పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/665

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆంధ్ర వాఙ్మయ చరిత్రము - II


లుండుటచే కేవల దేశిరచన లని చెప్పుటకు వీలు లేదనియు, తెలుగు యక్షగానములను చూచి తమిళులును, కన్నడులును తమతమ భాషలలో వానిని రచించి రనియు, తంజావూరు కవులు వానిలో పెక్కు మార్పులు చేసి వానికి వన్నె కలిగించి రనియు, యక్షగానములలో పాత్రపోషణమునకే కాని కథాకల్పనమున కంత ప్రాధాన్యము లేదనియు, లేదనియు, శ్రీ డా. నే. వేంకటరమణయ్య గారభిప్రాయ పడుచున్నారు.

తంజావూరు నాయక రాజ్యముమాట విన్నంతనే స్మృతి పథమున తోచువాడు రఘునాథనాయకుడు, (క్రీ.శ.1614-1633). ఇతడు సర్వవిధముల రాయలవారి కెనయని చెప్పదగినవాడు. ఇతడు సుమారు వంద గ్రంథములు రచించెను. వానిలో రామాయణము, వాల్మీకి చరిత్రము అను రెండు గ్రంథములు మాత్రమే లభించు చున్నవి. ఈ రామాయణమైనను సమగ్రముగా లేదు. ఇందు బాలకాండమున నాల్గవ ఆశ్వాసములో కొంత భాగము మాత్రమే కానబడుచున్నది. కథ కోసలదేశ వర్ణనతో నారంభమై పుత్రకామేష్టితో ముగియుచున్నది. ఇందలి కవిత్వము రసవంతములైన వర్ణనలతోడను, మధుర మంజులమైన పదప్రయోగము తోడనుకూడి మనోహరముగానున్నది. రఘునాథు డిందలి ద్వితీయాశ్వాసమున ఋశ్యశృంగుని కథను చాల హృద్యముగా రచించి యున్నాడు. మధురవాణి తాను రఘునాథుని రామాయణము నొకదానిని సంస్కృతీకరించినట్లు చెప్పుకొన్నది. అది పరిమాణమున చాలా చిన్నదగుటచే పై రామాయణ మగునో కాదో అని సందేహ ముదయించుచున్నది. వాల్మీకి చరిత్రము మూడాశ్వాసములతోకూడిన ప్రబంధము. ఇం దాదికవియైన వాల్మీకి మహాముని పూర్వ జీవితము వర్ణింపబడినది. ఇందు వస్వ్తెక్యము కొరవడినట్లు కానిపించును. గ్రంథారంభమునందలి తీర్థాదుల వర్ణన మతిదీర్ఘమై కొంత విసువు కలిగించుచున్నది. తృతీయాశ్వాసమునందలి రంభోర్వశీ పరాభవ వృత్తాంతము రమ్యముగా నున్నది. శృంగార సావిత్రియను రెండా శ్వాసముల ప్రబంధ మొకటి రఘునాథుని పేర ముద్రితమైనది. అది అతని రచనమగునో కాదో చెప్పజాలము.యజ్ఞ నారాయణ దీక్షితుడు తన సాహిత్య రత్నాకరమున రఘునాథుడు యామద్వయమున పారిజాతాపహరణ కావ్యమును చెప్పి తండ్రిచే కనకాభిషేకము నొందెనని తెల్పి యున్నాడు. దీనినిబట్టి ఈ కవిరాజు ఆశుకవిత్వమున కూడ నిపుణుడని తెలియుచున్నది.

పై పద్యకావ్యములనేకాక రఘునాథుడు అచ్యుతాభ్యుదయము, నల చరిత్ర అను రెండు ద్విపద కావ్యములనుకూడ రచించియుండెను. ఇందలి నలచరిత్ర ఆంధ్ర భాషోల్లాసినీ అను మాసపత్రికయందు ముద్రితమైనది. ఇందెనిమి దాశ్వాసములలో నల దమయంతుల కథ సంపూర్ణముగా చెప్పబడినది. ఇందు వర్ణన విధానమును, రసపాత్రపోషణ చాతుర్యమును రఘునాథుని అప్రతిమానమైన ప్రతిభను చెప్పక చెప్పుచున్నవి. నల దమయంతుల వనసంచారవర్ణనము పఠించినచో ఈ విషయము తేటతెల్లమగును. అచ్యుతరాయాభ్యుదయము పేరునుబట్టి రఘునాథుని తండ్రి చరిత్రను వర్ణించు కావ్యమని తెలియుచున్నది. రఘునాథుఁడు రుక్మిణీ పరిణయము అను యక్షగానమునుకూడ రచించినట్లు యజ్ఞ నారాయణ దీక్షితులు చెప్పియున్నాడు. (శ్రీ రుక్మిణీ కృష్ణవివాహ యక్షగానం ప్రబంధానపినైక భేదాన్) కాని అది ఇంకను ముద్రితము కాలేదు

రఘునాథుని ఆస్థానమునందలి కవులకేకాక దక్షిణాంధ్రయుగమునందలి కవీంద్రుల కెల్ల తలమానికమని చెప్పదగినవాడు చేమకూర వేంకటకవి. ఇతడు రచించిన ప్రబంధములు రెండు. సారంగధర చరిత్రము, విజయ విలాసము, ఈ రెండు ప్రబంధములును రఘునాథ భూపాలునికే అంకితముచేయబడినవి. సారంగధర చరిత్రము మాళవరాజగు రాజమహేంద్రుని భార్య చిత్రాంగి తన సవతి కుమారుడగు సారంగధరుని వలచి వలపింప యత్నించిన కథ. ఇది వేంకటకవి ప్రథమరచన. ఇది శృంగార రసాభాసముతోకూడి వస్తుస్వభావమునుబట్టి కొంత జుగుప్సను కలిగించుచున్నది.

విజయవిలాస మాంధ్రసరస్వతి కపూర్వమైన అలంకారము. ఇందు పాండవ మధ్యముడైన విజయుడు ఉలూచి, చిత్రాంగి, సుభద్ర అను మువ్వురు జవ్వనుల చెట్టపట్టి కావించిన విలాసములు మూడాశ్వాసములలో వర్ణింపబడినవి. భారతము నందలి కథనే గ్రహించి దానిని