పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/668

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆంధ్ర వాఙ్మయ చరిత్రము . II.


కవితా సర్వంకష మనీషా విశేష డారద. రాజనీతి విద్యా విశారద, విజయరాఘవ మహిపాల రచిత కనకాభిషేక. ఈమె సంగ్రహ భారతము, సంగ్రహ భాగవతము, సంగ్రహ రామాయణము, ఉషా పరిణయము, మన్నారు.దాస విలాసము అను ప్రబంధములు, మన్నారుదాస విలాస యక్షగానము అను ఆరు గ్రంథములు రచించెను. ఇవిగాక ఆమె రచించిన పాటలు పదములు పెక్కులు గలవు. మన్నారుదాస విలాస యక్షగాన మొక్కటే ఇటీవల ముద్రణ మందినది. మన్నారుదాస విలాస ప్రబంధమున నాయకుడు విజయ రాఘవుడు, ఆతనికి మన్నారుదాసు డను నామాంతరము కలదు. ఉషా పరి ణయమందలి కథ హరివంశమునుండి గ్రహింపబడినది. కథా నిర్మాణమందును, కవితా పటిమయందును ఇందు కవయిత్రి చాల నేర్పు ప్రదర్శించినది.

రంగాజమ్మ మన్నారుదాస విలాస ప్రబంధమునందలి కథనే గ్రహించి ఆ పేరుతోడనే యొక యక్షగానము కూడ రచించినది, రాజగోపాలస్వామి బ్రహ్మోత్సవముల సందర్భమున కాంతిమతి యను కన్య విజయరాఘవుని కాంచి కామించి అతనిని పెండ్లియాడినకథ ఇందలి వస్తువు. ఇందలి కథ విజయరాఘవుడు రచించిన రఘునాథాభ్యుదయ మందలి కథ కించుమించుగా ప్రతిబింబము. కథా చమత్కార మంతగా లేకపోయినను, ఈ కాలమున వెలువడిన యక్షగానములలోని కెల్ల ఇది మిక్కిలి ప్రశస్తి గాంచినది. ఇందు పాటలు, పదములు, దరువులు మున్నగువానితో పాటు పద్యములు కూడ హెచ్చుగా కనిపించును. రంగాజమ్మ తన మన్నారుదాస విలాస ప్రబంధమునందలి పద్యములనే సందర్భానుసారముగా నిందు జొప్పించి యుండునని పండితుల అభిప్రాయము. ఈమె సంభాషణ ములు హాస్యరస చమత్కారముల తోడను, పాత్రోచిత భాషతోడను గూడి మిక్కిలి సహజముగా నుండును.

కోనేటి దీక్షితుడను శ్రీ వైష్ణవ పండితుడు విజయ రాఘవుని కొలువుననుండి అతనికి రామాయణ ముపదేశించి వివిధములైన సత్కారములను పొందెను. విజయ రాఘవుడు మదనమంజరిని వివాహమాడిన వృత్తాంతమును కై కొని విజయరాఘవ కల్యాణము అను యక్షగానము రచించెను.

విజయ రాఘవుని పట్టంపు కవి యగు కామరసు వేంకటపతి సోమయాజి విజయరాఘన చంద్రికావిలాస మను యక్షగానమును రచించెను. విజయరాఘవుని చంద్రికా విహారము అందు మనోహరముగా వర్ణింప బడినది.

పురోషోత్తమదీక్షితు డను మరియొక కవి సత్రమకల్ అను నామాంతరముగల తంజాపురాన్న దాన మహానాటకమును వ్రాసెను. ఇది శృంగార హాస్యరసాద్భుత రస ప్రధానమని కైవారమును బట్టి తెలియుచున్నది.

విజయరాఘవుని కుమారుడైన మన్నారు దేవుడు విజయ రాఘవాభ్యుదయము, హేమాబ్జనాయికా పరిణయము అను రెండు గ్రంథములు రచించెను. ఇందు విజయరాఘవాభ్యుదయము ప్రబంధమో, యక్షగానమో తెలియదు. రెండవది యక్షగానమే. క్షీరసముద్రమున పుట్టిన అమృతమును సురలకొసగి సముద్రుని కూతురగు రక్తాబ్జ యనునామెను మన్నారుదేవుడు వివాహమాడిన వృత్తాంత మిందలి విషయము.

విజయరాఘవుని తరువాత తంజావూరు రాజ్యము మొదట మధుర' నాయకులకును, పిమ్మట మహారాష్ట్రులకును వశమైనది. ఈ మహారాష్ట్ర రాజులు తెనుగు నభ్యసించి ఆ భాషను మాటాడుటయే కాక అందు కావ్యములు నాటకములు రచించిరి. పలువు రాంధ్రకవులను, పండితులను, గాయన గాయనీమణులను ఆదరించి పోషించిరి. వీరి కాలమున పెక్కు ద్విపద కావ్యములును, యక్షగానములును రచింపబడినవి.

తంజావూరు సంస్థానమునకు చెందినవాడు కాకపోయినను విజయరాఘవునకు సమకాలికుడును జింజి రాజ కుటుంబమునకు చెందినవాడును అగు ఒక మహాకవిని గూర్చి ఇచ్చట చెప్పవలసియున్నది. అతడు పవరము చిన నారాయణరాజు (క్రీ. శ. 1600-50). ఇతడు రచించిన కావ్యము 'కువలయాశ్వ చరిత్రము', ఇందలి కథ మార్కండేయ పురాణమునుండి గ్రహింపబడినది. చిన నారాయణరాజు ఆ కథయందు పెక్కు మార్పులు కావించెను. ఋతుధ్వజుడను రాజు మదాలసయను గంధర్వ రాజకన్యను వివాహమాడిన వృత్తాంత మందలి ప్రధాన కథ. తాళ కేతువను రాక్షసుడు ఖుతుధ్వజుని వంచించి మదాలసను కొనిపోయిన కథ, ఆశ్వతురుడు కైలాసమువ