల ప్రబంధముగా రచించి విజయరంగ చొక్కనాథుని మంత్రియగు వంగల సీనయామాత్యునికి అంకితముచేసెను. ఈ సీనయమంత్రికూడ కవియేయనియు రామానుజ చరిత్రను, మన్నారు రంగాంకిత గేయమును రచించియుండెననియు వేంకటపతి చెప్పియున్నాడు. దాక్షిణాత్యాంధ్ర కవులలో చేమకూరకవి తరువాత చెప్పదగినవాడు శేషము వేంకటపతి. ఈతడు తారా శశాంక విజయమున శృంగారమును స్వేచ్ఛగా వర్ణించుట చేతను, పరాంగనా ప్రణయమును సమర్థించు పద్యములు కొన్ని రచించుటచేతను, ఆధునిక విమర్శకు లీతనికి

ఔచిత్య దృష్టి లేదని తెగడుచుందురు. ఆకాలపు పరిస్థితులను దృష్టిలో నుంచుకొని చూచినచో ఆ కావ్యము నందలి శృంగారవర్ణనమంత మితిమీర లేదనియే తోచును. మరియు గ్రంథస్థ పాత్రల నోట చెప్పించిన భావము లన్నింటిని గ్రంథకర్త కంటగట్టుటయు నంత యుక్తము కాదు. ఇందలి కథ కొంత నీతిబాహ్య మనుమాట సత్యమేయైనను కవిత్వము మాత్రము మృదుమధురమై, లలితపదఘటితమై గంభీర భావశోభితమై సహృదయ హృదయానంద సంధాయకముగా నుండు ననుటకు ఆంధ్రదేశమున ఆ గ్రంథమునకు గల బహుళ ప్రచారమే తార్కాణము.

వెలగపూడి కృష్ణయ్య మాలతీ మాధవము, గౌళికా శాస్త్రము, భానుమద్విజయము అను పద్యకావ్యములను, చతుర్విధ కంద శతకమును, వేదాంతసార సంగ్రహము అను వచనకావ్యమును రచించెను. ఇందు భానుమద్విజయ మొక్కటే లభించుచున్నది. భానుమంతుడను విప్ర యువకుడు ఉజ్జయినీ రాకుమారిని వివాహమాడిన వృత్తాంత మిందలి వస్తువు. ఇందై దాశ్వాసములు కలవు. ఇందలి ఐదవ ఆశ్వాసమున యోగశాస్త్రము వివరింప బడినది. ఇది శైవమత ప్రతిపాదకమైన గ్రంథము. ఆ మత ప్రాధాన్యము చేతనే కాబోలు ఇది తమిళ భాష లోనికి కూడ అనువదింపబడినది. ఇందలి కవిత్వము ప్రౌఢముగా నుండును. బ్రౌన్ దొర ఈ కావ్యమును ప్రశంసించి యుండెను.

విజయరంగ చొక్కనాథుని ఆస్థానమున కథాశుకవినని చెప్పుకొన్న కుందుర్తి వేంకటాచలపతి మిత్రవిందా పరిణయము, భారత భాగవత వచన కావ్యములు, పెక్కు నాటకములు, చాటు కృతులు చెప్పియుండెనని తెలియుచున్నది. ఇందు మిత్రవిందా పరిణయ మొక్కటే లభించు చున్నది.ఇది ఆరాశ్వాసముల ప్రబంధము. శ్రీకృష్ణు డష్ట మహిషులలో నొక తెయైన మిత్రవిందను పరిణయమాడుట ఇందలి విషయము. ఇందు ప్రబంధ లక్షణము లన్నియు కానిపించును. ప్రబంధోచితములైన సర్వ వర్ణనలను చొప్పించుటకు అనువుగా కవి కథను కల్పించెను. అందుచే కథయు కవిత్వమును కూడ జీవకళకు దూరమై కృత్రిమములుగా కనిపించును.